
విజయవాడలో ఓ ప్రేమ వ్యవహారం తీవ్ర విషాదానికి దారితీసింది. ప్రేమించిన యువతి తనకు దూరమవుతుందనే ఆవేదనతో ఓ యువకుడు ఆమెపై దాడి చేయగా.. తీవ్రంగా గాయపడిన యువతి చికిత్స పొందుతూ మృతి చెందింది. ఘటన జరిగిన కొద్దిసేపటికే నిందితుడైన యువకుడు కూడా ఓ భవనం పై నుంచి దూకి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఈ ఘటన శనివారం ఉదయం న్యూ రాజరాజేశ్వరీపేటలో కలకలం రేపింది. మృతులను పడవల మహాలక్ష్మి (19), మంకు చిన్నారావు (22)గా పోలీసులు గుర్తించారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. శ్రీకాకుళం జిల్లాకు చెందిన మంకు చిన్నారావు పెయింటింగ్, ఫ్లవర్ డెకరేషన్ పనులు చేస్తూ జీవిస్తున్నాడు. పనుల కోసం తరచూ విజయవాడకు వచ్చి తన అన్నయ్య వద్ద ఉంటుండేవాడు. ఈ క్రమంలో న్యూ రాజరాజేశ్వరీపేటలోని జేఎన్‌ఎన్‌యూఆర్‌ఎం నివాస సముదాయంలో నాయనమ్మతో కలిసి ఉంటున్న మహాలక్ష్మితో సుమారు రెండేళ్ల క్రితం పరిచయం ఏర్పడింది. ఓ దుస్తుల దుకాణంలో పనిచేస్తున్న మహాలక్ష్మితో చిన్నారావుకు ఏర్పడిన పరిచయం క్రమంగా ప్రేమగా మారింది. ఇద్దరూ వివాహం చేసుకోవాలని నిర్ణయించుకున్నట్లు పోలీసులు తెలిపారు.
అయితే వీరి వివాహానికి ఇరు కుటుంబాల నుంచి అభ్యంతరాలు వ్యక్తమైనట్లు సమాచారం. దీంతో ఇటీవల పెద్దల సమక్షంలో ఇరు వర్గాల మధ్య పంచాయితీ కూడా జరిగినట్లు తెలుస్తోంది. ఆ సమయంలో ఇకపై మహాలక్ష్మిని కలవకుండా, ఆమె జోలికి వెళ్లకుండా ఉంటానని చిన్నారావు అంగీకరించినట్లు పోలీసులు తెలిపారు. ఈ నేపథ్యంలో శనివారం ఉదయం సుమారు 9.30 గంటల సమయంలో చిన్నారావు మహాలక్ష్మి ఇంటికి వెళ్లాడు. అక్కడ ఇద్దరి మధ్య మాటామాటా పెరిగినట్లు తెలుస్తోంది. వాగ్వాదం తీవ్రం కావడంతో ఆగ్రహానికి గురైన చిన్నారావు మహాలక్ష్మిపై దాడి చేసినట్లు పోలీసులు ప్రాథమికంగా నిర్ధారించారు. దాడిలో తీవ్రంగా గాయపడిన మహాలక్ష్మిని స్థానికులు వెంటనే ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. వైద్యులు చికిత్స అందించినప్పటికీ పరిస్థితి విషమించడంతో ఆమె మృతి చెందింది.
మహాలక్ష్మిపై దాడి చేసిన అనంతరం చిన్నారావు అక్కడి నుంచి వెళ్లిపోయాడు. కొద్దిసేపటికే సమీపంలోని ఓ భవనంపైకి ఎక్కి అక్కడి నుంచి కిందకు దూకాడు. తీవ్ర గాయాలపాలైన అతడు అక్కడికక్కడే మృతి చెందినట్లు పోలీసులు తెలిపారు. ఒకే ఘటనలో ప్రేమికులిద్దరూ ప్రాణాలు కోల్పోవడంతో న్యూ రాజరాజేశ్వరీపేటలో విషాద వాతావరణం నెలకొంది.
సమాచారం అందుకున్న అజిత్‌సింగ్ నగర్ పోలీసులు ఘటనాస్థలానికి చేరుకుని వివరాలు సేకరించారు. ఇద్దరి మృతదేహాలను పోస్టుమార్టం కోసం ప్రభుత్వ ఆసుపత్రి మార్చురీకి తరలించారు. ఈ వ్యవహారంపై గతంలో తమకు ఎలాంటి ఫిర్యాదు అందలేదని పోలీసులు తెలిపారు. ఘటనపై హత్య, ఆత్మహత్య కోణాల్లో కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. యువతి, యువకుడి మధ్య జరిగిన పరిణామాలు, కుటుంబాల అభ్యంతరాలు, గతంలో జరిగిన పంచాయితీ తదితర అంశాలపై పోలీసులు వివరాలు సేకరిస్తున్నారు.
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..