YS Jagan: గవర్నర్‌ను కలిసిన జగన్‌… రాష్ట్రంలో దాడులపై ఫిర్యాదు

|

Jul 21, 2024 | 8:27 PM

గత 45 రోజులుగా ఏపీలో రాజకీయ హత్యలు, దాడులు జరుగుతున్నాయని గవర్నర్ అబ్దుల్ నజీర్‌కు ఫిర్యాదు చేశారు వైఎస్ జగన్. దెబ్బతిన్న లా అండ్ ఆర్డర్‌ను పునరుద్ధరించేందుకు చర్యలు తీసుకోవాలని కోరారు.

YS Jagan: గవర్నర్‌ను కలిసిన జగన్‌... రాష్ట్రంలో దాడులపై ఫిర్యాదు
Jagan Meets Governor (File Photo)
Follow us on

వైసీపీ అధినేత, మాజీ సీఎం జగన్ విజయవాడలోని రాజ్ భవన్‌లో గవర్నర్ అబ్దుల్ నజీర్‌ను కలిశారు. ఏపీలో కూటమి ప్రభుత్వ పాలన మొదలైనప్పటి నుంచి గత 45 రోజులుగా రాష్ట్రంలో హత్యలు, దాడులు జరుగుతున్నాయని జగన్ గవర్నర్‌కు ఫిర్యాదు చేశారు. గతంలో ఎన్నడూ లేనంతగా రాష్ట్రంలో శాంతిభద్రతలు క్షీణించాయని ఆందోళన వ్యక్తం చేశారు. ఇటీవల వినుకొండలో జరిగిన రషీద్ అనే యువకుడి హత్య ఘటన, పుంగనూరులో ఎంపీ మిథున్ రెడ్డిపై రాళ్ల దాడి, ఇతర సంఘటలను జగన్ గవర్నర్‌కు వివరించారు. ఆయా ఘటనలకు సంబంధించిన ఫొటోలు, వీడియోలను కూడా గవర్నర్‌కు అందించారు. రాష్ట్రంలో దెబ్బతిన్న లా అండ్ ఆర్డర్‌ను పునరుద్ధరించేందుకు గవర్నర్ చర్యలు తీసుకోవాలని కోరారు.

ఇప్పటికే పార్లమెంట్‌ సమావేశాల్లో అనుసరించాల్సిన వ్యూహంపై పార్టీ ఎంపీలకు జగన్ దిశానిర్దేశం చేశారు. ఉభయ సభల్లో ఏవిధంగా వ్యవహరించాలో ఎంపీలకు సూచించారు. రాష్ట్రంలో జరుగుతున్న దాడులు, హత్యలను ఢిల్లీ వేదికగా కేంద్రం, దేశం దృష్టి తీసుకెళ్లాలన్నారు. రాష్ట్రంలో రాష్ట్రపతి పాలనకు డిమాండ్ చేయాలంటూ తమ పార్టీ ఎంపీలను ఆయన ఆదేశించారు. ఏపీలో జరుగుతున్న హింసాకాండపై ఫిర్యాదు చేసేందుకు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము, ప్రధాని మోదీ, కేంద్ర హోంమంత్రి అమిత్‌ షాల అపాయింట్‌మెంట్లు కోరామని తెలిపారు. పార్టీ తరఫున పోరాటాలు చేయకపోతే ఈ దారుణాలకు అడ్డుకట్ట పడదన్న జగన్‌…అసెంబ్లీ సమావేశాల్లోనూ నిరసన తెలుపుదామన్నారు. ఈ పోరాటంతో ఏపీ సర్కార్‌పై ఒత్తిడి తీసుకురావాలని, కార్యకర్తలను కాపాడుకోవాల్సిన బాధ్యత అందరిపైనా ఉందన్నారు. పార్లమెంట్‌లో ఈ అంశాన్ని ప్రస్తావిస్తామని.. ఆల్‌ పార్టీ సమావేశం అనంతరం ఎంపీలు విజయసాయిరెడ్డి, మిథున్ రెడ్డి తెలిపారు.

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..