
చంద్రుడితో ఏర్పడే యోగాలు నూరు శాతం ఫలిస్తాయని జ్యోతిషశాస్త్రం చెబుతోంది. ఎవరికైనా ఆరోగ్య, ఐశ్వర్య యోగాలు కలగాలన్న పక్షంలో చంద్రుడి అనుకూలత అవసరం. ఈ నెల(మే) 30, 31, జూన్ 1 తేదీల్లో తులా రాశిలో సంచారం చేయబోతున్న చంద్రుడి వల్ల కొన్ని రాశులకు కొద్ది ప్రయత్నంతో తప్పకుండా ఆరోగ్య, ఐశ్వర్య యోగాలు కలిగే అవకాశం ఉంది. ఆ మూడు రోజుల్లో తులలో సంచారం చేస్తున్న చంద్రుడిని కుజుడు వీక్షించడంతో పాటు, బుధ, శుక్రులతో కలిసి ఉన్న గురువు కూడా మిథున రాశి నుంచి వీక్షించడం జరుగుతోంది. దీనివల్ల చంద్రుడు పూర్ణ శుభుడిగా మారడం జరిగింది. ఫలితంగా మేషం, మిథునం, కర్కాటకం, కన్య, తుల, ధనూ రాశులకు సంపద వృద్ధి చెందుతుంది.
మేషం: ఈ రాశిలో ఉన్న కుజుడికి సప్తమంలో ఉన్న చంద్రుడితో పరస్పద దృష్టి ఏర్పడడం వల్ల చంద్ర మంగళ యోగమనే సంపద యోగం ఏర్పడింది. శుభ గ్రహాలతో కలిసిన గురువు కూడా ఈ చంద్రు డిని వీక్షించడం వల్ల శుభ పరిణామాలు ఎక్కువగా చోటు చేసుకుంటాయి. ఉద్యోగ, పెళ్లి ప్రయత్నాల్లో శుభవార్తలు ఎక్కువగా వింటారు. ఉద్యోగంలో హోదా, జీతభత్యాలు పెరుగుతాయి. ఈ మూడు రోజుల్లో చేపట్టే ఎలాంటి ప్రయత్నమైనా ఫలిస్తుంది. ఆశించిన స్థాయిలో ఆదాయం లభిస్తుంది.
మిథునం: ధన స్థానాధిపతి చంద్రుడిని శుభ గ్రహాలు వీక్షించడం వల్ల ఈ రాశివారికి లక్ష్మీ కటాక్షం కలుగుతుంది. అనేక విధాలుగా ఆదాయం పెరుగుతుంది. ఆదాయ వృద్ధికి గట్టి ప్రయత్నాలు సాగించడం మంచిది. ఈ చంద్రుడి మీద కుజ, గురువుల దృష్టి పడడం వల్ల ఏ ప్రయత్నం తలపెట్టినా విజయ వంతమవుతుంది. వృత్తి, ఉద్యోగాల్లో రాజయోగాలు పడతాయి. రాజపూజ్యాలు పెరుగుతాయి. ఆదాయ వృద్ధి వల్ల వ్యక్తిగత, ఆర్థిక సమస్యల నుంచి చాలావరకు బయటపడడం జరుగుతుంది.
కర్కాటకం: రాశ్యధిపతి చంద్రుడు గురు, కుజుల దృష్టితో బాగా బలం పుంజుకుంటున్నందువల్ల ఉద్యోగ జీవితంలో ప్రాధాన్యం బాగా పెరుగుతుంది. హోదా పెరిగే అవకాశం కూడా ఉంది. ఆరోగ్యం బాగా మెరుగుపడుతుంది. ఏ పని తలపెట్టినా సఫలం అవుతుంది. వృత్తి, వ్యాపారాలు లాభాలపరంగా దూసుకుపోతాయి. కొద్దిగా ఆస్తి కలిసి వస్తుంది. మాతృ సౌఖ్యం కలుగుతుంది. కుటుంబ జీవితం హ్యాపీగా సాగిపోతుంది. వృత్తి, ఉద్యోగాలరీత్యా విదేశాలకు కూడా వెళ్లే అవకాశం కలుగుతుంది.
కన్య: ఈ రాశికి లాభాధిపతి అయిన చంద్రుడు మీద శుభ గ్రహాలతో కలిసిన గురు దృష్టి పడడం, కుజుడి వీక్షణ కూడా ఉండడం వల్ల ఈ మూడు రోజుల్లో ఆదాయ వృద్ధికి ఎలాంటి ప్రయత్నం చేపట్టినా నూరు శాతం సఫలమవుతుంది. ముఖ్యమైన ఆర్థిక సమస్యల నుంచి బయటపడతారు. ఉద్యోగంలో జీతభత్యాలు, ఆదాయం బాగా పెరుగుతాయి. వృత్తి, వ్యాపారాలకు డిమాండ్ వృద్ధి చెందుతుంది. నిరుద్యోగులకు సొంత ఊర్లో మంచి ఉద్యోగం లభిస్తుంది. కుటుంబ జీవితం హ్యాపీగా సాగుతుంది.
తుల: ఈ రాశికి దశమ స్థానాధిపతిగా చంద్రుడు ఇదే రాశిలో సంచారం చేయడం, దాన్ని మిత్ర గ్రహాలైన గురు, కుజులు వీక్షించడం వల్ల రాజయోగాలతో పాటు, ధన యోగాలు కూడా కలుగుతాయి. ఉద్యోగంలో అధికార యోగం పడుతుంది. వృత్తి, వ్యాపారాలు రాబడిపరంగా రికార్డులు సృష్టిస్తాయి. నిరుద్యోగులకు ఆశించిన ఉద్యోగం లభిస్తుంది. ఉద్యోగులకు విదేశీ ఆఫర్లు అందుతాయి. ఉన్నత స్థాయి వారితో పరిచయాలు ఏర్పడతాయి. ఆదాయానికి, ఆరోగ్యానికి లోటుండని పరిస్థితి ఏర్పడుతుంది.
ధనుస్సు: ఈ రాశికి లాభ స్థానంలో చంద్రుడు ప్రవేశించడమే ఒక విశేషం కాగా, దాన్ని గురు, కుజులు వీక్షించడం మరింత విశేషం. దీనివల్ల ఈ రాశివారికి అపారమైన ధన లాభం కలుగుతుంది. షేర్లు, ఆర్థిక లావాదేవీలు ఊహించని లాభాలనిస్తాయి. ఆదాయపరంగానే కాక, ఆస్తి, ఆర్థిక వ్యవహారాల్లో కూడా విజయాలు సాధిస్తారు. ఏ ప్రయత్నం తలపెట్టినా విజయవంతం అవుతుంది. సంతాన యోగానికి అవకాశం ఉంది. వృత్తి, ఉద్యోగ, వ్యాపారాలు నల్లేరు మీద బండిలా, సంతృప్తికరంగా సాగిపోతాయి.