దసరా సెలవులు కావడంతో సముద్ర తీరానికి వచ్చే సందర్శకుల తాకిడి పెరిగింది. బాపట్ల జిల్లా సూర్యలంక బీచ్ నుండి చీరాల బీచ్ వరకూ పర్యాటకులు క్యూ కడుతున్నారు. అయితే సముద్రలో సరదగా ఆటలు ఆడుతున్న యువకులను రాకాసి అలలు కబళిస్తున్నాయి. గతంలో కూడా వరుసగా పది మంది వరకూ సముద్ర అలలకు బలై పోవడంతో కొద్దీ రోజులు పాటు సముద్ర తీరాన్ని బాపట్ల జిల్లా అధికారులు మూసి వేశారు. అప్పటి నుండి బీచ్‌ల్లో ఈతలో శిక్షణ పొందిన వారికి, పోలీసులను నియమించి ఎటువంటి ప్రాణం నష్టం లేకుండా చర్యలు తీసుకుంటున్నారు.
అయితే తాజాగా బాపట్ల జిల్లా చీరాల మండలం వాడరేవు సముద్రం తీరంలో ఓ యువకుడి ప్రాణాలను మెరైన్ పోలీసులు కాపాడారు. అలల తాకిడికి సముద్రంలో కొట్టుకుపోతున్న యువకుడిని గుర్తించిన మెరైన్ పోలీసులు వెంటనే సముద్రంలోకి వెళ్ళి యువకుడిని కాపాడి సురక్షితంగా ఒడ్డుకు చేర్చారు. దసరా సెలవులు కావడంతో సాయంత్రం సమయంలో పల్నాడు జిల్లా నరసరావుపేట పట్టణానికి చెందిన నలుగురు యువకులు చీరాల వాడరేవు బీచ్ లో ఈత కొడుతూ సముద్రంలోకి వెళ్ళారు. ఒక్కసారిగా వచ్చిన అలల తాకిడికి 44 సంవత్సరాల షేక్ బాషా సముద్రంలోకి కొట్టుకుపోయాడు. అక్కడే విధులలో ఉన్న మెరైన్ పోలీస్ సిబ్బంది, గజ ఈతగాళ్లు తమ ప్రాణాలు సైతం లెక్కచేయకుండా సమద్రంలోకి దూకారు.
అలల తాకిడికి కొట్టుకుపోతున్న యువకుడిని రక్షించి ఒడ్డుకు చేర్చారు. అనంతరం ప్రథమ చికిత్స అందించి వారి బంధువులకు అప్పగించారు. పోలీస్ సిబ్బంది, గజ ఈతగాళ్లు స్పందించిన తీరు పట్ల పర్యాటకులు హర్షం వ్యక్తం చేశారు. షేక్ బాషా బంధువులు పోలీసులకు కృతజ్ఞతలు తెలిపారు. ఇటువంటి ఘటనలు తరచూ చోటు చేసుకోవడంతో పోలీసులు ముందుగా అప్రమత్తంగా ఉన్నారు. ఎస్పీ తూషార్ డూడీ గతఈతగాళ్ళతో పాటు పోలీసులను బీచ్ వద్ద ఉండేలా చర్యలు చేపట్టారు. దీంతో వెంటనే బాషాను రక్షించగలిగారు. యువకుడిని ప్రాణాలు తెగించి పోలీసులు రక్షించారు. వారిని జిల్లా ఎస్పీ తూషార్ డూడీ ప్రత్యేకంగా అభినందించారు.
చీరాల వాడరేవు, రామాపురం బీచ్ లలో పటిష్టమైన పోలీస్ నిఘా ఏర్పాటు చేయడంతో పాటు సముద్ర తీరం వెంబడి అనుకోని ప్రమాదాలకు గురైతే యాత్రికులను కాపాడేందుకు గజ ఈతగాళ్లను నియమించడంతో వెంటనే అలర్టై ప్రమాదానికి గురైన వారి ప్రాణాలను కాపాడే వెసులుబాటు కలిగిందని పోలీసులు తెలిపారు. వీకెండ్స్‌లో యాత్రికులు సముద్ర తీరాలలో ఆహ్లాదంగా గడిపేందుకు ఎక్కువ సంఖ్యలో వస్తారనే ఉద్దేశంతో బాపట్ల జిల్లా ఎస్‌పీ ఆదేశాలతో పోలీసు అధికారులు పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేశామని పోలీసులు తెలిపారు. ఇప్పటికైనా పర్యాటకులు సరైన జాగ్రత్తలు పాటిస్తే సముద్ర తీర ప్రయాణం ఆహ్లాదాన్నిస్తుందన్నారు.
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..