తిరుమల వైకుంఠద్వార సర్వదర్శనం టోకెన్ల జారీ సందర్భంగా అపశృతి చోటుచేసుకుంది. వైకుంఠ ద్వార దర్శనం సందర్భంగా తిరుపతిలోని విష్ణు నివాసం వద్ద దర్శనం టోకెన్ల కోసం భక్తులు పోటెత్తారు. టోకెన్ల కోసం ఒక్కసారిగా భక్తులు రావడంతో తీవ్ర తోపులాట జరిగింది. ఈ క్రమంలో తమిళనాడులోని సేలంకు చెందిన భక్తురాలితో సహా మొత్తం ఆరుగురు భక్తులు మృతి చెందారు. ఈ ఘటనలో మరో ఇరవై మంది భక్తులు అస్వస్థతకు గురయ్యారు. దీంతో అప్రమత్తమైన అధికారులు క్షతగాత్రులను రుయా ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ఘటనాస్థలానికి విజిలెన్స్, పోలీసులు పెద్ద ఎత్తున చేరుకుని పరిస్థితి అదుపులోకి తీసుకువచ్చేందుకు ప్రయత్నించారు.
వైకుంఠ ద్వార దర్శనం టోకెన్ల కోసం భక్తులు పోటెత్తారు. గురువారం, డిసెంబర్ 9 తెల్లవారుజాము నుంచి వైకుంఠ ద్వార దర్శనం టోకెన్ల జారీకి తిరుమల తిరుపతి దేవస్థానం ఏర్పాట్లు చేసింది. దీంతో బుధవారం సాయంత్రం నుంచే భక్తులు బారులు తీరారు. అలిపిరి, శ్రీనివాసం, సత్యనారాయణపురం, పద్మావతిపురంలో భక్తుల కోసం ఏర్పాటు చేసిన భారీ క్యూలైన్లలో బారులు తీరారు. అయితే అధిక సంఖ్యలో భక్తులు భారీగా రావడంతో క్యూలైన్లలో తోపులాట జరిగింది. దీంతో భక్తులు తీవ్ర అస్వస్థతకు గురయ్యారు.
తిరుమల వైకుంఠ ద్వార దర్శనం టోకెన్ల కోసం పెద్ద ఎత్తున భక్తులు తరలిరావడంతో తోపులాట జరిగింది. భక్తుల మధ్య తొక్కిసలాట చోటుచేసుకోవడంతో ఆరుగురు భక్తులు మృతి చెందారు. తిరుపతిలోని 9 కేంద్రాల్లో 94 కౌంటర్ల ద్వారా గురువారం నుంచి వైకుంఠ ద్వార దర్శనం టోకెన్లు జారీకి టీటీడీ ఏర్పాట్లు చేసింది. అయితే, టోకెన్ల కోసం బుధవారం(జనవరి 8) సాయంత్రమే భక్తులు భారీగా తరలి వచ్చారు. భక్తులు ఒకరు అస్వస్థతకు గురయ్యారు. దీంతో వారిని ఆసుపత్రికి తరలించేందుకు మెయిన్ గేట్ ఓపెన్ చేశారు. దీంతో ఒక్కసారిగా భక్తులు పెద్ద ఎత్తున దూసుకు రావడంతో ఈ దుర్ఘటన చోటుచేసుకున్నట్లు సమాచారం. తొక్కిసలాటలో గాయపడిన బాధితుల సంఖ్య మరింత పెరిగే అవకాశముందని భావిస్తున్నారు.
జనవరి 10, 11, 12 తేదీల్లో వైకుంఠ ద్వార దర్శనాలకు సంబంధించి మొదటి మూడు రోజులకు గానూ 1.20 లక్షల టోకెన్లను గురువారం ఉదయం జారీ చేయాలని టీటీడీ నిర్ణయించింది. మిగిలిన రోజులకు సంబంధించి ఆయా తేదీల్లో తిరుపతిలోని విష్ణునివాసం, శ్రీనివాసం, భూదేవి కాంప్లెక్స్‌లలో టికెట్ల జారీ టీటీడీ ఏర్పాట్లు చేసింది.
తీవ్ర దిగ్ర్భాంతి వ్యక్తం చేసిన సీఎం చంద్రబాబు
తిరుపతిలోని విష్ణు నివాసం దగ్గర జరిగిన తోపులాటలో నలుగురు భక్తులు మృతి చెందడంపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తీవ్ర దిగ్ర్భాంతి వ్యక్తం చేశారు. టోకెన్ల కోసం వచ్చిన నలుగురు భక్తులు ప్రాణాలు కోల్పోవడం తీవ్రంగా కలిచివేసిందని సిఎం అన్నారు. ఈ ఘటనలో గాయాలైన వారికి అందుతున్న చికిత్సపై అధికారులతో సీఎం ఫోన్లో మాట్లాడారు. జిల్లా, టీటీడీ అధికారులతో ఎప్పటికప్పుడు సీఎం సమీక్షిస్తున్నారు. ఉన్నతాధికారులు ఘటనా స్థలానికి వెళ్లి సహాయ చర్యలు చేపట్టాలని, క్షతగాత్రులకు మెరుగైన వైద్యం అందేలా చూడాలని సీఎం చంద్రబాబు ఆదేశించారు.
తొక్కిసలాట ఘటన తీవ్ర ఆవేదన కలిగించిందిః పవన్ కల్యాణ్
వైకుంఠ ద్వార దర్శనం టిక్కెట్ల కోసం తొక్కిసలాటలు చోటు చేసుకున్న ఘటన తీవ్ర ఆవేదనకు లోనయ్యానని డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ అన్నారు. భగవంతుడి దర్శనం కోసం వచ్చిన భక్తులు దుర్మరణం పాలవడం దురదృష్టకరమన్నారు. మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలియచేసిన డిప్యూటీ సీఎం, క్షతగాత్రులకు మెరుగైన వైద్య సేవలు అందించాలని వైద్యారోగ్య శాఖకు సూచించారు. మృతులు, క్షతగాత్రుల కుటుంబీకులకు సమాచారం ఇచ్చి, సహాయ సహకారాలు అందించాలని టీటీడీ అధికారులకు సూచించారు. మృతుల కుటుంబాలను పరామర్శించి మనో ధైర్యం ఇచ్చే బాధ్యతలు టీటీడీ పాలక మండలి తీసుకోవాలన్నారు పవన్ కల్యాణ్. ఈ ఘటన నేపథ్యంలో తిరుపతి నగరంలోని టికెట్ కౌంటర్ల దగ్గర క్యూ లైన్ల నిర్వహణలో అధికారులకు, పోలీసు సిబ్బందికి జనసేన నేతలు తోడ్పాటు అందించాలని విజ్ఞప్తి చేశారు.
ప్రభుత్వం అండగా ఉంటుందిః నారా లోకేష్
తిరుపతి తొక్కిసలాట ఘటనపై రాష్ట్ర మంత్రి నారా లోకేష్ స్పందించారు. నలుగురు భక్తులు మృతి చెందడం తీవ్ర మనోవేధనకు గురిచేసిందన్నారు. ఇటువంటి అవాంఛనీయ ఘటనలకు తావీయకుండా టీటీడీ మరింత పకడ్బందీగా ఏర్పాట్లు చేయాల్సి ఉందని అభిప్రాయపడ్డారు. మృతి చెందిన భక్తుల కుటుంబాలకు ప్రభుత్వం అండగా నిలుస్తుందని మంత్రి నారా లోకేష్ భరోసా ఇచ్చారు.
ప్రాణాలు కోల్పోవడం విచారకరంః వైఎస్ జగన్
తొక్కిసలాటలో భక్తులు మరణించడంపై మాజీ సీఎం, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తంచేశారు. మృతుల కుటుంబాలకు ప్రగాఢ సంతాపం తెలియజేశారు. గాయపడ్డవారికి మెరుగైన వైద్య సేవలు అందించాలని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. వైకుంఠ ఏకాదశి దర్శనం కోసం వచ్చిన భక్తులు ఇలా ప్రాణాలు కోల్పోవడం అత్యంత విచారకరమన్నారు. తక్షణం అక్కడ పరిస్థితులను చక్కదిద్దడానికి యుద్ధ ప్రాతిపదికన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్నవారు కోలుకోవాలని ఆకాంక్షించారు.
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..