కొన ఊపిరితో కొట్టుమిట్టాడుతున్న సముద్ర చిలుక.. శస్త్రచికిత్స చేసిన ప్రాణం పోసిన అటవీశాఖ అధికారులు

సాధారణంగా పక్షులు ఆహారం కోసం ఒక రాష్ట్రం నుంచి మరో రాష్ట్రానికి వలస వస్తుంటాయి. తాజాగా ఇలానే ఏపీకి వచ్చిన ఓ సముద్ర చిలుక గాయపడి నిస్సహాయ స్థితిలో పడిపోయింది. ప్రాణాపాయ స్థితిలో ఉన్న చిలుకను గమనించిన స్థానికులు అటవీశాఖ అధికారులకు సమాచారం ఇవ్వడంతో.. చిలుకకు శస్త్ర చికిత్స చేసి ప్రాణాలు పోశారు అధికారులు.

కొన ఊపిరితో కొట్టుమిట్టాడుతున్న సముద్ర చిలుక.. శస్త్రచికిత్స చేసిన ప్రాణం పోసిన అటవీశాఖ అధికారులు
Injured Flamingo Rescued In Ap

Edited By:

Updated on: Oct 12, 2026 | 10:39 AM

ఇతర రాష్ట్రాల నుంచి ఆహారం కోసం వచ్చి తీవ్రంగా గాయపడిన ఓ అరుదైన ఫ్లెమింగో పక్షికి ఏపీ అటవీశాఖ అధికారులు, వైద్యులు శస్త్రచికిత్స చేసి ప్రాణాలు పోశారు. పశ్చిమగోదావరి జిల్లా ఆకివీడు మండలం చినకాపవరం సమీపంలోని రామయ్యగూడెం రోడ్డులో ఈ అందమైన పక్షి గాయపడి లేవలేని స్థితిలో పడి ఉండటాన్ని స్థానికులు గుర్తించారు. ఎక్కడి నుంచి వచ్చిందో తెలియదు కానీ తీవ్ర గాయాలతో ఉన్న ఆ పక్షిని చూసి చలించిపోయిన స్థానికులు వెంటనే అటవీశాఖ అధికారులకు సమాచారం అందించారు.

సమాచారం అందుకున్న వెంటనే ఇన్‌ఛార్జ్ సెక్షన్ ఆఫీసర్ రత్నరాజు తన బృందంతో సంఘటనా స్థలానికి చేరుకుని పక్షిని స్వాధీనం చేసుకున్నారు. పక్షి రెక్కలు, ఛాతీ భాగాలు తీవ్రంగా గాయపడి ఉండటాన్ని గమనించి, ఆలస్యం చేయకుండా స్థానిక పశువైద్యశాలకు తరలించారు. అక్కడ డాక్టర్ ప్రసాద్ పక్షి రెక్కలు, ఛాతీ భాగాలకు శస్త్రచికిత్స నిర్వహించి కుట్లు వేశారు.

అయితే ఒరిస్సా రాష్ట్రం నుంచి ఆహారం కోసం మన ప్రాంతానికి వచ్చి వెళ్లే క్రమంలో ఈ పక్షికి గాయాలు అయి ఉండవచ్చని, సాధారణంగా ఇటువంటి ఫ్లెమింగో పక్షులు మన ప్రాంతానికి అరుదుగా వస్తుంటాయని అటవీశాఖ అధికారులు తెలిపారు. విజయవంతంగా చికిత్స పూర్తయిన తర్వాత ఆ పక్షిని ఆటపాక పక్షుల సంరక్షణ కేంద్రానికి తరలించారు. ప్రాణాపాయం నుంచి సముద్రపు చిలుక బయటపడటంతో స్థానికులు హర్షం వ్యక్తం చేస్తూ అటవీశాఖ అధికారులను, వైద్యులను అభినందించారు

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Loading...
Unable to load recommendations.
Follow Us