రాజమండ్రి పోలీసులకు CPR శిక్షణ.. గుండె ఆగినవారికి ప్రాణం పోసేలా ప్రత్యేక ట్రైనింగ్!

ఆపదలో ఆదుకునే CPR ప్రాముఖ్యతపై రాజమండ్రి పోలీసులకు ప్రత్యేక శిక్షణ అందిస్తున్నారు. KIMS ఆసుపత్రి సహకారంతో జరుగుతున్న ఈ కార్యక్రమంలో పోలీసులు, జైలు సిబ్బంది గుండెపోటు వంటి అత్యవసర పరిస్థితుల్లో ప్రాణాలను ఎలా కాపాడాలో నేర్చుకుంటున్నారు. వైద్య సహాయం అందేలోపు సరైన CPR అందించడం ద్వారా ప్రాణ నష్టాన్ని నివారించవచ్చని ఈ శిక్షణ లక్ష్యం.

రాజమండ్రి పోలీసులకు CPR శిక్షణ.. గుండె ఆగినవారికి ప్రాణం పోసేలా ప్రత్యేక ట్రైనింగ్!
Cpr Training For Police

Edited By:

Updated on: Oct 04, 2026 | 1:49 PM

CPR.. మూడక్షరాల ఈ పదానికి వైద్య శాస్త్రంలో అత్యంత ప్రాధాన్యత ఉంది. గుండె ఆగినపుడు ఆపదలో ఆదుకునే ఆపన్నహస్తమే CPR. ప్రాణవాయువు అందించి ఆగిన గుండెను పనిచేసేలా చేసే ఈ ప్రక్రియతో తిరిగి జీవితాన్ని ప్రసాదించవచ్చు. ఆపదలో ఉన్న వారికి CPR అందించి ప్రాణ రక్షణ కల్పించాలని నిర్ణయించిన పోలీసు శాఖ సిబ్బందికి ప్రత్యేకంగా శిక్షణ ఇప్పిస్తోంది. కిమ్స్ ఆస్పత్రి సహాయ సహకారంతో రాజమహేంద్రవరంలో వందలాది మంది పోలీసులు, జైలు సిబ్బంది, ట్రాపిక్ పోలీసులకు శిక్షణ ఇస్తోంది. వచ్చే ఏడాది గోదావరి పుష్కరాలకు లక్షలాది భక్తులు రానున్నవేళ.. అత్యవసర పరిస్థితుల్లో విలువైన ప్రాణాలను కాపాడేందుకు పోలీసులకు ప్రత్యేక శిక్షణ అందిస్తోంది కిమ్స్‌ ఆస్పత్రి. గుండెపోటుతో కుప్పకూలిన వారికి వైద్య సాయం అందేలోపు ప్రాథమికంగా చేయాల్సిన సీపీఆర్‌పై అవగాహన కల్పిస్తోంది. ఆపదను గుర్తించడం.. అప్రమత్తంగా స్పందించడం.. ఆగిన గుండెకు తిరిగి ప్రాణం పోసే ప్రయత్నం చేయడం.. ఇదే ఈ శిక్షణ లక్ష్యమంటోంది.

శిక్షణ ఇలా..

బెడ్‌పై రబ్బరు బొమ్మను ఉంచి.. రెండు చేతులు జోడించి బొమ్మ ఛాతి భాగంలో గట్టిగా అదిమిపట్టి పలుమార్లు నొక్కుతున్న దృశ్యాలు చూడండి. బొమ్మకు ప్రత్యేకంగా ఓ యంత్రాన్ని బిగించి.. ఓ నిపుణుడి శిక్షణలో ఊపిరి పోస్తోన్న వీరంతా రాజమహేంద్రవరంలోని పోలీసులే. లా అండ్ ఆర్డర్, ట్రాపిక్ పోలీసులు సహా జైలు సిబ్బంది సైతం ఉన్నారు. వీరందరినీ ఓ చోట చేర్చిన పోలీసు శాఖ.. కీలకమైన CPRపై ఇలా ప్రత్యేకంగా శిక్షణ ఇస్తోంది. కార్డియో పల్మనరీ రిససిటేషన్ (CPR)‌ను సంక్షిప్తంగా సీపీఆర్‌ అని పిలుస్తుండగా.. గుండె ఆగిపోయిన వ్యక్తికి అత్యవసరంగా అందించే ప్రాణరక్షక ప్రక్రియగా పేరొందింది. బస్టాండ్లు, రైల్వేస్టేషన్, రోడ్లు, పబ్లిక్ ప్రాంతాల్లో ఎవరైనా ఉన్నట్టుండి గుండె ఆగిపోయి రోడ్డుపై పడిపోతే వారికి సీపీఆర్ చేసి ప్రాణ దానం చేయడమే లక్ష్యంగా రాజమహేంద్రవరంలోని కిమ్స్ అస్పత్రి ఈ తరహా శిక్షణ ఇస్తోంది. పోలీసు సిబ్బందికి ఒక్కొక్కరుగా ఇలా శిక్షణ తీసుకోగా.. జిల్లా ఎస్పీ నరసింహ కిషోర్ సైతం శిక్షణలో పాలు పంచుకున్నారు.

ఆకస్మిక మరణాలను తగ్గించి..

గుండె పోటు మరణాలు పెరుగుతున్న ప్రస్తుత పరిస్ధితుల్లో ఆకస్మిక మరణాలను తగ్గించి ప్రాణాలు పోయాలన్న సంకల్పంతో ఏపీ కార్డియాలజీ సొసైటీ ఆఫ్ ఇండియా.. (ఏపీ సీఎస్ఐ), ఎరేమియా సొసైటీ ఆఫ్ ఇండియా సహాకారంతో కిమ్స్ ఆస్పత్రి ఈ తరహా కార్యక్రమాన్ని చేపట్టింది. కిమ్స్ ఆస్పత్రి సీఈవో, చీఫ్ కార్డియాలజిస్ట్ డాక్టర్ NS రామరాజు నేతృత్వంలో నిర్వహించిన శిక్షణా కార్యక్రమానికి రాష్ట్ర జైళ్ల శాఖ ఐజీ ఐ. శ్రీనివాసరావు, తూర్పు గోదావరి జిల్లా ఎస్పీ నరసింహ కిషోర్, ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు. హృద్రోగ వైద్యులు హైగ్రీవ్ రావు, సహా శిక్షకుల ఆధ్వర్యంలో వందమందిపైగా సిబ్బందికి రోజంతా CPR పై శిక్షణ ఇచ్చారు. సీపీఆర్ అంటే ఏమిటి..? ఎందుకు చేయాలి.? ఏయే సందర్బాల్లో చేయాలి..? చేసేటప్పుడు తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏమిటి..? అనే విషయాలను వైద్యులు పోలీసు సిబ్బందికి సవివరంగా తెలియజేశారు. అందుబాటులో ఉంటే ఆటోమేటెడ్ ఎక్స్‌టర్నల్ డీఫిబ్రిలేటర్ (AED)ను ఉపయోగించాలని, వైద్య సాయం అందే వరకూ సహాయక చర్యలు కొనసాగించాలని సూచించారు. వచ్చే ఏడాది గోదావరి పుష్కరాలకు లక్షలాదిగా భక్తులు తరలివస్తారు. వీరిలో ఎవరికైనా అత్యవసర పరిస్ధితి వస్తే ప్రాణాలు రక్షించడమే లక్ష్యంగా ఈ తరహా కార్యక్రమం చేపట్టినట్లు తెలిపారు.

శ్వాస సాధారణంగా లేకపోయినప్పుడు..

గుండె కొట్టుకోవడం ఆగిపోయినప్పుడు.. శ్వాస సాధారణంగా లేకపోయినప్పుడు తక్షణమే స్పందించడం ఎంతో కీలకమని వైద్య నిపుణలు తెలిపారు. అటువంటి సమయంలో ఛాతీపై సరైన పద్ధతిలో ఒత్తిళ్లు ఇవ్వడం ద్వారా రక్త ప్రసరణ కొనసాగేందుకు సాయపడవచ్చు. వైద్య సాయం అందేలోపు చేసే ఈ ప్రయత్నం.. బాధితుడి ప్రాణాలు నిలిపే అవకాశాలను పెంచుతుందని తెలిపారు. సీపీఆర్‌పై అవగాహన ఉంటే.. వైద్య సాయం అందేవరకు బాధితుడికి సహాయ పడవచ్చన్నారు. అయితే దీనిని సరైన పద్ధతిలో చేయడం కోసం నిపుణుల శిక్షణ అవసరమని తెలిపారు. ప్రజల ప్రాణాలు కాపాడే మహోన్నత లక్ష్యంతో ఈ తరహా శిక్షణ ఇవ్వడం, తాము భాగస్వామ్యం కావడంపై పోలీసు సిబ్బంది సంతోషం వ్యక్తం చేశారు. శిక్షణ పొందినవారందరికీ ప్రత్యేకంగా ధృవపత్రాలు జారీ చేశారు. అత్యవసర పరిస్థితుల్లో ఆందోళనకు గురికాకుండా.. అప్రమత్తంగా వ్యవహరిస్తూ.. బాధితులకు సకాలంలో వైద్య సహాయం అందేలా చూడటమే కార్యక్రమం ఉద్దేశమని పోలీసు శాఖ తెలిపింది. ప్రజలకు సైతం అవగాహన కల్పించేలా చర్యలు తీసుుకుంటామని, ప్రాణరక్షణలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని పిలుపునిచ్చింది.

వీడియో చూడండి..

 

Loading...
Unable to load recommendations.
Follow Us