Gold Prices: బంగారం ధరలపై ఊహించని అంచనాలు.. మరింత డౌన్ అవుతాయా..?

బంగారం ధరలు భారీగా తగ్గుతున్నాయి. అంతర్జాతీయ పరిణామాలు, డాలర్ బలపడటం, ద్రవ్యోల్బణం భయాల క్రమంలో అమ్మకాల ఒత్తిడి కొనసాగుతోంది. దీని వల్ల డిమాండ్ తగ్గడంతో గోల్డ్ రేట్లు తగ్గిపోతున్నాయి. అయితే ఈ తగ్గుదల ఎప్పటివరకు కొనసాగుతుందనే విషయంపై అనేక అంచనాలు వెలువడుతున్నాయి.

Gold Prices: బంగారం ధరలపై ఊహించని అంచనాలు.. మరింత డౌన్ అవుతాయా..?
Gold Prices

Updated on: Jun 11, 2026 | 5:58 PM

బంగారం, వెండి ధరలు భారీగా డౌన్ అవుతున్నాయి. గత రెండు వారాలుగా ధరలు మరింతగా కప్పకూలిపోతున్నాయి. దీంతో రానున్న రోజుల్లో మరింతగా పతనమవుతాయా..? లేదా? అనే వార్తలు వినిపిస్తున్నాయి. అంతర్జాతీయ పరిస్థితులు, డాలర్ కదలిక, కేంద్ర బ్యాంకుల సూచనలు, భౌగోళిక రాజకీయ పరిణామాలు వంటివి బంగారంపై ఎక్కువగా ప్రభావం చూపిస్తాయి. ఈ పరిణామాలు గోల్డ్ రేట్లలో స్వల్పకాలిక అస్థిరతకు దారితీస్తు్న్నాయి. ప్రపంచవ్యాప్తంగా గోల్డ్ రేట్లు ఆరు నెలల కనిష్ట స్థాయికి పతనమవ్వడంతో.. దేశీయ బులియన్ మార్కెట్లో కూడా తగ్గుముఖం పట్టాయి. ప్రపంచస్థాయి మార్కెట్లలో అమ్మకాలు పుంజుకోవడంతో దేశంలో కూడా ధరలు పడిపోయాయి.

ధరల పతనానికి కారణాలేంటి..?

బంగారం ధరలు పడిపోవడానికి అనేక కారణాలు వినిపిస్తున్నాయి. డాలర్ బలపడటం ఒక కారణం కాగా.. చమురు ధరల పెరగడం వల్ల ద్రవ్యోల్బణంపై భయాలు, యూఎస్ ఫెడరల్ రిజర్వు బ్యాంక్ వడ్డీ రేట్లను ఎక్కువకాలం అధికంగా ఉండొచ్చనే వార్తలతో గోల్డ్ రేట్లు క్రాష్ అవుతున్నాయి. అమెరికా వడ్డీ రేట్లపై అంచనాల్లో వచ్చి మారే ధరలు తగ్గడానికి ప్రధాన కారణంగా తెలుస్తోంది. అలాగే అమెరికా డాలర్ బలపడటంతో ఇతర కరెన్సీలు ఉపయోగించేవారు బంగారం వంటి డాలర్ విలువ కలిగిన వస్తువులు కొనుగోలు చేసేందుకు ఎక్కువ ఖర్చు పెట్టాల్సి వస్తోంది. ఈ కారణంతో బంగారానికి డిమాండ్ తగ్గింది. అలాగే చమురు ధరలు పెరగడం ద్రవ్యోల్బణంపై ఆందోళలను మరింత పెంచాయి. ఇక యూఎస్ ఫెడరల్ బ్యాంక్ వడ్డీ రేట్లను అధికంగా ఉంచనుందనే వార్తలు వస్తు్న్నాయి.

మరింత పడిపోతాయా..?

బంగారం ఎలాంటి స్ధిరమైన ఆదాయాన్ని అందించదు. దీంతో అధిక వడ్డీ రేట్లు బంగారానికి నష్టం కలిగిస్తాయని ఆర్ధిక నిపుణులు చెబుతున్నారు. డిసెంబర్ నాటికి అమెరికా వడ్డీ రేట్ల పెంపునకు 70 శాతం కంటే ఎక్కువ అవకాశం ఉందని వ్యాపారులు ఇప్పుడు అంచనా వేస్తున్నారు. అంతేకాకుండా అమెరికా- ఇరాన్‌ల మధ్య ఉద్రిక్తతలు మళ్లీ తలెత్తడం, హోర్ముజ్ జలసంధిలో అమెరికాకు చెందిన అపాచీ హెలికాప్టర్‌ను టెహ్రాన్ కూల్చివేసిందని అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రకటన క్రమంలో అమెరికా ఇరాన్‌పై దాడులు ప్రారంభించింది. ఇందుకు ప్రతీకారంగా జోర్డాన్‌లోని ఒక అమెరికా సైనిక స్థావరాన్ని, గల్ఫ్‌లోని మరో 21 ప్రదేశాలను లక్ష్యంగా చేసుకున్నట్లు ఇరాన్ వెల్లడించింది. ఈ పరిణామాలు ఆర్థిక మార్కెట్లలో అనిశ్చితిని పెంచడంతో పాటు ద్రవ్యోల్బణం, వడ్డీ రేట్ల అంచనాలను పునఃపరిశీలించేలా పెట్టుబడిదారులను పురికొల్పాయి. బంగారం విశ్లేషకులు ఔన్సుకు 4,100 డాలర్ల స్థాయిని నిశితంగా గమనిస్తున్నారు. ఆ స్థాయి కంటే దిగువకు పడిపోతే ఈ విలువైన లోహం విస్తృత ధోరణి మారవచ్చని చెబుతున్నారు.

 

Follow Us