Andhra Pradesh: భార్యను ఎలాగైనా సర్పంచ్ చేయాలనుకున్నాడు.. కట్‌చేస్తే ఊహించని నిర్ణయం..

భార్యను గ్రామ ప్రథమ పౌరురాలిగా చూడాలని కన్న కల ఆ భర్తకు తీరని కలగానే మిగిలిపోయింది. ఎన్నికల రాజకీయం ఆ కుటుంబంలో ఒక ప్రాణాన్ని బలి తీసుకుంది. స్థానిక నాయకుల సహకారం అందక, భార్యను సర్పంచ్ చేయలేకపోయానన్న తీవ్ర మనస్థాపంతో ఓ భర్త బలవన్మరణానికి పాల్పడిన విషాద ఘటన చిత్తూరు జిల్లాలో తీవ్ర కలకలం రేపింది. ఆ వివరాలు ఈ స్టోరీలో తెలుసుకుందాం..

Andhra Pradesh: భార్యను ఎలాగైనా సర్పంచ్ చేయాలనుకున్నాడు.. కట్‌చేస్తే ఊహించని నిర్ణయం..
Man Dies Over Sarpanch Election

Edited By:

Updated on: Nov 18, 2026 | 8:38 PM

గ్రామ రాజకీయాల్లో గెలుపోటములు సాధారణమే కానీ ఒక ప్రాణం గాల్లో కలిసిపోవడం అందరినీ కలచివేసింది. భార్యను ఎలాగైనా సర్పంచ్ స్థానంలో కూర్చోబెట్టాలని కలలు కన్న ఆ భర్త ఆశలు అర్ధాంతరంగా ఆవిరైపోయాయి. రాజకీయ ఒత్తిళ్లు, స్థానిక నాయకుల నుంచి సరైన సహకారం అందకపోవడంతో మనస్థాపం చెంది పురుగుల మందు తాగి బలవన్మరణానికి పాల్పడిన విషాద ఘటన చిత్తూరు జిల్లాలో చోటుచేసుకుంది. చిత్తూరు జిల్లా పూతలపట్టు మండలంలోని అనగాలపల్లి గ్రామపంచాయతీ సర్పంచ్ స్థానం జనరల్ మహిళకు రిజర్వ్ అయింది. దీంతో తన భార్య గిరిజను ఎలాగైనా సర్పంచ్ స్థానంలో చూడాలని ఆమె భర్త గిరిబాబు తీవ్రంగా ఆశపడ్డాడు. భార్యను బరిలో దింపి గ్రామ ప్రథమ పౌరురాలిగా గెలిపించుకోవాలని ఆయన గట్టి సంకల్పంతో ఉన్నాడు. అయితే ఆ గ్రామ సర్పంచ్ పదవికి మొత్తం 11 మంది అభ్యర్థులు పోటీకి నామినేషన్లు వేశారు. భార్య గిరిజను ఏకగ్రీవంగా ఎన్నుకునేలా చేయాలని గిరిబాబు ప్రయత్నాలు మొదలుపెట్టాడు. ఇందులో భాగంగా రంగంలోకి దిగిన ఆయన.. పోటీలో ఉన్న మిగతా 11 మందిలో ఏకంగా 8 మంది అభ్యర్థులను పోటీ నుంచి తప్పుకునేలా చేయడంలో సఫలమయ్యాడు.

మిగిలిన ముగ్గురు అభ్యర్థులు.. నాయకుల మద్దతు కరవు

ఎలాగైనా భార్యను ఏకగ్రీవ చేయాలన్న పట్టుదలతో ఉన్న గిరిబాబుకు ఆఖరి నిమిషంలో నిరాశ ఎదురైంది. పోటీలో ఇంకా ముగ్గురు అభ్యర్థులు బరిలో మిగిలిపోయారు. వారిని కూడా ఒప్పించి నామినేషన్ ఉపసంహరింపజేస్తే తన భార్య ఏకగ్రీవంగా ఎన్నికవుతుందని ఆయన భావించాడు. ఈ విషయంలో స్థానిక వైసీపీ నాయకుల సహాయం కోరగా.. కొందరు సానుకూలంగా స్పందించినప్పటికీ, మరికొందరు నాయకులు మాత్రం ఆ అభ్యర్థులను ఒప్పించేందుకు పెద్దగా ప్రయత్నించలేదని తెలుస్తోంది.

మనస్థాపంతో బలవన్మరణం

స్థానిక నాయకుల నుంచి ఆశించిన సహకారం అందకపోవడం, భార్యను సర్పంచ్ చేయాలన్న తన కల నెరవేరదేమోనన్న తీవ్ర మనస్థాపానికి గిరిబాబు గురయ్యాడు. రాజకీయ పరిణామాలు, ఒత్తిళ్లను తట్టుకోలేక తీవ్ర మనోవేదనకు గురైన ఆయన.. ఇంట్లోనే పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్నాడు. కుటుంబానికి అండగా ఉండాల్సిన వ్యక్తి ఒక్కసారిగా తనువు చాలించడంతో ఆ కుటుంబంలో తీవ్ర విషాదం అలుముకుంది. స్థానిక ఎన్నికల హడావుడిలో జరగకూడని అనర్థం జరగడంతో అనగాలపల్లి గ్రామంలో ఒక్కసారిగా విషాద ఛాయలు కమ్ముకున్నాయి. భర్త ఆశను నెరవేర్చాలనుకున్న భార్య, చిన్నారులు ఇప్పుడు దిక్కుతోచని స్థితిలో రోదించడం స్థానికులను కంటతడి పెట్టించింది. ఎన్నికల పోరులో గెలుపు ఓటములు సహజమే కానీ, ఇలా ప్రాణాలు తీసుకోవడం ఎంతమాత్రం సరికాదని ఈ ఘటన మరోసారి హెచ్చరిస్తోంది.

Loading...
Unable to load recommendations.
Follow Us