Andhra News: అరటి తోటలో అలికిడి.. అడుగు ముందుకేసిన రైతుకు ఎదురైన భయానక దృశ్యం!

మార్కాపురం జిల్లా గిద్దలూరు మండలం పాములపల్లె గ్రామ సమీపంలోని అరటి పొలాలలో చిరుత పులి సంచారం కలకలం రేపింది. అరటి తోటలో చిరుత కదలికలను గుర్తించిన స్థానిక రైతులు వెంటనే అప్రమత్తమై అధికారులకు సమాచారం ఇచ్చారు. దీంతో అక్కడికి చేరుకున్న అధికారులు పాద ముద్రల ఆధారంగా పులి ఆచూకీ కోసం గాలిస్తున్నారు.

Andhra News: అరటి తోటలో అలికిడి.. అడుగు ముందుకేసిన రైతుకు ఎదురైన భయానక దృశ్యం!
Leopard Sighting Markapuram

Edited By:

Updated on: Aug 25, 2026 | 9:45 PM

మార్కాపురం జిల్లాల్లో చిరుత సంచారం స్థానిక రైతులకు కంటి మీద కునుకులేకుండా చేస్తోంది. ఉదయాన్నే పొలానికి వెళ్లిన రైతులకు అరటితోటలో చిరుత పులి కదలికలు కంటపడ్డాయి. దీంతో ఒక్కసారిగా భయాందోళనకు గురైన స్థానిక రైతులు వెంటనే ఈ విషయాన్ని అడవిశాఖ అధికారుల దృష్టికి తీసుకెళ్లారు. పులి సంచార సమాచారంతో అప్రమత్తమైన అధికారులు హుటాహుటీన ఘటనా స్థలానికి చేరుకొని పరిశీలించారు. ఘటనా స్థలంలో కనిపించిన పులి పాదముద్రల ఆధారంగా.. దాని కదలికలను గుర్తించేందుకు ట్రాప్ కెమెరాలు ఏర్పాటు చేసి నిఘా పెట్టారు.

గత నాలుగు రోజుల నుంచి చిరుత సంచారంపై అటవీ శాఖ అధికారులు దృష్టి సారించారు. డ్రోన్ కెమెరా సహాయంతో పాములపల్లె కొండ ప్రాంత పరిసరాలను క్షుణ్ణంగా పరిశీలిస్తున్నారు. అలాగే చిరుతను చూసినట్టు చెప్పిన రైతులను సైతం అధికారులు ప్రశ్నిస్తున్నారు. చిరుత ఆనవాళ్లను, అందుకు సంబంధించిన వివరాలను అడిగి తెలుసుకున్నారు. సబ్ డిఎఫ్‌వో బాలరాజు, దిగువమెట్ట డిప్యూటీ రేంజ్ ఆఫీసర్ వంశీక్రిష్ణకుమారి ఆధ్వర్యంలో 20 మంది పైగా సిబ్బంది పరిసర ప్రాంతాలను పరిశీలిస్తున్నారు. చిరుత సంచరించిన ప్రాంతాలలో కెమెరాలతో పాటు బోన్లను కూడా ఏర్పాటు చేసి చిరుతను పట్టుకునేందుకు ప్రయత్నిస్తామని అటవీశాఖ అధికారులు తెలిపారు.

ఇదిలా ఉండగా చిరుత సంచార ప్రచారంతో స్థానికంగా పశువులను మేపుకుంటున్న రైతులు భయంతో వణికిపోతున్నారు. పశువులను, మేకలను మేతకు తీసుకొచ్చేందుకు జంకుతున్నారు. ఈ పులి సంచారం స్థానిక గ్రామాల రైతులకు కూడా కంటిమీద కునుకు లేకుండా చేస్తుంది. పులి ఎప్పుడు వచ్చి ఎవరిపై దాడి చేస్తుందనే భయంతో బిక్కు బిక్కు మంటూ గుడుపుతున్నారు స్థానికులు. అయితే ఈ ప్రాంతం నల్లమల్ల అటవీకి అతి సమీపంలో ఉండడం వల్లే చిరుత పులి అటు నుంచి వచ్చి ఉండవచ్చని అధికారులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు.

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Loading...
Unable to load recommendations.
Follow Us