
కర్నూలు జిల్లాలో విషాదకర ఘటన చోటుచేసుకుంది. స్థానిక సంస్థల ఎన్నికల్లో ఘన విజయం సాధించిన ఆనందం ఆ కుటుంబంలో ఎంతోసేపు నిలవలేదు. ఆలూరు-4 ఎంపీటీసీ స్థానం నుంచి టీడీపీ అభ్యర్థిగా పోటీ చేసి గెలుపొందిన బోయ లక్ష్మి (50) ఆకస్మికంగా మృతి చెందారు. ఎన్నికల ఫలితాలు వెలువడిన కొద్ది రోజులకే ఆమె కన్నుమూయడంతో కుటుంబ సభ్యులు, టీడీపీ శ్రేణుల్లో విషాదం నెలకొంది.
ఇటీవల జరిగిన ఎంపీటీసీ ఎన్నికల ఓట్ల లెక్కింపులో బోయ లక్ష్మి వైఎస్సార్సీపీ అభ్యర్థిపై 628 ఓట్ల మెజారిటీతో విజయం సాధించారు. ఫలితాలు వెల్లడైన అనంతరం కుటుంబ సభ్యులు, పార్టీ నాయకులతో కలిసి విజయోత్సవాలు జరుపుకున్నారు. అయితే ఇంటికి వెళ్లిన తర్వాత ఆమెకు ఒక్కసారిగా అధిక రక్తపోటు (హైబీపీ) సమస్య తలెత్తింది.
ఆదివారం (నవంబర్ 08) రాత్రి ఆమె ఆరోగ్య పరిస్థితి ఆందోళనకరంగా మారడంతో కుటుంబ సభ్యులు వెంటనే కర్నూలులోని ఓ ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు. అక్కడ వైద్యులు చికిత్స అందించినప్పటికీ ఫలితం లేకపోయింది. చికిత్స పొందుతూ సోమవారం రాత్రి బోయ లక్ష్మి తుదిశ్వాస విడిచినట్లు కుటుంబ సభ్యులు వెల్లడించారు.
ఎన్నికల్లో విజయం సాధించి ప్రజాప్రతినిధిగా బాధ్యతలు చేపట్టాల్సిన సమయంలో ఆమె మరణవార్త వెలువడటంతో ఆలూరు నియోజకవర్గంలో విషాదం అలుముకుంది. లక్ష్మి మృతి పట్ల ఆలూరు టీడీపీ నియోజకవర్గ ఇన్ఛార్జి వైకుంఠం జ్యోతి తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మృతురాలి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలియజేశారు. ఈ కష్ట సమయంలో కుటుంబానికి మనోధైర్యం కలగాలని ఆకాంక్షించారు. విజయోత్సవాలతో కళకళలాడిన ఇంట్లో ఒక్కసారిగా విషాదం నెలకొనడంతో స్థానికులు, పార్టీ కార్యకర్తలు విచారం వ్యక్తం చేస్తున్నారు.
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..