కుష్టు వ్యాక్సిన్‌తో కరోనాకు చెక్.. భారత శాస్త్రవేత్తల యాక్షన్ ప్లాన్

| Edited By: Anil kumar poka

Apr 18, 2020 | 8:56 AM

కరోనాకు వాక్సిన్ కనుగొనేందుకు అమెరికా, చైనా, జర్మనీ లాంటి దేశాలు యధాశక్తి ప్రయత్నిస్తుండగా.. మనదేశం కూడా తన వంతు ప్రయత్నాలను ముమ్మరం చేసింది. వాక్సిన్ తయారీకి యువ శాస్త్రవేత్తలు కృషి చేయాలంటూ ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ఇచ్చిన పిలుపు...

కుష్టు వ్యాక్సిన్‌తో కరోనాకు చెక్.. భారత శాస్త్రవేత్తల యాక్షన్ ప్లాన్
Follow us on

కరోనాకు వాక్సిన్ కనుగొనేందుకు అమెరికా, చైనా, జర్మనీ లాంటి దేశాలు యధాశక్తి ప్రయత్నిస్తుండగా.. మనదేశం కూడా తన వంతు ప్రయత్నాలను ముమ్మరం చేసింది. వాక్సిన్ తయారీకి యువ శాస్త్రవేత్తలు కృషి చేయాలంటూ ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ఇచ్చిన పిలుపు బాగానే పనిచేస్తోంది. కొందరు కొత్త ప్రయోగాలకు శ్రీకారం చుట్టగా.. మరికొందరు గతంలో ఇండియా ఆవిష్కరించిన వాక్సిన్లకు మెరుగులు దిద్దడం ద్వారా కరోనాకు విరుగుడు కనిపెట్టేందుకు శ్రమిస్తున్నారు.

కుష్టు వ్యాధిని నిర్మూలించి రోగ నిరోధక శక్తిని పెంపొందించడంలో గతంలో బహుబాగా పనిచేసిన బహుళ ప్రయోజన వ్యాక్సిన్‌ కరోనా మహమ్మారి నియంత్రణకు ఉపకరిస్తుందా అని మన శాస్త్రవేత్తలు పరీక్షిస్తున్నారు. ఔషధ నియంత్రణ మండలి పర్మిషన్‌తో కుష్టు వ్యాధిపై విజయవంతంగా ప్రయోగించిన ఎండబ్ల్యూ వ్యాక్సిన్‌పై ప్రయోగాలు ప్రారంభించామని శాస్త్రీయ, పారిశ్రామిక పరిశోధనా మండలి (సీఎస్‌ఐఆర్‌) డైరెక్టర్‌ జనరల్‌ డాక్టర్‌ శేఖర్‌ మండే ప్రకటించారు.

వ్యాక్సిన్‌ తయారీ చాలా లెంగ్తీ ప్రాసెస్ అని..కుష్టు వ్యాధిని సమర్ధంగా అరికట్టిన వ్యాక్సిన్‌పై ప్రస్తుతం పరిశోధన కొనసాగిస్తున్నామని ఆయనన్నారు. కేంద్ర ప్రభుత్వం నుంచి మరో రెండు కీలకమైన అనుమతుల కోసం ఎదురు చూస్తున్నామని డాక్టర్ శేఖర్ మండే వివరించారు. అనుమతులు రాగానే ప్రయోగాలను కొనసాగించి. అయిదారు వారాల్లో సానుకూల ఫలితాలను రాబడతామని ఆయనంటున్నారు.

కరోనా వ్యాక్సిన్‌ రూపకల్పనకు సంవత్సరం కంటే ఎక్కువ సమయం పడుతుందని ప్రపంచ ఆరోగ్య సంస్థ ప్రకటించిన సంగతి తెలిసిందే. ప్రపంచవ్యాప్తంగా సుమారు 23 లక్షల మందికి సోకిన ఈ మహమ్మారి నిరోధానికి అమెరికా, చైనా సహా పలు దేశాలు వ్యాక్సిన్‌ రూపొందించేందుకు కసరత్తును వేగవంతం చేశాయి. అయితే జర్మనీలో కొనసాగుతున్న ప్రయోగాలే కరోనా వాక్సిన్ విషయంలో కీలకమని సైన్సు జర్నల్స్ పేర్కొంటున్నాయి.

కరోనాకు వాక్సిన్ కనిపెట్టేందుకు రంగంలోకి దిగిన భారత శాస్త్రవేత్తలు.. కరోనా పుట్టుపూర్వోత్తరాలపై కూడా నజర్ పెట్టారు. ఈ వైరస్ ఎక్కడ, ఎలా పుట్టిందనే అంశాన్ని కూడా పరిశోధిస్తున్నారు. వైరస్ వ్యాప్తికి సంబంధించిన పూర్తి ప్రయాణాన్ని పరిశోధించేందుకు జన్యు సీక్వెన్సింగ్‌పై భారత్‌ పరిశోధన చేపట్టిందని డాక్టర్‌ శేఖర్‌ తెలిపారు. వైరస్‌ స్వభావం ఏంటి.. వైరస్‌పై వాక్సిన్‌ను ప్రయోగిస్తే.. అది ఎలా స్పందిస్తుంది అనే అంశాలపై కూడా దృష్టి సారించామని ఆయన చెబుతున్నారు.