
ప్రధాని నరేంద్ర మోదీ తల్లి హీరాబెన్ మోదీ పేరుతో ఆంధ్రప్రదేశ్‌లో ఓ ఆలయం నిర్మిస్తున్నారు. కర్నూలు జిల్లాలోని ఎమ్మిగనూరు మండలం గుడికల్ గ్రామంలో ‘మాతా శ్రీ మందిరం’ నిర్మాణానికి నిర్వాహకులు శ్రీకారం చుట్టారు. అయితే ఈ ఆలయం కేవలం ఆధ్యాత్మిక కేంద్రంగానే కాకుండా.. అనాథ పిల్లలకు ఆశ్రయం, మూగజీవాలకు రక్షణ కల్పించే కేంద్రంగా కూడా రూపుదిద్దుకోనుంది.
మాతా శ్రీ మందిరం చారిటబుల్ సొసైటీ ఆధ్వర్యంలో ఈ నిర్మాణం చేపడుతున్నారు. సొసైటీ ప్రతినిధులు బాలాజీ, శివకుమార్ నిర్మాణ బాధ్యతలు తీసుకున్నారు. ఆలయ నిర్మాణానికి భూమిపూజ నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ఆదోని బీజేపీ ఎమ్మెల్యే పార్థసారథి, వైసీపీ మాజీ రాష్ట్ర వీరశైవ లింగాయత్ చైర్మన్ రుద్రగౌడ్ హాజరయ్యారు.
ఈ ప్రాంగణంలో మాతా శ్రీ మందిరంతో పాటు శివుడు, దక్షిణామూర్తి, శ్రీరాముడు, వినాయకుడి ఆలయాలను కూడా నిర్మించనున్నారు. అంతేకాదు.. అనాథ పిల్లలకు ఆశ్రయం కల్పించేందుకు శరణాలయం, మూగజీవాల సంరక్షణ కోసం గోశాల ఏర్పాటు చేయాలని నిర్వాహకులు నిర్ణయించారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే పార్థసారథి మాట్లాడుతూ.. హీరాబెన్ మోదీ పేరుతో ఆలయ నిర్మాణం చేపట్టడం అభినందనీయమన్నారు. ఆధ్యాత్మికతతో పాటు సేవా కార్యక్రమాలకు ప్రాధాన్యత ఇవ్వడం గొప్ప విషయమని కొనియాడారు.
మొత్తంగా హీరాబెన్ మోదీ పేరుతో నిర్మిస్తున్న ఈ ఆలయం.. భక్తితో పాటు సేవా కార్యక్రమాలకు కూడా వేదికగా నిలవనుంది.
Temple Spot