
మీరు ఏదైనా ప్రాంతానికి వెళితే అక్కడ బస చేసేందుకు హోటల్‌కు వెళుతుంటారు. నేరుగా వెళ్లడం లేదా ముందుగానే యాప్స్ ద్వారా బుక్ చేసుకుని వెళ్లడం లాంటివి చేస్తూ ఉంటారు. ప్రస్తుతం అనేక హోటల్ ఆన్‌లైన్ బుకింగ్ ఫ్లాట్‌ఫామ్స్ అందుబాటులో ఉన్నాయి. అయితే హోటల్‌లో చెక్ ఇన్ అవ్వడానికి ఆధార్ కార్డు అడుగుతుంటారు. ఎవరిదైనా ఒకరిది ఆధార్ అందించాల్సి ఉంటుంది. కొన్నిసార్లు ఒకరి కంటే ఎక్కువమంది ఆధార్ కార్డులు కూడా అడగవచ్చు. ఇప్పటివరకు ఆధార్ జిరాక్స్ కాపీలను హోటల్‌లో తీసుకునేవారు. అయితే ఇక నుంచి అలాంటి అవసరం లేదు. హోటల్ చెక్ ఇన్ రూల్స్ పూర్తిగా మారుతున్నాయి. ఫిజికల్ కాపీల అవసరం లేకుండా ధృవీకరణ కోసం డిజిటల్ వ్యవస్థను తీసుకొస్తున్నారు.
ప్రస్తుతం ఆధార్ కార్డు జిరాక్స్ అవసరం లేకుండా క్యూఆర్ కోడ్, ఓటీపీ ధృవీకరణ ద్వారా వెరిఫికేషన్ పూర్తవుతుంది. జిరాక్స్ కాపీలను అందించడం ద్వారా దుర్వినియోగం అయ్యే అవకాశం కూడా ఉంటుంది. దీని వల్ల వినియోగదారుడి సమాచారానికి భద్రత ఉండటం లేదు. దీనిని దృష్టిలో పెట్టుకుని డిజిటల్ ధృవీకరణ వ్యవస్థను తీసుకొచ్చారు. ఈ వ్యవస్థ ద్వారా ధృవీకరణ వ్యవస్థ మరింత సులభతరం అవుతుంది. ఇక నుంచి జిరాక్స్ కాపీలను కూడా సమర్పించాల్సిన అవసరం ఉండదు. ఇటీవల యూఐడీఏఐ కూడా సరికొత్త ఫీచర్ తీసుకొచ్చింది. కొత్త ఆధార్ యాప్ తీసుకొచ్చింది. ఈ యాప్ ద్వారా ఒరిజినల్ ఆధార్ కార్డు లేదా జిరాక్స్ కాపీ అందించకుండానే క్యూఆర్ కోడ్ ద్వారా ఆధార్ ధృవీకరణ పూర్తి చేయవచ్చు. డిజిటలైజేషన్‌ను ప్రోత్సహించేందుకు యూఐడీఏఐ కృషి చేస్తోంది. అందులో భాగంగా గుర్తింపు ధృవీకరణ ప్రక్రియను సులభతరం చేస్తోంది.
డిజిటల్ హోటల్ చెక్-ఇన్ ప్రక్రియలు గోప్యతను కూడా కాపాడతాయి. దీనివల్ల మీ వ్యక్తిగత సమాచారం మరింత సురక్షితంగా ఉంటుంది. అలాగే హోటల్ చెక్-ఇన్ సులభతరం అవుతుందని భావిస్తున్నారు. ఆధార్ జిరాక్స్ ఇవ్వడం ద్వారా అది మోసగాళ్ల చేతికి చిక్కితే దుర్వినియోగం చేసే అవకాశం ఉంటుంది. మన ఆధార్ వివరాలు, జిరాక్స్‌లతో ఏదైనా మోసానికి పాల్పడవచ్చు. దీంతో యూఐడీఏఐ ఇటీవల తెచ్చిన యాప్‌లో క్యూఆర్ కోడ్ ఆధారిత వెరిఫికేషన్ ఫీచర్ తీసుకొచ్చింది. అంతేాకాకుండా మీరు ఏ వివరాలు అయితే షేర్ చేయాలనుకుంటున్నారో వాటిని మాత్రమే పంచుకోవచ్చు.