
మహిళల్లో క్యాన్సర్‌ను ముందస్తు దశలోనే గుర్తించి, సకాలంలో చికిత్స అందిస్తే మెరుగైన ఫలితాలు సాధించవచ్చు. ఈ లక్ష్యంతో ఆంధ్రప్రదేశ్‌లోని గుంటూరు ప్రభుత్వ ఆసుపత్రి (జీజీహెచ్)లో ప్రత్యేక క్యాన్సర్ స్క్రీనింగ్ కేంద్రాన్ని ఏర్పాటు చేశారు. పింక్ ఆర్గనైజేషన్, ఏపీఎన్జీవోల సంయుక్త ఆధ్వర్యంలో జీజీహెచ్‌లోని నాట్కో సెంటర్‌లో ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. ప్రభుత్వ ఉద్యోగులుగా పనిచేస్తున్న మహిళలకు రొమ్ము క్యాన్సర్, గర్భాశయ ముఖద్వార క్యాన్సర్ (సర్వైకల్ క్యాన్సర్) పరీక్షలను ఉచితంగా చేస్తున్నారు.
రొమ్ము క్యాన్సర్‌కు సంబంధించి పరీక్షలు, చికిత్సా విధానాలు అందుబాటులో ఉన్నప్పటికీ.. సర్వైకల్ క్యాన్సర్‌ను ముందుగానే గుర్తించి చికిత్స అందించడంపై ప్రత్యేక దృష్టి సారించారు. ఇందులో భాగంగా అమెరికాలో అందుబాటులో ఉన్న థర్మల్ కోగ్యులేటర్ పరికరాన్ని పింక్ ఆర్గనైజేషన్ సహకారంతో తీసుకొచ్చారు.
డాక్టర్ సమత కడియాల, డాక్టర్ కారోల్ హాబాక్‌తో కూడిన వైద్య బృందం మహిళలకు సర్వైకల్ క్యాన్సర్ స్క్రీనింగ్‌తో పాటు అవసరమైన చికిత్స అందిస్తోంది. ఒక్కరోజులోనే 80 మందికి పరీక్షలు నిర్వహించారు. థర్మల్ కోగ్యులేటర్ పరికరంతో గర్భాశయ ముఖద్వారంలో క్యాన్సర్‌కు దారితీసే అవకాశం ఉన్న కొన్ని రకాల అసాధారణ కణజాల మార్పులకు చికిత్స అందిస్తారు. ఈ పరికరంతో చికిత్స చేయడం సాధ్యం కాని కేసులను తదుపరి వైద్య చికిత్స కోసం పంపిస్తారు. భారత్‌లో అతి చిన్న థర్మల్ కోగ్యులేటర్ పరికరంతో చికిత్స అందించడం ఇదే తొలిసారి అని డాక్టర్ సమత తెలిపారు.
మహిళల్లో క్యాన్సర్‌పై ఉన్న భయాలను తగ్గించడంతో పాటు, వ్యాధి పట్ల అవగాహన కల్పించేందుకు ఈ కార్యక్రమం చేపట్టారు. ఖరీదైన వైద్య పరీక్షలు, చికిత్సలను జీజీహెచ్‌లో ఉచితంగా అందిస్తున్నట్లు నిర్వాహకులు తెలిపారు. 30 నుంచి 65 ఏళ్ల వయసున్న మహిళలు ఈ స్క్రీనింగ్ పరీక్షలు చేయించుకోవచ్చని సూచించారు.
ఈ సందర్భంగా జీజీహెచ్ సూపరింటెండెంట్ డాక్టర్ దుర్గాప్రసాద్ మాట్లాడుతూ.. అత్యాధునిక వైద్య విధానాలను ప్రభుత్వ ఆసుపత్రిలోనే ఉచితంగా అందిస్తున్నట్లు తెలిపారు. క్యాన్సర్ గురించి భయపడాల్సిన అవసరం లేదని, వ్యాధిని సకాలంలో గుర్తించి చికిత్స తీసుకుంటే మెరుగైన ఫలితాలు సాధించవచ్చని పేర్కొన్నారు. ఈ ప్రత్యేక స్క్రీనింగ్ కేంద్రం మూడు రోజుల పాటు కొనసాగుతుందని వెల్లడించారు.