మీ బైక్ మైలేజ్ ఉన్నట్టుండి తగ్గిపోయిందా.. సర్వీసింగ్ చేయించేటప్పుడు ఈ తప్పులు అస్సలు చేయొద్దు

అత్యంత అత్యవసరమైన పని మీద బయల్దేరినప్పుడు.. లేదా ఆఫీస్‌కి టైమ్‌ అయిపోతున్న వేళ నడిరోడ్డుపై మీ బైక్ ఆగిపోయిందా? ఇలాంటి పరిస్థితి ఎదురైనప్పుడు కలిగే నిరాశ, కోపం మాటల్లో చెప్పలేనివి. చాలామంది నిత్యం బైక్ వాడుతుంటారు కానీ, దానికి సరైన సమయంలో సర్వీసింగ్ చేయించడంలో మాత్రం తీవ్ర నిర్లక్ష్యం వహిస్తుంటారు. అసలు సర్వీసింగ్‌లో తప్పనిసరిగా చెక్ చేయించాల్సిన అంశాలు ఏంటో తెలుసుకుందాం..

మీ బైక్ మైలేజ్ ఉన్నట్టుండి తగ్గిపోయిందా.. సర్వీసింగ్ చేయించేటప్పుడు ఈ తప్పులు అస్సలు చేయొద్దు
How Often Should You Service Your Bike

Updated on: Aug 02, 2026 | 11:50 AM

బైక్ అనేది ప్రతి ఇంటా నిత్య జీవితంలో భాగమైపోయింది. ఆఫీస్‌కు వెళ్లాలన్నా, సరుకులు తేలాలన్నా, అత్యవసర పనులకైనా బైక్ ఉండాల్సిందే. అయితే చాలామంది బైక్ నడపడంపై చూపే శ్రద్ధ.. దాని రెగ్యులర్ సర్వీసింగ్ విషయంలో చూపించరు. సర్వీసింగ్ ఆలస్యమైనా లేదా మెకానిక్ వద్ద వదిలేసి సరిగ్గా పర్యవేక్షించకపోయినా, అది నడిరోడ్డుపై హ్యాండ్ ఇచ్చి సమయాన్ని, డబ్బును వృథా చేస్తుంది. అందుకే బైక్ సర్వీసింగ్ చేయించేటప్పుడు గ్యారేజీలో మెకానిక్‌ని ఏ ఏ విషయాలు చెక్ చేయించాలో తెలుసుకోవడం అత్యంత ముఖ్యం. మీ వాహనం లైఫ్ పెరగడానికి, మైలేజ్ పెరగడానికి ఉపయోగపడే విషయాల గురించి తెలుసుకుందాం..

ఆయిల్ ఇంజిన్ ఆరోగ్యానికి ప్రాణవాయువు..

ఇంజిన్ ఆయిల్ నాణ్యతను బట్టే బైక్ ఆయుష్షు, పికప్ ఆధారపడి ఉంటాయి. ప్రతి 2000 నుండి 2,500 కిలోమీటర్లకు ఒకసారి లేదా సర్వీసింగ్ సమయంలో ఇంజిన్ ఆయిల్ కచ్చితంగా మార్చాలి. ఆయిల్ మార్చే ప్రతిసారి ఆయిల్ ఫిల్టర్‌ను క్లీన్ చేయించాలి లేదా కొత్తది వేయించాలి. నల్లగా మారిన, చిక్కదనం కోల్పోయిన ఆయిల్ వల్ల ఇంజిన్ తీవ్రంగా వేడెక్కి, పికప్ తగ్గిపోతుంది.

ఎయిర్ ఫిల్టర్: ఎప్పుడు మార్చాలి?

బైక్ ఇంజిన్‌లోకి దుమ్ము, ధూళి వెళ్లకుండా అడ్డుకునేది ఎయిర్ ఫిల్టరే. సాధారణంగా ప్రతి 10,000 నుండి 15,000 కిలోమీటర్లకు ఎయిర్ ఫిల్టర్‌ను కొత్తది మార్చడం మంచిది. మీరు నిత్యం దుమ్ము, ధూళి ఎక్కువగా ఉండే రోడ్లలో ప్రయాణిస్తే.. ప్రతి 8,000 కిలోమీటర్లకే దీన్ని మార్చాల్సి ఉంటుంది. క్లీన్ ఎయిర్ ఫిల్టర్ వల్ల ఇంజిన్‌కి స్వచ్ఛమైన గాలి అంది మైలేజ్ అద్భుతంగా పెరుగుతుంది.

 బ్రేకులు – టైర్ల చెకప్

రోడ్డుపై ప్రయాణంలో మీ ప్రాణాలకు రక్షణ ఇచ్చేవి బ్రేకులు, టైర్లే. ముందు, వెనుక బ్రేక్ ప్యాడ్స్‌ను మెకానిక్‌తో చెక్ చేయించాలి. బ్రేక్ వేసినప్పుడు శబ్దం వస్తుంటే వెంటనే ప్యాడ్స్ మార్చాలి. టైర్ల థ్రెడ్ అరిగిపోయిందా లేదా చెక్ చేయాలి. సరైన ఎయిర్ ప్రెజర్ మెయింటెన్ చేస్తే వర్షాకాలంలో లేదా వంపు తిరిగేటప్పుడు బైక్ స్కిడ్ కాకుండా ఉంటుంది.

చైన్ ల్యూబ్రికేషన్ – స్పార్క్ ప్లగ్ మెయింటెనెన్స్

చాలామంది నిర్లక్ష్యం చేసే అంశాల్లో చైన్, స్పార్క్ ప్లగ్ ప్రధానమైనవి.

చైన్ క్లీనింగ్: బైక్ చైన్ పొడిగా ఉంటే తొందరగా అరిగిపోవడమే కాకుండా రన్నింగ్‌లో శబ్దం వస్తుంది. ప్రతి సర్వీసింగ్‌లో చైన్‌ను క్లీన్ చేయించి ల్యూబ్ రాయించాలి.

స్పార్క్ ప్లగ్: బైక్ వెంటనే స్టార్ట్ అవ్వాలంటే స్పార్క్ ప్లగ్ క్లీన్‌గా ఉండాలి. సర్వీసింగ్‌లో దీన్ని ఇసుక కాగితంతో తుడిపించి, ప్లగ్ గ్యాప్‌ను పర్ఫెక్ట్‌గా సెట్ చేయించాలి.

చిన్న సలహా: బైక్ సర్వీసింగ్‌కు ఇచ్చినప్పుడు మెకానిక్‌పైనే పూర్తిగా వదిలేయకుండా, దగ్గరుండి ఈ ప్రధానమైన పార్ట్స్ చెక్ చేయించడం వల్ల మీ వాహనం ఎప్పటికీ కండిషన్‌లో ఉంటుంది.

Loading...
Unable to load recommendations.
Follow Us