Be Alert: ట్రెండింగ్‌లో ఉన్న సైబర్‌ నేరాలు ఇవే.. జాగ్రత్తగా లేకుంటే కొంప కొల్లేరే..!

| Edited By: Subhash Goud

Nov 23, 2024 | 7:54 PM

Cyber Fraud: ఇటీవలి కాలంలో ఆధార్‌ మోసాలు సైతం బాగా పెరిగిపోయాయి. కొంతమంది ఆధార్ ఎనేబుల్డ్ పేమెంట్ సిస్టమ్ (AePS) ద్వారా ఆర్థిక మోసాలకు పాల్పడుతున్నారు. నేరస్థులు బాధితుల ఆధార్ బయోమెట్రిక్ డేటాను ఉపయోగించి వారి సమ్మతి

Be Alert: ట్రెండింగ్‌లో ఉన్న సైబర్‌ నేరాలు ఇవే.. జాగ్రత్తగా లేకుంటే కొంప కొల్లేరే..!
Follow us on

సైబర్‌ క్రైమ్స్ రోజుకో కొత్త పుంతలు తొక్కుతున్నాయి. టెక్నాలజీతో పోలీసులు సైబర్‌ నేరగాళ్ల ఆటకట్టిస్తుండటంతో వారు కొత్త తరహా మోసాలకు పాల్పడుతున్నారు. తెలియని నంబర్‌ నుంచి ఫోన్‌ వస్తే అప్రమత్తంగా ఉండాని కోరుతున్నారు. అపరిచితులతో వ్యవహరించేటప్పుడు, ప్రత్యేకించి వారు ఏదైనా యాప్‌ను డౌన్‌లోడ్ చేయమని లేదా సాఫ్ట్‌వేర్‌ను ఇన్‌స్టాల్ చేయమని కోరితే సున్నితంగా తిరస్కరించాలని హెచ్చరిస్తున్నారు. నేషనల్ క్రైమ్ బ్యూరో రికార్డ్స్ ప్రకారం.. గతేడాదిలో 11 లక్షలకు పైగా సైబర్ కేసులు నమోదయ్యాయి. ప్రస్తుతం సైబర్‌ నేరగాళ్లు 4 రకాల స్కామ్‌లకు పాల్పడుతున్నారు. మరి వాటి నుంచి ఎలా రక్షించుకోవాలో తెలుసుకుందాం.

ఇటీవలి కాలంలో వర్చువల్ అరెస్ట్ స్కామ్ బాధితుల సంఖ్య విపరీతంగా పెరిగింది. సైబర్‌ నేరగాళ్లు కొత్త నంబర్‌ నుంచి ఫోన్‌ చేసి తమను తాము పోలీస్/ఈడీ/కస్టమ్స్ అధికారులుగా పరిచయం చేసుకుంటారు. మీరు నేరం చేసినట్లు బెదిరిస్తారు. నేరం నుంచి బయటపడాలంటే డబ్బులు పంపించాలని డిమాండ్‌ చేస్తారు. అంత వరకు ఎవరితోనూ మాట్లాడకూడదని బెదిరిస్తారు. ఇలా అందినంత డబ్బులు దండుకొని సొమ్ము చేసుకుంటారు. ఇటువంటి స్కామ్‌ల పట్ల అప్రమత్తంగా ఉండాలని సైబర్‌ నిపుణులు కోరుతున్నారు.

సైబర్‌ నేరగాళ్లు ఎక్కువ మంది ట్రాప్‌ చేస్తున్న విధానం కస్టమర్ సపోర్ట్ స్కామ్. యూజర్లు ఆన్‌లైన్‌లో ఏదైనా వీడియో షేరింగ్ సైట్‌ను యాక్సెస్‌ చేస్తున్న సందర్భంలో నకిలీ ఫోన్‌ నంబర్‌ నుంచి ఫోన్‌ చేస్తారు. అనంతరం, స్క్రీన్ షేరింగ్ సాఫ్ట్‌వేర్‌ను డౌన్‌లోడ్ చేసుకోమని ఒప్పిస్తారు. తద్వారా మొబైల్ హైజాకింగ్ చేసి ఫోన్‌లోని విలువైన డేటాను దొంగిలిస్తారు. సోషల్ మీడియా ద్వారా జరిగే మోసాల సంఖ్య విపరీతంగా పెరిగింది. మోసగాళ్లు సోషల్ మెసేజింగ్ ఛానెల్స్‌లో స్నేహితులు, బంధువుల పేర్లతో ఫేక్‌ అకౌంట్లను క్రియేట్‌ చేస్తారు. తాము కష్టాల్లో ఉన్నామని, డబ్బు పంపించి సహాయం చేయాలని కోరతారు. ఇలా నమ్మబలికి అందినకాడికి దండుకుంటారు. అందుకే, మీ స్నేహితులు, బంధువులకు డబ్బులు పంపే క్రమంలో ఒకటికి రెండుసార్లు చెక్‌ చేసుకోవాలని సైబర్‌ నిపుణులు కోరుతున్నారు.

ఇటీవలి కాలంలో ఆధార్‌ మోసాలు సైతం బాగా పెరిగిపోయాయి. కొంతమంది ఆధార్ ఎనేబుల్డ్ పేమెంట్ సిస్టమ్ (AePS) ద్వారా ఆర్థిక మోసాలకు పాల్పడుతున్నారు. నేరస్థులు బాధితుల ఆధార్ బయోమెట్రిక్ డేటాను ఉపయోగించి వారి సమ్మతి లేకుండానే బ్యాంక్ అకౌంట్ నుంచి క్యాష్ విత్‌డ్రా చేసుకుంటున్నారు. సైబర్‌ నేరాల నుంచి దూరంగా ఉండాలంటే 5 జాగ్రత్తలు తీసుకోవాలని నిపుణులు చెబుతున్నారు. అవేంటో చూద్దాం.

మీ అనుమతి లేకుండా AePS ట్రాన్సాక్షన్స్‌ను నిరోధించడానికి మీ ఆధార్ బయోమెట్రిక్స్ లాక్ చేయండి. ఇందుకు UIDAI వెబ్‌సైట్‌లోని myaadhaar విభాగానికి వెళ్లి, మీ బయోమెట్రిక్స్ లాక్‌ చేయండి. అపరిచితులు ఫోన్‌ చేసి ఏదైనా యాప్‌ లేదా సాఫ్ట్‌వేర్‌ను ఇన్‌స్టాల్ చేయమని కోరితే తిరస్కరించండి. క్యూఆర్‌ కోడ్‌ స్కాన్‌ చేసి డబ్బులు చెల్లించండి. కానీ, క్యూఆర్‌ కోడ్ ద్వారా డబ్బులు స్వీకరించే క్రమంలో అప్రమత్తంగా ఉండండి. తెలియని వ్యక్తి మీకు పొరపాటున డబ్బు పంపిస్తే.. ఆ డబ్బును వెనక్కి పంపించే ముందు నిపుణుల సలహా తీసుకోండి. లేదంటే మీ డేటా భద్రతకు ముప్పు వాటిల్లే ప్రమాదం ఉంది. మీ మొబైల్‌కు వచ్చే లింక్ లేదా ఎస్‌ఎమ్‌ఎస్‌ నమ్మదగినదా? కాదా? అనేది నిర్థారించుకున్న తర్వాతే రిప్లై ఇవ్వండి. సైబర్ క్రైమ్ జరిగిన వెంటనే పోలీసు అధికారిక నంబర్ 1930కి కాల్‌ చేయండి.

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి