తగ్గేదేలే.. కప్ప పామును వేటాడితే ఎట్టా ఉంటదో తెలుసా..?

కరవమంటే కప్పకు కోపం.. విడవమంటే పాముకు కోపం అంటారు. కానీ ద్వారకాతిరుమల మాధవుని కుంట వద్ద మాత్రం విడవమంటే కప్పకే కోపం అన్నట్లుగా ఒక విచిత్రం జరిగింది. తనను వేటాడాలని చూసిన పామునే ఎదురుదాడి చేసి నోటకరిచింది కప్ప. పాము తోక వరకు మింగేసి, ఆ పైన పట్టక, అటు వదలలేక ఆ కప్ప పడిన పాట్లు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

తగ్గేదేలే.. కప్ప పామును వేటాడితే ఎట్టా ఉంటదో తెలుసా..?
Brave Frog Swallows Snake In Eluru

Edited By:

Updated on: Mar 03, 2026 | 10:00 AM

ప్రకృతిలో ఎప్పుడూ ఒకే రూల్ ఉంటుంది.. పాము కప్పను వేటాడుతుంది.. కప్ప చిన్న పురుగులను తింటుంది. కానీ ఒక్కోసారి కాలం కలిసి రాకపోతే తాడే పామై కరుస్తుంది అంటారు.. ఇక్కడ మాత్రం సీన్ రివర్స్ అయింది.. ఏలూరు జిల్లా ద్వారకాతిరుమలలో కప్పే పామును నోటకరిచి అందరినీ ఆశ్చర్యపరిచింది. ద్వారకాతిరుమల శ్రీవారి మాధవుని కుంట వద్ద ఉన్న కాలువలో ఈ విచిత్రం చోటుచేసుకుంది. సాధారణంగా పామును చూడగానే ప్రాణభయంతో పారిపోయే కప్ప అక్కడ మాత్రం తగ్గేదేలే అంటూ ఎదురుదాడికి దిగింది. తన ప్రాణం మీదకు రావడంతో తన కంటే పెద్దగా ఉన్న పామునే నోట పట్టి మింగేయడానికి ప్రయత్నించింది.

వదలలేక.. మింగలేక..

పాము తోక భాగం వరకు నోట్లోకి తీసుకున్న కప్ప, ఆ తర్వాత పడిన పాట్లు చూసి దారిన పోయేవారు ముక్కున వేలేసుకున్నారు. కప్ప తన పొట్ట సైజు కంటే పెద్దగా ఉన్న పామును మింగలేక సగం వరకు ఆపేసింది. ఒకవేళ పామును వదిలేస్తే అది తిరిగి తనను కరుస్తుందన్న భయంతో.. నోటితో గట్టిగా పట్టుకుని వదలలేక, లోపలికి మింగలేక సతమతమైంది. “కరవమంటే కప్పకు కోపం.. విడవమంటే పాముకు కోపం” అనే సామెతను ఇక్కడ జనం తిరగేసి వాడుతున్నారు. విడవమంటే కప్పకు కోపం అన్నట్లుగా ఆ కప్ప వ్యవహారం ఉందని అక్కడి వారు చర్చించుకుంటున్నారు. ప్రాణం మీదకు వస్తే సామాన్యుడైనా, చిన్న జీవి అయినా ఎంతకైనా తెగిస్తుందని ఈ సంఘటన నిరూపించింది. ఈ వింత దృశ్యాన్ని చూసేందుకు స్థానికులు ఎగబడ్డారు. ప్రకృతిలో జరిగే ఇటువంటి అరుదైన పోరాటాలు సోషల్ మీడియాలో కూడా వైరల్‌గా మారుతున్నాయి.

Follow Us