Demonetisation: కేంద్ర ప్రభుత్వం పాత నోట్ల రద్దు నేటికి ఐదేళ్లు పూర్తయింది. దేశంలో నల్లధనాన్ని వెలికితీయాలనే ఉద్దేశంతో కేంద్ర ప్రభుత్వం 2016, నవంబర్ 8న రూ.500, రూ.1000 నోట్లను రద్దు చేసింది. అయితే పెద్దనోట్లు రద్దు చేసిన తర్వాత డిజిటల్ చెల్లింపులు భారీగా పెరిగాయి. దేశంలోని గత ఐదేళ్ల కాలంలో డిజిటల్ చెల్లింపులు జోరందుకున్నాయని గణాంకాలు చెబుతున్నాయి. అదే సమయంలో నగదు లావాదేవీలు కూడా పెరిగాయి.
ఆర్బీఐ గణాంకాల ప్రకారం.. 2016 నవంబర్ 4 నాటికి దేశంలో చలామణిలో ఉన్న నోట్ల విలువ రూ.17.74 లక్షల కోట్లు. అయితే గత నెల 29 నాటికి అది రూ.29.17 లక్షల కోట్లకు చేరుకుంది. చలామణిలో ఉన్న నోట్ల విలువ 64 శాతం పెరిగింది. ఇక ఇదే సమయంలో చలామనిలో ఉన్న కరెన్సీ నోట్ల సంఖ్య 26.88 లక్షల నుంచి రూ.228.96 లక్షలకు చేరిందని గణాంకాలు చెబుతున్నాయి. అయితే నోట్ల రద్దు డిజిటల్ చెల్లింపులను ప్రోత్సహించడం, నగదు లావాదేవీలను పెద్దగా ప్రభావితం చేయలేదని తెలుస్తోంది. డిజిటల్ చెల్లింపులు ఎంత పెరిగినా ఆర్థిక వ్యవస్థలో నగదు వినియోగం కూడా భారీగానే కొనసాగుతోంది. కరోనా కూడా ఇందుకు మరింత దోహదం చేసిందనే చెప్పాలి. 2014-2020 అక్టోబర్ మధ్య కాలంలో చలామనిలో ఉన్న కరెన్సీ నోట్ల సంఖ్య ఏడాదికి సగటున 14.51 శాతం పెరిగింది. రూ.500 లోపు ఉండే చెల్లింపుల్లో ఎక్కువగా ఇప్పటికీ నగదు రూపంలోనే జరుగుతున్నాయి.
అయితే యూపీఐ సేవలను 2016లో ప్రారంభించిన సంగతి తెలిసిందే. అయితే ప్రతినెల సేవల ద్వారా చెల్లింపులు కూడా భారీగా పెరిగాయి. అక్టోబరులో 421 కోట్ల లావాదేవీలు జరిగాయి. వీటి విలువ రూ.7.71 లక్షల కోట్లుగా నమోదైనట్లు ఆర్బీఐ గణాంకాలు పేర్కొంటున్నాయి.
కరోనా మహమ్మారి కారణంగా తలెత్తిన పరిస్థితుల వల్ల ప్రజలు ముందు జాగ్రత్తగా నగదును దగ్గర ఉంచుకునేందుకు ఆసక్తి చూపుతున్నారు. దీంతో గత ఆర్థిక సంవత్సరంలో నోట్ల చలామణి పెరిగింది. అలాగే డిజిటల్ చెల్లింపులు, డెబిట్, క్రెడిట్ కార్డులు, నెట్ బ్యాంకింగ్, యూపీఐ, ఇతర యాప్‌ల ద్వారా చెల్లింపులు భారీగా పెరిగినట్లు గణాంకాలు వెల్లడిస్తున్నాయి.
ఇవి కూడా చదవండి: