
ప్రకాశం జిల్లా అద్దంకి నియోజకవర్గ పరిధిలోని పలు గ్రామాల్లోనూ ఇలాంటి పరిస్థితులు కనిపిస్తున్నాయి. అద్దంకి మండలంలోని విప్పర్లవారిపాలెం, కొరిశపాడు మండలంలోని బొడ్డువానిపాలెం గ్రామాలు పక్కపక్కనే కలిసి ఉంటాయి. అయితే ఈ రెండు గ్రామాల మధ్యలో ఉన్న చిన్న వాగు వాటిని వేరు చేస్తుంది. గ్రామాలు పక్కపక్కనే ఉన్నప్పటికీ రెండు వేర్వేరు గ్రామపంచాయతీలుగా, రెండు మండలాల పరిధిలో కొనసాగుతున్నాయి. అలాగే అద్దంకి మండలంలోని మైలవరం పంచాయతీ పరిధిలో ఉన్న ఏలేశ్వరవారిపాలెం, బల్లికురవ మండలంలోని వెలమవారిపాలెం గ్రామాలు కూడా కలిసే ఉంటాయి. ఈ రెండు గ్రామాల మధ్య కేవలం ఒక రోడ్డు మాత్రమే ఉంది. అయినప్పటికీ అవి వేర్వేరు పంచాయతీలు, మండలాల పరిధిలో ఉన్నాయి.
రాజుపాలెంలో మరింత విచిత్ర పరిస్థితి
ప్రకాశం జిల్లాలోని బల్లికురవ మండలం కె. రాజుపాలెం, బాపట్ల జిల్లాలోని మార్టూరు మండలం రాజుపాలెం గ్రామాలు ఒకదానికొకటి ఆనుకుని ఉంటాయి. ఈ రెండు గ్రామాల మధ్య ఉన్న ప్రధాన వీధే జిల్లా, మండల సరిహద్దుగా ఉంది. వీధికి ఒకవైపు ప్రకాశం జిల్లా, మరోవైపు బాపట్ల జిల్లా ఉండటంతో ఒకే ఊరు రెండు జిల్లాలు, రెండు మండలాలు, రెండు పంచాయతీలు, రెండు నియోజకవర్గాలుగా విడిపోయింది.
మండల వ్యవస్థ ఏర్పడక ముందు వరకు ఈ ప్రాంతమంతా ఒకే గ్రామంగా ఉండేది. అయితే మండలాల ఏర్పాటు తర్వాత గ్రామంలోని ప్రధాన వీధినే విభజన రేఖగా నిర్ణయించడంతో ఒకే ఊరు రెండు తహసీల్దార్ పరిధుల్లోకి వెళ్లింది. దీంతో రెండు వేర్వేరు మండలాలు, పంచాయతీలు, నియోజకవర్గాలుగా మారింది.
ఎన్నికలొస్తే ఎవరి ఓట్లు వారివే!
రాజుపాలెం గ్రామస్థులంతా కలిసిమెలిసి ఉంటారు. అయితే ఎన్నికలు వచ్చినప్పుడు మాత్రం ఎవరి రాజకీయాలు వారివే.. ఎవరి ఓట్లు వారివే అన్నట్లుగా పరిస్థితి మారిపోతుంది. బాపట్ల జిల్లా పర్చూరు నియోజకవర్గంలోని మార్టూరు మండలం రాజుపాలెం గ్రామస్థులు ఒక పంచాయతీకి, ప్రకాశం జిల్లా అద్దంకి నియోజకవర్గంలోని బల్లికురవ మండలం కె. రాజుపాలెం గ్రామస్థులు మరో పంచాయతీకి ఓటు వేయాల్సి ఉంటుంది.
ఈ రెండు గ్రామాల మధ్య ప్రధాన వీధి మాత్రమే సరిహద్దుగా ఉన్నప్పటికీ ఎన్నికల నిర్వహణ మాత్రం వేర్వేరుగా జరుగుతోంది. ప్రస్తుతం ఈ రెండు పంచాయతీల్లో రెండు విడతలుగా ఎన్నికలు నిర్వహిస్తున్నారు. బాపట్ల జిల్లా రాజుపాలెంలో మొదటి విడతగా ఈ నెల 26న, ప్రకాశం జిల్లా కె. రాజుపాలెంలో రెండో విడతగా ఈ నెల 29న ఎన్నికలు జరగనున్నాయి. ఎన్నికల సమయంలో మాత్రమే తమవి రెండు వేర్వేరు గ్రామాలని గుర్తుకు తెచ్చుకుంటామని స్థానికులు చెబుతున్నారు. మిగిలిన సమయాల్లో మాత్రం అందరూ ఒకే గ్రామస్థులుగా కలిసిమెలిసి ఉంటున్నారు.
పండుగలు, ఉత్సవాల్లో మాత్రం అంతా ఒక్కటే!
రాజుపాలెంలో ఒక పంచాయతీ పరిధిలో రామాలయం ఉండగా, మరో పంచాయతీ పరిధిలో ఆంజనేయస్వామి దేవాలయం ఉంది. గ్రామం రెండు పంచాయతీలుగా విడిపోయినప్పటికీ పండుగలు, దేవుళ్ల ఉత్సవాల సమయంలో మాత్రం గ్రామస్థులంతా కలిసి వేడుకలు నిర్వహించుకుంటారు. రాజకీయాలు వేరైనా, పండుగలు, సంప్రదాయాల విషయంలో మాత్రం అందరూ ఒక్కటిగా ఉంటారు.
ఇల్లు ఒకచోట.. వ్యవసాయ భూమి మరోచోట!
ఈ గ్రామంలో నివసించే ప్రజలకు మరో ప్రధాన సమస్య కూడా ఉంది. బాపట్ల జిల్లా మార్టూరు మండలం రాజుపాలెంలో ఇళ్లు ఉన్న కొంతమంది గ్రామస్థులకు ప్రకాశం జిల్లా బల్లికురవ మండలం కె. రాజుపాలెం పంచాయతీ పరిధిలో వ్యవసాయ భూములు ఉన్నాయి. దీంతో భూములకు సంబంధించిన రెవెన్యూ వ్యవహారాల కోసం వేర్వేరు కార్యాలయాలను సంప్రదించాల్సి వస్తోంది. అప్పుడప్పుడు ఈ విషయంలో సమస్యలు కూడా ఎదురవుతున్నాయి.
ఒకే ఊరిలో పక్కపక్కనే ఉండే ఇళ్లకు వేర్వేరు రేషన్ దుకాణాలు, వేర్వేరు పంచాయతీ కార్యాలయాలు ఉండటం స్థానికులకు ఇబ్బందిగా మారింది. ఇల్లు ఒక పంచాయతీ పరిధిలో, వ్యవసాయ భూమి మరో పంచాయతీ పరిధిలో ఉండటంతో ప్రభుత్వ పథకాలు, రెవెన్యూ పనుల కోసం కిలోమీటర్ల దూరం ప్రయాణించాల్సి వస్తోంది.
అభివృద్ధి పనుల్లోనూ సమస్యలే!
గ్రామాన్ని రెండు పంచాయతీలుగా విభజించడంతో రోడ్లు, డ్రైనేజీ వంటి మౌలిక సదుపాయాల కల్పనలోనూ ఇబ్బందులు ఎదురవుతున్నాయి. గ్రామంలోని ప్రధాన వీధి రెండు పంచాయతీలకు సరిహద్దుగా ఉండటంతో అక్కడ చేపట్టాల్సిన అభివృద్ధి పనుల బాధ్యత ఎవరికి చెందుతుందనే విషయంలో సమస్యలు తలెత్తుతున్నాయి. రోడ్డు తమ పరిధిలోకి రాదంటే తమ పరిధిలోకి రాదంటూ రెండు నియోజకవర్గాలకు చెందిన నాయకులు అభివృద్ధి పనుల విషయంలో వంతులు వేసుకుంటున్నారని స్థానికులు చెబుతున్నారు. దీంతో గ్రామంలో మౌలిక సదుపాయాల అభివృద్ధి ఆశించిన స్థాయిలో జరగడం లేదని వాపోతున్నారు. ఒకే ఊరిలో నివసిస్తున్నప్పటికీ పంచాయతీ ఎన్నికల సమయంలో ఒక వీధి వారికి ఒకరోజు, మరో వీధి వారికి మరోరోజు పోలింగ్ జరుగుతోంది. ప్రజలు నిత్యం ఎదుర్కొంటున్న సమస్యలకు ఇది మరింత ఇబ్బందికరంగా మారుతోంది.
రెండు పంచాయతీలను కలపాలని విజ్ఞప్తి
రాజుపాలెం తరహాలోనే కె. రాజుపాలెం గ్రామస్థులు కూడా తమ గ్రామాన్ని ఒకే మండలం, ఒకే జిల్లా పరిధిలోకి తీసుకురావాలని కోరుతున్నారు. రెండు పంచాయతీలుగా కొనసాగడం వల్ల రెవెన్యూ సమస్యలు, అభివృద్ధి పనులు, ప్రభుత్వ పథకాల అమలులో ఇబ్బందులు ఎదురవుతున్నాయని చెబుతున్నారు. గ్రామమంతా ఒకటిగా ఉంటూ పండుగలు, దేవుళ్ల ఉత్సవాలను కలిసి జరుపుకుంటున్నప్పటికీ పంచాయతీ ఎన్నికలు వచ్చినప్పుడు మాత్రం విడివిడిగా రాజకీయాలు చేయాల్సి వస్తోందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
ఈ సమస్యలకు శాశ్వత పరిష్కారం లభించాలంటే రెండు పంచాయతీలను కలిపే విధంగా గ్రామాలను ఒకే జిల్లా, ఒకే మండలం పరిధిలోకి తీసుకురావాల్సిన అవసరం ఉందని స్థానికులు అభిప్రాయపడుతున్నారు. అలా చేస్తే రెవెన్యూ వ్యవహారాలు, ప్రభుత్వ పథకాలు, రోడ్లు, డ్రైనేజీ వంటి అభివృద్ధి పనులకు సంబంధించిన సమస్యలు పరిష్కారమవుతాయని ఆశిస్తున్నారు.
ఊరు ఒక్కటే.. ప్రజలంతా ఒక్కటే.. కానీ పరిపాలన మాత్రం రెండు జిల్లాలు, రెండు మండలాలు, రెండు పంచాయతీలుగా ఉండటంతో రాజుపాలెం గ్రామస్థులు ఎదుర్కొంటున్న ఈ ప్రత్యేక పరిస్థితికి ఎప్పుడు పరిష్కారం లభిస్తుందో చూడాలి.
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.