జాతీయ రహదారులపై పలుచోట్ల మనకు టోల్ ప్లాజాలు కనిపిస్తాయి. మనం అక్కడ ఆగి వాహనానికి పన్ను (టోల్) చెల్లించాలి. ద్విచక్ర, త్రిచక్ర వాహన చోదకులు మినహాయించి మిగిలిన వారందరూ పన్ను కట్టాల్సిందే. గతంలో టోల్ చెల్లించడానికి ఆగే వాహనాలతో జాతీయ రహదారులపై ట్రాఫిక్ జాములు ఏర్పడేవి. ప్రతి వాహన దారుడు ఆగి, డబ్బు కట్టడానికి సమయం పట్టేది. ఈ నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం ఫాస్టాగ్ విధానాన్ని తీసుకువచ్చింది. ఫాస్టాగ్ స్టిక్కర్ ఉన్న వాహనం టోల్ ప్లాజా మీదుగా వెళ్లినప్పుడు స్కానర్లు స్పందిస్తాయి. దాని ద్వారా టోల్ చార్జీ ఆ వాహన యాజమాని బ్యాంకు ఖాతా నుంచి ఆటోమేటిక్ గా కట్ అవుతుంది. దీని ద్వారా ట్రాఫిక్ జామ్‌లు, వెయిటింగ్ బాధలు తప్పాయి. కాగా.. వాహనాల నుంచి పన్ను వసూలు చేయడానికి మరో కొత్త విధానానికి ప్రభుత్వం శ్రీకారం చుట్టనుంది. ఏకంగా శాటిలైట్ ఆధారిత టోల్ కనెక‌్షన్ ప్రారంభించనుంది. ఈ పద్ధతి పూర్తిగా అమలైతే ఇప్పుడు కొనసాగుతున్న ఫాస్టాగ్ విధానం కూడా రద్దువుతుంది.
శాటిలైట్ ఆధారిత టోల్ కలెక‌్షన్ విధానంతో పన్ను వసూలు కొత్త మార్పులు రానున్నాయి. దీని ద్వారా
ప్రయాణించిన దూరం ఆధారంగా కచ్చితమైన టోల్, లేదా చార్జీని వసూలు చేసే అవకాశం ఉంటుంది. ఈ ఉపగ్రహ ఆధారిత టోల్ విధానానికి భారత ప్రభుత్వం ఆమోదముద్ర వేసింది. ఈ విధానం పూర్తిగా అమల్లోకి వస్తే టోల్ ప్లాజా వద్ద ఆగాల్సిన అవసరం ఉండదు. మీరు ఉపగ్రహ పరిధిలోకి వచ్చినప్పుడు టోల్ ఆటోమేటిక్‌గా చెల్లిస్తారు. కొత్త టోల్ విధానాన్ని పరీక్షించేందుకు వచ్చే వారం ఆన్-బోర్డ్ యూనిట్లు (ఓబీయూ) ఉన్న కొన్ని వాహనాలను ప్రవేశపెట్టనున్నారు. వాహనం సిగ్నల్‌ను శాటిలైట్‌కు పంపడానికి ఓబీయూ ఒక ట్రాకర్‌లా పనిచేస్తుంది. ఈ విధానం పూర్తిగా అమలైతే ప్రస్తుతం కొనసాగుతున్న ఆర్‌ఎఫ్‌ఐడీ ఆధారిత ఫాస్టాగ్ వ్యవస్థ పూర్తిగా రద్దవుతుంది.
శాటిలైట్ ఆధారిత టోల్ వ్యవస్థ పనిచేయాలంటే వాహనాల్లో ఆన్ బోర్డ్ యూనిట్లను తప్పనిసరిగా ఉండాలి. దీనికోసం ఆన్ బోర్డ్ యూనిట్లు కలిగిన కొత్త వాహనాలను ఉత్పత్తి చేస్తారు. ఇప్పటికే ఉన్న వాహనాల్లో బయటి నుంచి ఆన్ బోర్డ్ యూనిట్లను ఏర్పాటు చేసుకోవచ్చు. ట్రక్కులు, బస్సులు ప్రమాదకర వస్తువులను తీసుకువెళ్లే వాహనాలలో ఆన్ బోర్డ్ యూనిట్లు ఏర్పాటు చేయాలని భావిస్తున్నారు. ఆ తర్వాత అన్ని వాహనాలను విస్తరింపజేస్తారు.
దేశంలోని 2 వేల కిలోమీటర్ల జాతీయ రహదారుల పరిధిలో 2025 జూన్ నాటికి శాటిలైట్ ఆధారిత టోల్ విధానం తీసుకురానున్నారు. ఆ తర్వాత తొమ్మిది నెలల్లో 10 వేలు, 15 నెలల్లో 25 వేలు, రెండేళ్లలో 50 వేల కిలోమీటర్లకు పెంచాలని భావిస్తున్నారు. దీనిలో భాగంగా జాతీయ రహదారులపై జియో ఫెన్సింగ్‌ను కేంద్ర ప్రభుత్వానికి చెందిన హైవే యాజమాన్య సంస్థలు పూర్తి చేశాయి. టోల్ లెక్కింపు ప్రయోజనం కోసం కచ్చితమైన ఎంట్రీ, ఎగ్జిట్ పాయింట్లను గుర్తించడానికి జియో ఫెన్సింగ్ చాలా అవసరం. మన దేశంలో జాతీయ రహదారుల పొడవు దాదాపు 1.4 లక్షల కిలోమీటర్లు. వీటిలో 45 వేల కిలోమీటర్లకు టోల్ వసూలు చేస్తారు.
మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..