అసలే బంగాళాఖాతంలో అల్పపీడనం..! బలమైన ఎదురుగాలులు.. తీరం బయట వర్షం అల్లాడిస్తుంటే.. మరి నడి సముద్రంలో పరిస్థితి ఎలా ఉంటుందో ఊహించుకుంటూనే గుండె హై స్పీడ్ లో కొట్టుకుంటుంది. అటువంటి పరిస్థితుల్లో నడిసముద్రంలో బోటు ఆగిపోతే..? ఇంజన్ మరమ్మతులకు గురై నిలిచిపోతే..? పైన ఆకాశం కింద నీరు తప్ప చుట్టుపక్కల ఏదీ కనిపించని ప్రాంతంలో వెళ్లి చిక్కుకు పోతే..? కమ్యూనికేషన్ సంబంధాలు పూర్తిగా తగ్గిపోతే..? ఆమ్మో… ఊహించుకోలేం. గంటపాటు అలా జరిగితేనే తట్టుకోలేం.. కానీ ఒకటి కాదు రెండు కాదు ఏకంగా ఐదు రోజుల పైనే నడిసంద్రంలో చిక్కుకుపోయారు ఆ తమిళ జాలర్లు. గంగను నమ్ముకున్న జాలర్లకు ఆ తల్లి కనికరించిందో ఏమో కానీ.. ఎట్టకేలకు ఒడ్డుకు చేరుకున్నారు. వేటకు వెళ్లిన తమిళనాడు మత్స్యకారులు నడిసముద్రంలో చిక్కుకున్నారు. బోటు ఇంజిన్ ఫెయిలవ్వడంతో బోటు కదలక నడిసంద్రంలోనే మత్స్యకారులు ఉండిపోయారు. దీంతో ఆహారం కమ్యూనికేషన్ లేక అల్లాడుతున్న ఆ మత్స్యకారులను 100 నాటికల మహిళ దూరంలో గుర్తించారు కోస్ట్ గార్డ్. సముద్రం మధ్యలో నుంచి కోస్ట్ గార్డ్ నౌక సాయంతో.. బోటుతో సహా విశాఖ ఫిషింగ్ హార్బర్‌కు తీసుకొచ్చారు.
ఈదురుగాలులు.. అల్లకల్లోలంగా సముద్రం.. ఎగసిపడుతున్న అలలు.. వర్షం.. బిక్కుబిక్కుమంటూ కమ్యూనికేషన్ లేక ఐదు రోజుల పాటు నరకయాతన అనుభవించారు మత్స్యకారులు. గత నెల 24న తమిళనాడు కాశీ మేడ్ హార్బర్ తీరం నుంచి బయలుదేరింది. తొమ్మిది మంది మత్స్యకారులతో వేట కోసం సముద్రంలోకి బయలుదేరింది. IFB పెరుమాళ్( Reg no: IND – TN – 02- MM-2591) బోటు వేట చేస్తుండగా ఈ నెల రెండో తేదీన నడిసంద్రంలో ఇంజిన్ ఫెయిల్ అయింది. అప్పటి నుంచి ఆగిపోయింది బోటు. సముద్రంలోనే ఉండిపోయారు ఆ పది మంది మత్స్యకారులు. బోటు యజమాని మత్స్యకారుల మధ్య కమ్యూనికేషన్ లేక సమాచారం అందలేదు. దీంతో ఆందోళనకు బోటు యజమాని తమిళనాడులోని అధికారులకు సమాచారం ఇచ్చారు.
ఈలోగా సముద్రంలో అల్పపీడనం, గాలుల దాటి పెరిగింది. బోటులో ఉన్న మత్స్యకారుల పరిస్థితి అగమ్యగోచరంగా మారింది. సముద్ర ఉపరితలం, గగనతలంలో నేవీ సిబ్బంది పర్యవేక్షించారు. నేవి నౌకలు, విమానాలు అన్నీ సమన్వయంతో పని చేశాయి. చెన్నైకి 240 మైళ్ళ దూరంలోని.. నెల్లూరు కావలి తీరానికి సముద్రం మధ్యలో బోటు ఉన్నట్టు గుర్తించిన నేవీ.. కమ్యూనికేట్ చేసింది. అయితే కోస్ట్ గార్డ్ షిప్ అక్కడకు చేరేవరకు.. మత్స్యకారుల బోటును MRCC చెన్నై సమీపంలోని మర్చంట్ నౌక ఎంవి జగ్ రాధ సహకారాన్ని తీసుకున్నారు. విశాఖ సముద్రం వైపు మత్స్యకారుల బోటు మల్లింది. నిన్న ఉదయం బోటును గుర్తించిన కోస్ట్ గార్డ్.. విశాఖకు 110 నాటికల్ మైళ్ల దూరం లో ఉన్నట్టు గుర్తించారు. ఈలోగా కోస్ట్ గార్డ్‌కి చెందిన ICGS AYUSH నౌక తన సిబ్బందితో ఈనెల 6న బోటు వరకు చేరుకోగలిగింది. అక్కడకు చేరుకున్న వెంటనే కోస్ట్ గార్డు సిబ్బంది.. వెనువెంటనే అవసరమైన వైద్యం, కమ్యూనికేషన్ సదుపాయం కల్పించారు. ఆగిపోయిన బోటుకు లాజిస్టిక్ సదుపాయాన్ని అందించి.. నౌక సాయంతో నడిసంద్రంలో ఆగిపోయిన మత్స్యకారుల బోటును తీరానికి లాక్కొచ్చారు. వైజాగ్ ఫిషింగ్ హార్బర్‌కు గురువారం ఉదయం 10 గంటలకు మత్స్యకారుల బోటు చేరుకుందని అంటున్నారు కోస్ట్ గార్డ్ సిబ్బంది.
దీంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. మెరైన్ పోలీసులు విచారణ ప్రారంభించారు. తొమ్మిది మంది సిబ్బంది సేఫ్ గా ఉండడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. సమాచారాన్ని తమిళనాడుకు అందించారు. పాడైన బోటు మరమ్మతులు చేసేందుకు పర్మిషన్ తీసుకుని.. మరమ్మతులు పూర్తి చేసి ఇక్కడ నుంచి పంపించే ఏర్పాట్లు చేస్తున్నామన్నారు మెరైన్ ఎస్ఐ రామారావు. ఇదీ.. నడిసంద్రంలో చుక్కాని లేని నావలా చెక్కుకున్న ఆ మత్స్యకారులకు.. నేవీ కోస్ట్ కార్డు సిబ్బంది సమన్వయంతో తీరం వైపు మార్గాన్ని చూపించారు. సముద్రంలోంచి బయటపడదామా లేదా అన్న ఆందోళనలతో గంటలు రోజులు గడిపిన ఆ మత్స్యకారులకు.. చివరకు నేవీ కోస్ట్ గార్డ్ సిబ్బంది సేఫ్‌గా ఒడ్డుకు చేర్చారు. దీంతో వారికి చేతులు జోడించి నమస్కరించారు ఆ మత్స్యకారులు.