
కొందరు పిల్లలు చిన్న వయసు నుంచే ఎన్నో ప్రశ్నలు అడుగుతుంటారు. ఒక విషయం గురించి చెప్పినా.. అది ఎందుకు జరిగింది? ఎలా పనిచేస్తుంది? దాని వెనుక కారణం ఏమిటి? అంటూ ప్రశ్నల మీద ప్రశ్నలు వేస్తుంటారు. తల్లిదండ్రులు సమాధానం చెప్పినా, మరిన్ని సందేహాలతో ముందుకొస్తుంటారు. అయితే, సంఖ్యాశాస్త్రం(Numerology) ప్రకారం కొన్ని తేదీల్లో పుట్టిన పిల్లల్లో జిజ్ఞాస, కొత్త విషయాలు తెలుసుకోవాలనే ఆసక్తి ఎక్కువగా ఉంటుందని చెబుతారు. ముఖ్యంగా మూలాంకం 3, మూలాంకం 5కు చెందిన పిల్లలు ఈ విషయంలో ప్రత్యేకంగా ఉంటారని న్యూమరాలజీ వివరిస్తోంది.
ఏ నెలలోనైనా 3, 12, 21 తేదీల్లో జన్మించిన పిల్లల మూలాంకం 3 అవుతుంది. సంఖ్యాశాస్త్రం ప్రకారం ఈ మూలాంకానికి గురుగ్రహం అధిపతిగా పరిగణిస్తారు. ఈ పిల్లల్లో నాయకత్వ లక్షణాలు ఎక్కువగా ఉంటాయి. ఏ విషయాన్నైనా సులభంగా అంగీకరించకుండా దాని గురించి తెలుసుకోవాలనే ఆసక్తి చూపుతారు. చూసిన ప్రతి విషయాన్ని నిశితంగా గమనిస్తూ.. దాని వెనుక ఉన్న కారణాలను తెలుసుకోవడానికి ప్రయత్నిస్తారు. తల్లిదండ్రులను తరచూ ప్రశ్నలు అడగడం, కొత్త విషయాలపై ఆసక్తి చూపడం వీరి ప్రత్యేకతలుగా సంఖ్యాశాస్త్రం పేర్కొంటుంది. వీరి సందేహాలకు ఓపికగా సమాధానాలు చెప్పడం ద్వారా నేర్చుకోవాలనే ఆసక్తిని ప్రోత్సహించడం మంచిది.
ఏ నెలలోనైనా 5, 14, 23 తేదీల్లో జన్మించిన పిల్లల మూలాంకం 5 అవుతుంది. సంఖ్యాశాస్త్రం ప్రకారం ఈ పిల్లలు చురుకైన ఆలోచనలు కలిగి ఉంటారు. కొత్త విషయాలను త్వరగా నేర్చుకోవడానికి ఆసక్తి చూపుతారు. వీరు ప్రతి విషయాన్ని లోతుగా తెలుసుకోవడానికి ప్రయత్నిస్తారు. ఎక్కువగా మాట్లాడటంతో పాటు కొత్త అనుభవాల కోసం ఎదురుచూస్తారు. ఒక విషయం గురించి సరైన సమాధానం లభించకపోతే అసంతృప్తి చెందే అవకాశం ఉంది. ఏదైనా పనిని ఉత్సాహంగా ప్రారంభించినా, కొంతకాలానికి మరో కొత్త విషయంపై ఆసక్తి చూపించే అవకాశముంది.
పిల్లలు ప్రశ్నలు అడగడం వారి నేర్చుకునే ప్రక్రియలో ముఖ్యమైన భాగం. వారు అడిగే ప్రతి ప్రశ్నకు సాధ్యమైనంతవరకు సరళంగా, అర్థమయ్యేలా సమాధానాలు చెప్పాలి. పుస్తకాలు చదవడం, ప్రయోగాలు చేయడం, ప్రకృతిని గమనించడం వంటి అలవాట్లను ప్రోత్సహించాలి. పిల్లల సందేహాలను పట్టించుకోకుండా వదిలేయడం కంటే, వారికి విషయాలను అర్థం చేసుకునే అవకాశాలు కల్పించడం మంచిది.
(గమనిక: పుట్టిన తేదీల ఆధారంగా పిల్లల తెలివితేటలు, వ్యక్తిత్వాన్ని నిర్ణయించవచ్చని చెప్పడానికి శాస్త్రీయ ఆధారాలు లేవు. ప్రతి పిల్లవాడి ఆసక్తులు, నేర్చుకునే సామర్థ్యం, వ్యక్తిత్వం భిన్నంగా ఉంటాయి. కాబట్టి సంఖ్యాశాస్త్ర విశ్వాసాలను సాధారణ సమాచారంగా మాత్రమే పరిగణించాలి)