
పిల్లల పుట్టినరోజు వస్తే కొందరు లక్షల రూపాయలు వెచ్చించి ఆడంబరంగా వేడుకలు జరుపుతారు, మరి కొందరు ఆ ఖర్చుతో అనాథలకు సాయం చేసి మానవత్వాన్ని చాటుకుంటారు. కానీ తెలంగాణ క్యాడర్‌కు చెందిన ఓ ప్రభుత్వ అధికారి అంతకుమించి ఆలోచించారు. తన కుమార్తె పుట్టినరోజు వేడుకలకు పెట్టే ఖర్చుతో ఏకంగా ఓ పాఠశాల భవనాన్నే నిర్మించి, మారుమూల ఏజెన్సీ ప్రాంతంలోని గిరిజన విద్యార్థులకు కానుకగా అందించి ఆదర్శంగా నిలిచారు.
సొంత ఊరి రుణం తీర్చుకునేందుకు..
ఆంధ్రప్రదేశ్‌లోని అల్లూరి సీతారామరాజు జిల్లా హుకుంపేట మండలం ములియాపుట్టు గ్రామానికి చెందిన శెట్టి ప్రదీప్ కుమార్ 2015 బ్యాచ్‌కు చెందిన తెలంగాణ క్యాడర్ ఐఎఫ్‌ఎస్ (IFS) అధికారి. ఆయన పంచాయతీరాజ్ శాఖ జాయింట్ కమిషనర్‌గా పదోన్నతి పొందడంతో పాటు జనవరి 2024లో హైదరాబాద్ మెట్రోపాలిటన్ డెవలప్‌మెంట్ అథారిటీ (హెచ్ఎండీఏ) అర్బన్ ఫారెస్ట్రీ విభాగం డైరెక్టర్‌గానూ బాధ్యతలు నిర్వహించారు. తెలంగాణలో విధులు నిర్వర్తిస్తున్నప్పటికీ, తాను పుట్టి పెరిగిన ప్రాంతంపై ఉన్న మమకారంతో సొంత గడ్డ రుణం తీర్చుకోవాలని ఆయన భావించారు.
15 ఏళ్ల సమస్యకు పరిష్కారం
హుకుంపేట మండల పరిధిలోని మదుము గ్రామంలో పాఠశాల భవనం లేకపోవడంతో దాదాపు 25 మంది గిరిజన విద్యార్థులు, ఉపాధ్యాయులు గత 15 ఏళ్లుగా తీవ్ర అవస్థలు పడుతున్నారు. విద్యార్థులు చదువు కోసం సుదూర ప్రాంతాలకు కాలినడకన వెళ్లాల్సి వచ్చేది. ఈ పరిస్థితిని గమనించిన ప్రదీప్ కుమార్.. గిరి జాగృతి అసోసియేషన్ అధ్యక్షుడు మోరి సింహాచలం సహకారంతో మదుము గ్రామంలో ఎంపీపీ పాఠశాల భవనం నిర్మించాలని సంకల్పించారు.
కుమార్తె చేతుల మీదుగా ప్రారంభం
అనుకున్నదే తడవుగా సుమారు రూ.3 లక్షల సొంత నిధులతో నూతన పాఠశాల భవన నిర్మాణాన్ని పూర్తి చేయించారు. అనంతరం ప్రదీప్ కుమార్, సుమ దంపతులు తమ కుమార్తె దీత్య పుట్టినరోజు సందర్భంగా మదుము గ్రామానికి చేరుకున్నారు. కుమార్తె పుట్టినరోజు నాడే, ఆమె స్వహస్తాలతో ఆ పాఠశాల భవనాన్ని ప్రారంభించి గిరిజన విద్యార్థులకు అంకితమిచ్చారు.
విద్య ద్వారా అడవి బిడ్డల జీవితాల్లో వెలుగులు నింపేందుకు కృషి చేసిన ఐఎఫ్‌ఎస్ అధికారి ప్రదీప్ కుమార్‌పై సర్వత్రా ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయి. తమ చిన్నారుల కోసం పాఠశాల నిర్మించి ఇచ్చిన ఆ అధికారి కుటుంబానికి స్థానిక గిరిజన విద్యార్థులు, వారి తల్లిదండ్రులు కృతజ్ఞతలు తెలుపుతున్నారు.
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.