Vijayawada: డాక్టరమ్మా వందనం.! రోడ్డుపైనే సీపీఆర్‌ చేసి.. బాలుడికి ఆయువు పోసిన లేడీ డాక్టర్..

|

May 17, 2024 | 1:08 PM

డాక్టర్‌ అంటే కనిపించే దైవం. దేవుడు ప్రాణం పోస్తే ఆ ప్రాణాలను నిలబెట్టే శక్తి ఒక్క డాక్టర్‌కి మాత్రమే ఉంది. అందుకే పేద, గొప్ప తేడా లేకుండా వైద్యుడికి అందరూ చేతులెత్తి మొక్కుతారు. ఓ డాక్టర్‌కి సమయం, స్థలంతో పనిలేదు. ఎప్పుడు ఎక్కడ ఎవరి ప్రాణాలు ఆపదలో ఉన్నా వెంటనే స్పందించి..

Vijayawada: డాక్టరమ్మా వందనం.! రోడ్డుపైనే సీపీఆర్‌ చేసి.. బాలుడికి ఆయువు పోసిన లేడీ డాక్టర్..
Viral Photo
Follow us on

డాక్టర్‌ అంటే కనిపించే దైవం. దేవుడు ప్రాణం పోస్తే ఆ ప్రాణాలను నిలబెట్టే శక్తి ఒక్క డాక్టర్‌కి మాత్రమే ఉంది. అందుకే పేద, గొప్ప తేడా లేకుండా వైద్యుడికి అందరూ చేతులెత్తి మొక్కుతారు. ఓ డాక్టర్‌కి సమయం, స్థలంతో పనిలేదు. ఎప్పుడు ఎక్కడ ఎవరి ప్రాణాలు ఆపదలో ఉన్నా వెంటనే స్పందించి ఆ ప్రాణాలు నిలబెట్టేందుకు ప్రయత్నిస్తారు. సరిగ్గా అదే చేశారు ఓ మహిళా డాక్టర్‌. అప్పటి వరకూ చలాకీగా తోటి పిల్లలతో ఆడుకున్న చిన్నారి ఒక్కసారిగా కుప్పకూలిపోయాడు. ఆ చిన్నారికి రోడ్డుమేతా సీపీఆర్‌ చేసి ప్రాణం కాపాడారు డాక్టర్‌ రవళి. రవళి స్పందించిన తీరుపై నెటిజన్లు ప్రశంసలు కురిపిస్తున్నారు.

విజయవాడ అయ్యప్పనగర్‌కు చెందిన సాయి అనే ఆరేళ్ల బాలుడు సాయి మే 5వ తేదీ సాయంత్రం ప్రమాదవశాత్తు విద్యుదాఘాతానికి గురయ్యాడు. అపస్మారక స్థితిలోకి వెళ్లిపోవడంతో.. తల్లిదండ్రులు ఏడుస్తూ పిల్లాడిని భుజాన వేసుకొని ఆస్పత్రికి పరుగులు పెడుతున్నారు. అదే సమయంలో మెడ్‌సీ ఆసుపత్రిలో ప్రసూతి వైద్య నిపుణురాలైన నన్నపనేని రవళి అటుగా వస్తూ.. వారిని చూశారు. ఏమైందని ఆమె అడగటంతో తల్లిదండ్రులు విషయం చెప్పారు. వైద్యురాలు బాలుడిని పరీక్షించి.. అక్కడే రోడ్డుపైనే పడుకోబెట్టమని చెప్పారు. అనంతరం సీపీఆర్‌ చేయడం ప్రారంభించారు. ఒకవైపు డాక్టర్‌ రవళి బాలుడి ఛాతీపై చేతితో ఒత్తుతూ.. అక్కడున్న మరో వ్యక్తిని నోటితో గాలి ఊదమని సూచించారు. ఇలా.. ఏడు నిమిషాలకు పైగా చేశాక.. బాలుడిలో కదలిక వచ్చింది. వెంటనే బాలుడిని దగ్గరలో ఉన్న ఓ ప్రైవేటు ఆసుపత్రికి ద్విచక్రవాహనంపై తీసుకెళ్లారు. ఆసుపత్రికి వెళ్లే మార్గంలోనూ బాలుడికి శ్వాస సరిగ్గా అందేలా.. తలను కొద్దిగా కిందకి ఉంచి పడుకోబెట్టి తీసుకెళ్లమని సూచించారు. ఆసుపత్రికి వెళ్లిన తర్వాత.. చికిత్స చేయడంతో బాలుడు పూర్తిగా కోలుకున్నాడు. 24 గంటలు అబ్జర్వేషన్‌లో ఉంచి తలకు సీటీ స్కాన్‌ చేస్తే.. ఎలాంటి సమస్య లేదని గుర్తించి, డిశ్చార్జి చేసి ఇంటికి పంపించేశారు. ప్రస్తుతం బాలుడు పూర్తి ఆరోగ్యంగా ఉన్నాడు. డాక్టర్‌ రవళి రోడ్డుపైనే బాలుడిని పడుకోబెట్టి సీపీఆర్‌ చేసే సమయంలో తీసిన వీడియో ప్రస్తుతం సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది.