Janasena: ఎమ్మెల్యే అభ్యర్థుల ఎంపికలో అతితూచి అడుగులు వేస్తున్న పవన్ కల్యాణ్

|

Feb 26, 2024 | 3:37 PM

జనసేన - తెలుదేశం పార్టీ ఉమ్మడి అభ్యర్థులను ప్రకటించినప్పటి నుంచి రాష్ట్రవ్యాప్తంగా జనసేనలో అసంతృప్తి సెగలు భగ్గుమంటున్నాయి. ఏపీలోని 175 స్థానాల్లో జనసేనకు 24 స్థానాలు కేటాయించగా.. ఐదు చోట్ల అభ్యర్థుల్ని ప్రకటించారు. కేవలం 24 స్థానాలే తీసుకోవడంపై తీవ్ర అసంతృప్తిలో ఉన్న జనసేన కేడర్.. సీట్ల కేటాయింపులో తీవ్ర అన్యాయం జరుగుతోందని రాష్ట్రవ్యాప్తంగా ఆందోళనలు చేస్తోంది. జిల్లాల వారీగా పరిస్థితి ఏంటో.. ఒకసారి చూద్దాం..!

Janasena: ఎమ్మెల్యే అభ్యర్థుల ఎంపికలో అతితూచి అడుగులు వేస్తున్న పవన్ కల్యాణ్
Pawan Kalyan
Follow us on

జనసేన – తెలుదేశం పార్టీ ఉమ్మడి అభ్యర్థులను ప్రకటించినప్పటి నుంచి రాష్ట్రవ్యాప్తంగా జనసేనలో అసంతృప్తి సెగలు భగ్గుమంటున్నాయి. ఏపీలోని 175 స్థానాల్లో జనసేనకు 24 స్థానాలు కేటాయించగా.. ఐదు చోట్ల అభ్యర్థుల్ని ప్రకటించారు. కేవలం 24 స్థానాలే తీసుకోవడంపై తీవ్ర అసంతృప్తిలో ఉన్న జనసేన కేడర్.. సీట్ల కేటాయింపులో తీవ్ర అన్యాయం జరుగుతోందని రాష్ట్రవ్యాప్తంగా ఆందోళనలు చేస్తోంది. జిల్లాల వారీగా పరిస్థితి ఏంటో.. ఒకసారి చూద్దాం..!!

ఉమ్మడి కృష్ణా జిల్లాలో మొత్తం మూడు స్థానాల్లో జనసేన సీట్లు ఆశించగా ఇప్పటికే పెడనలో టీడీపీ నుండి ఉమ్మడి అభ్యర్థిని ప్రకటించారు. దాంతో పెడన జనసేన నేతలు కార్యకర్తలు రోడ్డెక్కి రచ్చ చేశారు. టికెట్ జనసేన నేత బండి రామకృష్ణకి ఇవ్వాలంటూ లేదంటే రెండ్రోజుల్లో కార్యాచరణ ప్రకటిస్తామన్నారు. మిగిలిన రెండు చోట్ల ఇంకా అభ్యర్థులను ప్రకటించలేదు. ఇందులో విజయవాడ వెస్ట్ కీలకంగా మారింది. ఇక్కడ జనసేన నుంచి పోతిన మహేష్ సీట్ అశిస్తుండగా, టీడీపీ నుండి బుద్దా వెంకన్న రేసు ఉన్నారు. ఇక అవినిగడ్డలో కూడా ఇంకా అభ్యర్థిని ప్రకటించలేదు. ఇక్కడ టిక్కెట్‌ రేసులో మాదివాడ క్రిస్టియన్, విక్కుర్తి శ్రీనివాస్‌ల పేర్లు వినిపిస్తున్నాయి. ఇప్పటికే నియోజకవర్గంలో మాదివాడ క్రిస్టియన్ ప్రచారం కూడా మొదలు పెట్టారు.

ఉమ్మడి గుంటూరు జిల్లాలో మొత్తం 17 నియోజకవర్గాలుండగా.. అందులో 12 చోట్ల అభ్యర్థుల్ని ప్రకటించారు.11 టీడీపీ, ఒకటి జనసేనకు కేటాయించారు. తెనాలి నుంచి నాదెండ్ల మనోహర్ ఉమ్మడి అభ్యర్థిగా బరిలో ఉండగా.. గుంటూరు వెస్ట్, నరసరావుపేట టికెట్లు కూడా జనసేన ఆశిస్తోంది. గుంటూరు వెస్ట్‌లో జనసేన నుంచి శ్రీనివాస్ యాదవ్, నరసరావుపేట నుంచి జిలాని టికెట్ ఆశిస్తున్నారు. ఈ రెండు చోట్ల కూడా టీడీపీ నుంచి గట్టి పోటీ ఉంది.

జనసేన ఫోకస్ మొత్తం మొదటి నుంచి ఉభయ గోదావరి జిల్లాలోనే ఉంది. కాపు ఈక్వేషన్స్, పీఆర్పీ ఓటు బ్యాంక్.. తమకు ప్లస్ అవుతుందని భావిస్తోంది జనసేన. అయితే.. ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో మొత్తం తొమ్మిది చోట్ల జనసేన టికెట్లు ఆశిస్తోంది. ఇప్పటికే 4 చోట్ల అభ్యర్థులను ప్రకటించారు. మూడు సీట్లలో టీడీపీ, జనసేనకు ఒకటి కేటాయించారు. తుని, పెద్దాపురం, జగ్గంపేటలో టీడీపీ సీనియర్ నేతలకే అవకాశం దక్కగా కాకినాడ రూరల్ మాత్రం జనసేనకు దక్కింది. పెద్దాపురం టికెట్ జనసేనకు వస్తుందనుకుంటే.. టీడీపీ సిట్టింగ్ ఎమ్మెల్యే నిమ్మకాయల చిన రాజప్పకు టికెట్ ఇచ్చారు. జగ్గంపేటలో జ్యోతుల నెహ్రుకు టికెట్ దక్కింది. పెద్దాపురం, జగ్గంపేట, తుని.. మూడు చోట్ల జనసేన నేతలు తీవ్ర అసంతృప్తితో ఉన్నారు. ఇక మిగిలింది పిఠాపురం, ప్రత్తిపాడు, కాకినాడ అర్బన్. ఈ మూడు స్థానాల్లో జనసేనకు ఓటు బ్యాంక్ భారీగా ఉంది. 2009లో పిఠాపురంలో పిఆర్పి జెండా ఎగరవేసింది. ఇప్పుడిక్కడ ఉదయ్ శ్రీనివాస్ జనసేన నుంచి సీటు ఆశిస్తున్నారు. పెద్దాపురం ఎలాగో కోల్పోయాం, కనీసం ప్రతిపాడు అయినా ఇవ్వాలని జనసేన అడుగుతోంది. ఇక్కడ జనసేనకు 25 శాతం ఓటు బ్యాంక్ ఉంది.

ఇక కాకినాడ అర్బన్‌తో పాటు.. కాకినాడ పార్లమెంట్ సీటు కూడా జనసేన ఆశిస్తోంది. రాజమండ్రి రూరల్ టికెట్ టీడీపీ బుచ్చయ్య చౌదరి, జనసేన కందుల దుర్గేష్‌ మధ్య వార్ నడుస్తుంది. కందుల దుర్గేష్‌కే టికెట్ ఇవ్వాలని జనసైనికులు పట్టుబడుతున్నా.. టీడీపీ నుంచి గట్టి పోటీ ఉండటంతో.. దుర్గేష్‌ను మరో చోటుకు వెళ్లాలంటూ సంకేతాలు రావటంతో జనసేన నేతలు రోడ్డెక్కారు. రాజోలు, కొత్తపేట, అమలాపురంలో కూడా జనసేన సీట్లు ఆశిస్తోంది. ఇక్కడ టీడీపీ కూడా బలంగా ఉండడంతో జనసేన నేతల్లో గుబులు మొదలైంది.

ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లాలో సైతం జనసేన ఆరు చోట్ల సీట్లు ఆశిస్తోంది. ఇప్పటికే ఏలూరు, పాలకొల్లు, ఆచంట, ఉండి నియోజకవర్గాల్లో టీడీపి అభ్యర్ధులను ఎనౌన్స్ చెయ్యటంతో.. అక్కడి జనసేన నేతలు ఆందోళనకు సిద్దం అవుతున్నారు. మిగతా నరసాపురం, భీమవరం, పోలవరం, తాడేపల్లిగూడెం, నిడదవోలులో అయినా సీట్ దక్కుతుందా అని లెక్కలు వేస్తున్నారు జనసేన నేతలు. ఈ మొత్తం ఎపిసోడ్లో పవన్ కళ్యాణ్ ఎక్కడ నుండి పోటీ చేస్తారనేది మరింత హాట్ టాపిక్‌గా మారింది. పార్టీ బలంగా ఉన్న ఉభయ గోదావరి జిల్లాలో ఎక్కడ సీట్లు దక్కుతాయి. ఎక్కడ దక్కవో అర్థంకాని పరిస్థితి నేతల్లో ఉంది.

ఉమ్మడి విశాఖ జిల్లాకు వెళ్తే… అనకాపల్లిలో జనసేన నుంచి కొణతాల రామకృష్ణకు టికెట్ దక్కగా.. పెందుర్తి, భీమిలి, యలమంచిలి, విశాఖ సౌత్ సీట్లు జనసేన ఆశిస్తోంది. విజయనగరంలో పాతపట్నం, ఎచ్చెర్ల, పలాస, పాలకొండ సీట్లు జనసేన ఆశిస్తుండగా.. పాలకొండ కానీ పలాస కానీ దక్కే అవకాశాలున్నాయి. 2009 ఎన్నికల్లో పాలకొండలో పీఆర్పీకి 20వేల ఓట్లు వచ్చాయి. ఇక్కడ టీడీపీ గ్రూప్ రాజకీయాలు కూడా ఉండటంతో జనసేనకు సీటు ఇస్తారనే టాక్ నడుస్తోంది. ఇక పలాసలో ధనేటి శ్రీధర్ వైసీపీ నుంచి జనసేనలో చేరి టికెట్ ఆశిస్తున్నాడు.

జనసేన ఎక్కువగా ఫోకస్ పెట్టిన ప్రాంతాల్లో రాయలసీమ కూడా ఒకటి. తిరుపతిలో పోటీ చేయడాన్ని టీడీపీ, జనసేన, బీజేపీ ముగ్గురు కూడా సెంటిమెంట్‌గా భావిస్తున్నారు. జనసేన నుంచి కిరణ్ రాయల్, హరిప్రసాద్ టికెట్ అడుగుతున్నారు. పార్టీ అధినేత పవన్ కల్యాణ్ కూడా తిరుపతి నుంచి పోటీ చేయాలనే డిమాండ్ వినిపిస్తుంది. గతంలో తిరుపతి సీటు పిఆర్పి గెలిచినా.. టీడీపీ కూడా బలంగా ఉండడంతో ఇక్కడ సీటు జనసేనకు దక్కుతుందా పొత్తు ఈక్వేషన్స్‌లో తప్పకోవాల్సి వస్తుందా అనే భయం జనసేన నేతల్లో కనిపిస్తుంది. పవన్ ఫోకస్ పెట్టిన మదనపల్లి హాట్ చైర్‌గా మారింది. జనసేన నుంచి రాందాస్ చౌదరి ఇక్కడ సీట్ ఆశిస్తుండగా… బీజేపీ కూడా ఇక్కడ సీటు అడిగే అవకాశం ఉంది. 2014 ఉమ్మడి అభ్యర్ధిగా బిజెపి ఇక్కడ పోటీ చేసింది. కడపలో రైల్వేకోడూరు, రాజంపేట, బద్వేల్‌లో జనసేన సీట్లు అడుగుతుంది. అనంతపురం జిల్లాలో అర్బన్, గుంతకల్ జనసేన అడుగుతోంది.

రాష్ట్రవ్యాప్తంగా పెండింగ్‌లో ఉన్న 19 సీట్ల ప్రకటన విషయంలో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఆచితూచి అడుగులు వేస్తున్నారు. ఒకవైపు తక్కువ సీట్లు కేటాయించారని రాష్ట్రమంతా అసంతృప్తి జ్వాలలు ఎగిసి పడుతున్నా.. జనసేనకు దక్కిన 24 సీట్లలో గెలుపే లక్ష్యంగా ప్రణాళికలు రచిస్తున్నారు.

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి…