
అల్లూరి జిల్లా పాడేరు ఏజెన్సీలో చిరుతపులి కలకలం సృష్టించింది. పొలాల్లో సంచరిస్తూ స్థానికులను భయాందోళనకు గురిచేస్తోంది. పాడేరు మండలం లాడపుట్టు సమీపంలో చిరుతపులి కనిపించింది. చిరుతపులిని గమనించిన ఓ వ్యక్తి.. వెంటనే సెల్‌ఫోన్లో వీడియో రికార్డ్ చేసి అటవీశాఖ అధికారులకు సమాచారం అందించారు. విషయం తెలుసుకున్న ఫారెస్ట్ అధికారులు అప్రమత్తమయ్యారు. చిరుత సంచరించిన ప్రాంతాన్ని పరిశీలించారు. చిరుత సంచారానికి సంబంధించి అధికారులు పరిసర ప్రాంతాల్లో పాదముద్రలను సేకరించారు. సంచరిస్తున్న జంతువు చిరుత పులి గానే వ్యవహరించి పరిసర గ్రామాలను అప్రమత్తం చేశారు. లాడపుట్టు, బొక్కెళ్ళు గ్రామాల ప్రజలతో సమావేశమై అవగాహన కల్పించారు. ఒంటరిగా పొలాల్లో అడవుల్లోకి వెళ్లొద్దని సూచించారు.
చిరుత కదలికలను గుర్తించేందుకు అవసరమైన చర్యలు చేపడుతున్నట్లు అధికారులు తెలిపారు. గత కొండలలో చిరుత పులి ఆ ప్రాంతంలో సంచారం ఇదే తొలిసారి కావడంతో అధికారులు కూడా ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. చిరుత పులి కదలికలను గుర్తించేందుకు ప్రత్యేక బృందం రంగంలోకి దింపామని ఫారెస్ట్ రేంజర్ ప్రేమ అన్నారు. చిరుత కనిపిస్తే.. వెంటనే సమాచారం ఇవ్వాలని సూచించారు.
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..