బీచ్‌లో కొట్లాట.. కట్ చేస్తే.. బయటపడ్డ ఎప్పుడో జరిగిన హత్య కేసు మిస్టరీ..!

మొగల్తూరులో ఎల్ఐసీ ఏజెంట్ బాబి హత్య కేసు మిస్టరీని పెరుపాలెం బీచ్‌లో జరిగిన ఓ కొట్లాట వెలుగులోకి తెచ్చింది. మొదట సహజ మరణంగా భావించినా, బంగారం, వెండి ఆభరణాల చోరీతో ఇది పక్కా ప్లాన్‌తో జరిగిన కిరాతక హత్య అని తేలింది. కొందరు నిందితులు బాబిని చంపి దోచుకెళ్లినట్లు పోలీసులు విచారణలో వెల్లడైంది. ఈ కేసు ఉమ్మడి జిల్లాలో తీవ్ర సంచలనం సృష్టిస్తోంది.

బీచ్‌లో కొట్లాట.. కట్ చేస్తే.. బయటపడ్డ ఎప్పుడో జరిగిన హత్య కేసు మిస్టరీ..!
Mogalthur Crime

Edited By:

Updated on: Oct 05, 2026 | 4:37 PM

ఏలూరు: పశ్చిమ గోదావరి జిల్లా మొగల్తూరు కు చెందిన ఎల్ఐసీ ఏజెంటు, వడ్డీ వ్యాపారి అయిన గ్రంధి బాబి (76) మృతి చెందాడు. అయితే ఇది కేవలం సాధారణ మరణం కాదని, అది పక్కా ప్లాన్‌తో జరిగిన కిరాతక హత్య అని పోలీసుల విచారణలో బట్టబయలైంది. తొలుత దీన్ని ఎవరూ ఊహించలేకపోయారు; మృతదేహం నుంచి వస్తున్న దుర్వాసనను చూసి సహజ మరణంగానే భ్రమపడ్డారు. కానీ పేరుపాలెం బీచ్‌లో జరిగిన ఓ కొట్లాట కేసు ఈ మిస్టరీ పొరలను ఒక్కొక్కటిగా విడదీసింది.

మొగల్తూరులోని ఓ అద్దె ఇంట్లో బాబి ఒంటరిగా నివసిస్తున్నారు. ఆయన భార్య గతంలోనే మృతి చెందగా, ఏకైక కుమారుడు పవన్ కుమార్ హైదరాబాద్‌లో స్థిరపడ్డారు. జూన్ 17న బాబి నివసిస్తున్న ఇంటి నుంచి విపరీతమైన దుర్వాసన రావడంతో స్థానికులు అనుమానం వచ్చి తలుపులు తెరిచి చూశారు. గదిలో బాబి విగతజీవిగా పడి ఉండటం, మృతదేహం కుళ్లిపోవడాన్ని గమనించి, హైదరాబాద్‌లోని కుమారుడు పవన్ కుమార్‌కు సమాచారం అందించారు. ఆయన హుటాహుటిన వచ్చి చూసేసరికి మృతదేహం నుంచి తీవ్రమైన దుర్వాసన వస్తుండటంతో, ఎటువంటి అనుమానాలకు తావు ఇవ్వకుండా వెంటనే అంత్యక్రియలు పూర్తి చేసి వెళ్లిపోయారు.

అయితే అసలు సినిమా ఆ తర్వాతే మొదలైంది. బాబి వద్ద తమ బంగారు, వెండి ఆభరణాలు కుదువ పెట్టిన బాధితులు వాటిని విడిపించుకునేందుకు క్యూ కట్టారు. కానీ, బాబి వద్ద ఉండాల్సిన కుదువ పుస్తకం (అకౌంట్స్ బుక్) గల్లంతైంది. బాధితులు లబోదిబోమంటూ పెద్దమనుషులు, పోలీసులను ఆశ్రయించడంతో పెద్ద రచ్చయింది. దీంతో అప్రమత్తమైన బాబి కుమారుడు పవన్ కుమార్.. పెద్దల సమక్షంలో బాధితులకు తగినంత నగదు చెల్లించి ఆ గొడవను తాత్కాలికంగా సర్దుమణిగించారు. అయినప్పటికీ, బాబి వద్ద ఉండాల్సిన భారీ ఎత్తున బంగారం, వెండి వస్తువులు, ఆ అప్పుల పుస్తకం ఎక్కడికి పోయాయనేదీ మాత్రం మిస్టరీ మాత్రం అలాగే మిగిలిపోయింది.

ఈ కేసుకు సంబంధించి ఊహించని మలుపు ఇటీవల చోటుచేసుకుంది. పేరుపాలెం బీచ్‌లో ఇటీవల జరిగిన ఒక కొట్లాట కేసుకు సంబంధించి పోలీసులు కోణంలో దర్యాప్తు చేస్తుండగా ఈ సంచలన నిజాలు వెలుగులోకి వచ్చాయి. మొగల్తూరులో కొంతకాలం పాటు వ్యాపారం నిర్వహించిన ఇద్దరు స్థానిక వ్యక్తులు, భీమవరానికి చెందిన మరికొంతమందితో కలిసి ఒక పక్కా వ్యూహం రచించినట్లు పోలీసులు తెలిపారు. అర్ధరాత్రి సమయంలో ఇంట్లో ఒంటరిగా ఉన్న బాబిని అతి కిరాతకంగా హతమార్చి, ఆయన వద్ద భద్రపరిచిన సుమారు 400 గ్రాముల బంగారం, 8 కిలోల వెండి ఆభరణాలను దోచుకెళ్లినట్లు నిందితులు విచారణలో అంగీకరించారు.

తన తండ్రిది ముమ్మాటికీ హత్యేనని, జూన్ 15న నలుగురు వ్యక్తులు పథకం ప్రకారమే ఆయనను చంపి 400 గ్రాముల బంగారం, 8 కిలోల వెండిని దోచుకెళ్లారంటూ పవన్ కుమార్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ ఫిర్యాదు ఆధారంగా మొగల్తూరు పోలీసులు హత్య కేసు నమోదు చేసి, నిందితుల కదలికలపై దర్యాప్తును వేగవంతం చేశారు. ఈ దారుణ హత్య ఉదంతం ఇప్పుడు ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా తీవ్ర సంచలనం సృష్టిస్తోంది.

మరిన్ని క్రైమ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Loading...
Unable to load recommendations.
Follow Us