పీరియడ్స్ వచ్చాయంటే ఊరి బయటకు.. ఇప్పటికీ కొనసాగుతున్న వింత ఆచారం.. అసలు కారణం ఇదే!

Golla Hatti's Maila Gudiselu: గొల్ల హట్టి గ్రామాల్లో శతాబ్దాల నాటి వింత ఆచారం కొనసాగుతోంది. మహిళలు నెలసరి, ప్రసవ సమయాల్లో 'మైల గుడిసెలు' లేదా ఊరి బయట ఏకాంతంగా ఉండాలి. ఇది పాడి, పంటలకు చేటు తెస్తుందని వారి నమ్మకం. కనీస సౌకర్యాలు లేని ఈ గుడిసెల్లో భద్రత కొరవడుతుంది. గతంలో మహిళా కమ్యూనిటీ హాళ్లు నిర్మించినా, ఇప్పటికీ చాలా గ్రామాల్లో ఈ సంప్రదాయం పాటిస్తున్నారు.

పీరియడ్స్ వచ్చాయంటే ఊరి బయటకు.. ఇప్పటికీ కొనసాగుతున్న వింత ఆచారం.. అసలు కారణం ఇదే!
Golla Hatti's Maila Gudiselu

Edited By:

Updated on: Sep 12, 2026 | 12:52 PM

శ్రీ సత్య సాయి జిల్లా రొల్ల మండలంలోని గొల్లహట్టి గ్రామాల్లో ఆనవాయితీగా వస్తున్న వింత ఆచారం. మడకశిర నియోజకవర్గం పరిధిలో నివసించే పలు గొల్లహట్టి గ్రామాలలో గొల్ల (యాదవ) సామాజిక వర్గంలో శతాబ్దాలుగా వస్తున్న ఆచారాలు, కట్టుబాట్లు ఇప్పటికీ కొనసాగుతున్నాయి. ప్రత్యేకించి మహిళలకు నెలసరి(పీరియడ్స్), గర్భవతులు, పుష్పవతులు సమయంలో అనుసరించే నియమాలు నేటి ఆధునిక కాలంలోనూ కొనసాగుతున్నాయి. ​గొల్ల హట్టిలలో పీరియడ్స్ సమయంలో మహిళలు ఎదుర్కొంటున్న పరిస్థితులు, వారి కట్టుబాట్ల గురించి తెలుసుకుందాం. ​ఇక్కడ మహిళలకు నెలసరి రాగానే వారిని గ్రామానికి కాస్త దూరంలో ప్రత్యేకంగా నిర్మించిన “మైల గుడిసెలు” లేదా గ్రామ సరిహద్దుల వద్దకు పంపిస్తారు. ​సాధారణంగా 3 నుంచి 5 రోజుల పాటు వీరు ఇళ్లకు దూరంగా, ఊరి బయటే గడపాల్సి ఉంటుంది. నెలసరి (పీరియడ్స్) పూర్తిగా పూర్తయిన తర్వాతే స్నానం చేసి ఇళ్లలోకి ప్రవేశించడానికి అనుమతిస్తారు.

కేవలం పీరియడ్స్ సమయంలోనే కాకుండా, ప్రసవించిన (బాలింత) మహిళలను కూడా 21 రోజుల నుండి ఒక నెల రోజుల పాటు ఊరి బయటే ఉండేలా చూస్తారు. ​ఈ ఐదు రోజుల పొడవునా ఆ మహిళలు ఎవరినీ తాకకూడదు. వారు ఉపయోగించే పాత్రలు, దుస్తులు కూడా వేరుగా ఉంటాయి. ఇంట్లో వండిన ఆహారాన్ని కుటుంబ సభ్యులు తెచ్చి దూరంగా ఉంచుతారు. వీరు తాకిన పాత్రలను ఇతరులు ముట్టుకోరు. ఈ సమయంలో వారు గ్రామంలోని గుడులకు, నీటి వనరులకు (బావులు, చేతిపంపులు) దూరంగా ఉండాలి. గొల్ల కమ్యూనిటీ తమ కులదైవాలు, గ్రామ దేవతలు చాలా శక్తివంతమైనవని నమ్ముతారు. నెలసరి లేదా ప్రసవం మైల వల్ల గ్రామానికి, పాడి పశువులకు, పంటలకు చేటు జరుగుతుందని, దేవుళ్లకు ఆగ్రహం వస్తుందని వీరి బలమైన నమ్మకం. ​ఈ ఆచారాన్ని ఎవరైనా ఉల్లంఘిస్తే లేదా ఇళ్లలోకి వస్తే పెద్దలు జరిమానాలు విధించడం లేదా సామాజిక బహిష్కరణ చేస్తారనే భయం ప్రజల్లో ఉంది.

​ఊరి బయట ఉండే గుడిసెల వద్ద సరైన రక్షణ, విద్యుత్, మరుగుదొడ్ల వసతులు ఉండవు. వర్షాకాలం, చలికాలంలో ఇబ్బందులతో పాటు పాములు, తేళ్లు వంటి విష జంతువుల భయం ఎక్కువగా ఉంటుంది. పాఠశాలలు, కళాశాలలకు వెళ్లే బాలికలు కూడా ఈ సమయంలో చదువుకు దూరమవ్వడం లేదా ఇబ్బందులు పడాల్సి వస్తుంది. ఈ పరిస్థితిని మార్చేందుకు, మహిళల ఆరోగ్యం, భద్రత, గౌరవాన్ని కాపాడేందుకు గత టిడిపి ప్రభుత్వ హయాంలో గొల్ల హట్టిల సంస్కృతికి ప్రత్యామ్నాయంగా గ్రామాల్లోనే అన్ని సదుపాయాలతో కూడిన మహిళా కమ్యూనిటీ హాళ్లు ఏర్పాటు చేశారు. ఈ కేంద్రాల్లో నీటి సదుపాయం, మరుగుదొడ్లు, విద్యుత్ వంటి కనీస వసతులు కల్పించడంతో మహిళల ఆరోగ్యం దెబ్బతినకుండా చూశారు. మూఢనమ్మకాల నుంచి గ్రామీణ మహిళలను బయటకు తీసుకురావడానికి, బహిష్టు సమయంలో పరిశుభ్రతపై అవగాహన పెంచడానికి ఇది ఒక ముఖ్యమైన అడుగుగా ఉపయోగపడింది. ​సామాజిక మార్పు ఒక్కసారిగా రాకపోయినా, ప్రాణాపాయం ఉన్న గుడిసెల కంటే ఇటువంటి పక్కా భవనాలు, కమ్యూనిటీ హాళ్లు మహిళలకు ఎంతో ఊరటనిచ్చాయి. మూఢనమ్మకాల నుంచి బయటపడాలని, మహిళల ఆరోగ్యానికి, రక్షణకు ప్రాధాన్యం ఇవ్వాలని (NGO )లు గతంలో చైతన్య పరచడానికి ప్రయత్నాలు జరిపారు. దీనివల్ల కొంత మందిలో స్వల్ప మార్పులు వస్తున్నప్పటికీ, సంప్రదాయం పేరుతో ఈ ఆచారం ఇప్పటికీ చాలా గొల్ల హట్టిల గ్రామాలలో కొనసాగుతూనే ఉంది.

వీడియో చూడండి..

 

Loading...
Unable to load recommendations.
Follow Us