
హిందూ సంప్రదాయంలో జ్యోతిష్యంతోపాటు వాస్తు శాస్త్రానికి అత్యంత ప్రాధాన్యత ఇవ్వడం జరిగింది. చాలా మంది ఇంటి నిర్మాణంలో వాస్తుకు ప్రత్యేక ప్రాధాన్యం ఇస్తారు. వాస్తు నియమాలను అనుసరించడం వల్ల ఇంట్లో సానుకూల శక్తి పెరిగి, ప్రతికూల ప్రభావాలు తగ్గుతాయని నమ్మకం. ముఖ్యంగా ఇంటి ప్రధాన ద్వారం కేవలం ప్రవేశ మార్గమే కాదు, ఇంట్లోకి శుభశక్తులు ప్రవేశించే ద్వారంగా కూడా భావిస్తారు. అందుకే కొత్త ఇల్లు నిర్మించే సమయంలో ప్రధాన ద్వారం దిశతో పాటు రంగు విషయంలో కూడా జాగ్రత్తలు తీసుకోవాలని వాస్తు నిపుణులు సూచిస్తున్నారు.
వాస్తు ప్రకారం ఇంటి ముఖద్వారం సరైన దిశలో ఉండటం ఎంత ముఖ్యమో, దానికి ఎంచుకునే రంగు కూడా అంతే ప్రభావం చూపుతుంది. సరైన రంగులు ఉపయోగిస్తే అదృష్టం, ఐశ్వర్యం, మానసిక ప్రశాంతత లభిస్తాయని చెబుతారు. తప్పు రంగులు వాడితే ఆర్థిక సమస్యలు, ఒత్తిడి, కుటుంబ కలహాలు పెరిగే అవకాశముందని భావిస్తారు.
పడమర ముఖద్వారం ఉన్న ఇళ్లకు ఆకాశ నీలం రంగు చాలా శుభప్రదంగా భావిస్తారు. ఈ దిశపై శని ప్రభావం ఉంటుందని వాస్తు చెబుతుంది. నీలం రంగు వాడటం వల్ల కుటుంబంలో స్థిరత్వం, అభివృద్ధి పెరుగుతాయని నమ్మకం.
నైరుతి వైపు ప్రధాన ద్వారం ఉన్నవారు ఆర్థిక వ్యవహారాల్లో జాగ్రత్తగా ఉండాలి. ఈ దిశకు వెండి రంగు లేదా లేత గులాబీ రంగు అనుకూలంగా ఉంటుంది. ఇవి ఆర్థిక స్థిరత్వాన్ని పెంచుతాయని చెబుతారు. పూర్తిగా ఆ రంగులు వేయలేకపోతే కనీసం డోర్ హ్యాండిల్‌ను నీలం రంగులో ఉంచడం మంచిదిగా భావిస్తారు.
ఉత్తర దిశలో ఉన్న ఇంటి ప్రధాన ద్వారానికి లేత ఆకుపచ్చ రంగు అనుకూలం. ఇది శాంతి, అభివృద్ధి, సంపదకు సంకేతంగా భావిస్తారు. అలాగే ఇంట్లో సహజ కాంతి బాగా వచ్చేలా చూసుకోవడం మంచిది. ఉత్తర దిశలో నీటి పాత్ర లేదా చిన్న వాటర్ ఫౌంటెన్ ఉంచితే ఐశ్వర్యం పెరుగుతుందని వాస్తు నమ్మకం.
తూర్పు ముఖద్వారం ఉన్న ఇళ్లకు సహజ చెక్క రంగులు ఎంతో శుభప్రదం. నాచురల్ వుడ్ ఫినిష్ తలుపులు ఇంటికి సానుకూల శక్తిని తీసుకువస్తాయని చెబుతారు. కృత్రిమ, ఎక్కువగా మెరుస్తున్న రంగుల కంటే సహజ రంగులు మంచివి.
ఈశాన్య దిశలో ఉన్న ప్రధాన ద్వారాలకు పసుపు లేదా ఆకుపచ్చ రంగులు అదృష్టాన్ని ఆకర్షిస్తాయని నమ్మకం. ఇవి ఇంట్లో సానుకూల వాతావరణాన్ని పెంచి, వాస్తు దోషాలను తగ్గించడంలో సహాయపడతాయని చెబుతారు.
వాయువ్య దిశలో ఉన్న ఇళ్లకు తెలుపు లేదా వెండి రంగులు అనుకూలంగా భావిస్తారు. ఈ రంగులు ఇంట్లో శక్తి సమతుల్యతను నిలబెట్టి ప్రశాంతమైన వాతావరణాన్ని కలిగిస్తాయని వాస్తు సూచిస్తుంది.
వాస్తు సూచన
ప్రధాన ద్వారం రంగును సరైన విధంగా ఎంపిక చేసుకోవడం ద్వారా ఇంట్లో సానుకూలత, ఆనందం, ఆర్థిక అభివృద్ధి పెరుగుతాయని వాస్తు నిపుణులు చెబుతున్నారు. చిన్న మార్పులు చేసినా ఇంటి వాతావరణంలో మంచి మార్పులు కనిపించే అవకాశం ఉంటుంది.
(Disclaimer: ఇక్కడ అందించిన సమాచారం వాస్తు, జ్యోతిష్యం, సాధారణ నమ్మకాల ఆధారంగా మాత్రమే అందించబడింది. ఈ సమాచారం ఖచ్చితంగా నిజం లేదా శాస్త్రీయంగా నిర్ధారితమైన సమాచారం అని భావించకండి. వ్యక్తిగత నిర్ణయాలు తీసుకునే ముందు సంబంధిత నిపుణులను సంప్రదించడం మంచిది.)