గుంటూరు, ఆగస్టు 29: ఆమె పేరు షీలా.. తెనాలి మండలం పెదరావూరు సొంతూరు. చిన్నప్పుడే తల్లి మరణించింది. గ్రామంలోనే ఉన్నత విద్య వరకూ చదువుకుంది. ఆ తర్వాత తెనాలిలో ఇంటర్ చదివింది. డిగ్రీ కోసం జేఎంజే కాలేజ్ లో చేరింది. అయితే పేదరికం కారణంగా తండ్రి చదివించలేకపోయారు. అంతేకాదు ఆటో డ్రైవర్ అయినా కరుణాకర్ తో 2003లో వివాహం చేశారు. తనకు చదువుకోవాలని ఉందని భర్తను అడిగింది. అందుకు భర్త సరే అన్నారు. దీంతో రెండేళ్ల పాటు డిగ్రీ చదివింది. అయితే మరోసారి పేదరికం కారణంగా చదువు మధ్యలోనే మానేయాల్సి వచ్చింది. అనంతరం 2008లో ప్రభుత్వం ఉచితంగా ఇచ్చిన కంప్యూటర్ శిక్షణలో పాసై పిజిడిసిఏ సర్టిఫికేట్ అందుకుంది. దాని సాయంతో డేటా ఎంట్రీ ఆపరేటర్ ఉద్యోగం కోసం ప్రయత్నిస్తే డిగ్రీ కావాలన్నారు. దీంతో తిరిగి చదువుకోవాలన్న కోరికను భర్తకు చెప్పింది.
పిల్లలిద్దరితో పాటు తాను కూడా చదువుకుంటూ డిగ్రీ పూర్తి చేసింది. ఆ తర్వాత కామర్స్ లో పిజీ కూడా చదివింది. ఎయిడెడ్ కాలేజ్ లో టీచర్ ఉద్యోగం కోసం దరఖాస్తు చేసుకోవాలంటే పిహెచ్డి కావాలని చెప్పారు. అదే సమయంలో యూరివర్సిటీలో పిహెచ్డి చేసేందుకు పుల్ టైమ్ స్కాలర్ గా చేరింది. అయితే ఆర్థిక సమస్యలతో కొద్దీ రోజుల తర్వాత మానేయాల్సి వచ్చింది. మరోసారి ఆమెకు అదృష్టం కలిసొచ్చింది. 2016లో రాజీవ్ గాంధీ నేషనల్ ఫెలోషిప్ కు ఎంపికైంది. ఇక వెనుదిరిగి చూడలేదు. డాక్టర్ ఎన్ రత్న కిషోర్ గైడ్ గా సర్వీస్ క్వాలిటీ ఇన్ హెల్త్ సర్వీస్ లో పరిశోధన గ్రంధాన్ని పూర్తి చేసింది. ఆమె చేసిన థీసిస్ కు పిహెచ్డి లభించింది.
ఎన్ని అవాంతరాలు ఎదురైన తల వంచకుండా అనునిత్యం చదవాలన్న తపనతోనే ఉన్నత స్థానానికి చేరుకున్నట్లు షీలా చెప్పింది. ప్రస్తుతం ఆమె తెనాలిలోని కాలేజ్ లో కామర్స్ విభాగంలో అధ్యాపకురాలిగా పనిచేస్తుంది. ఈ రోజు ఆచార్య నాగార్జున యూనివర్సిటీ నలభైవ స్నాతకోత్సవంలో పిహెచ్డి పట్టా అందుకోనుంది.
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం