సీఎం చంద్రబాబు పీఏ పేరుతో ఘరానా మోసం.. బయటపడ్డ మాజీ రంజీ క్రికెటర్ భాగోతం

| Edited By: Balaraju Goud

Dec 26, 2024 | 7:31 AM

మాజీ రంజీ క్రికెటర్ బుడుమూరు నాగరాజు వాట్సాప్ డీ పీ గా ప్రముఖుల ఫోటోలను పెట్టుకుని, వాట్సాప్ మేసేజ్ లు పంపడం, ఫోన్లు చేయడం వంటి మార్గాలతో అమాయకులను మోసం చేస్తున్నాడు. సాంకేతికతను ఉపయోగించి మోసాలకు కొత్త పంథాలు అన్వేషిస్తున్నాడని పోలీసులు తెలిపారు. ఈ క్రమంలోనే ముఖ్యమంత్రి చంద్రబాబు పీఏ గా చెప్పుకుంటూ మరో కొత్త ఫ్లాన్ చేశాడు.

సీఎం చంద్రబాబు పీఏ పేరుతో ఘరానా మోసం.. బయటపడ్డ మాజీ రంజీ క్రికెటర్ భాగోతం
Budamuri Nagaraju
Follow us on

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు వ్యక్తిగత సహాయకుడు పెండ్యాల శ్రీనివాస్ పేరుతో ఒక మాజీ రంజీ క్రికెటర్ మోసాలకు పాల్పడిన ఘటన తాజాగా వెలుగులోకి వచ్చింది. ఈ మోసాలకు పాల్పడిన మాజీ రంజీ క్రికెటర్ బుడమూరి నాగరాజుపై పోలీసులు కేసు నమోదు చేశారు. శ్రీకాకుళం జిల్లాకు చెందిన నాగరాజుపై ఈ తరహా మోసాల కేసులు ఆంధ్ర, తెలంగాణ, ముంబైలలో అనేకం ఉన్నట్లు పోలీసులు తెలిపారు.

బుడమూరి నాగరాజు, సీఎం చంద్రబాబు పీఏ శ్రీనివాస్ పేరుతో వాట్సాప్ ద్వారా పలువురికి మేసేజ్‌లు పంపించాడు. ఆంధ్రప్రదేశ్‌కు చెందిన క్రికెటర్ రికీ భుయ్‌కు స్పాన్సర్ చేయాలని, క్రీడా కిట్లు కొనుగోలు చేసేందుకు డబ్బులు పంపాలని కోరాడు. ఈ మేసేజ్‌లపై అనుమానం వచ్చిన కొందరు శ్రీనివాస్‌ను సంప్రదించగా, విషయం బయటపడింది. దీంతో బాధితులు పోలీసులను ఆశ్రయించారు. పెండ్యాల శ్రీనివాస్ కు ఇదేవిధంగా గతంలోనూ ఫిర్యాదులు అందాయి. గతంలోనూ శ్రీనివాస్ పేరును ఉపయోగించి, ఇతరుల నుంచి డబ్బులు వసూలు చేయడానికి ప్రయత్నాలు జరిగినట్టు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో, శ్రీనివాస్ విజయవాడ సెంట్రల్ క్రైమ్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు.

సెంట్రల్ క్రైమ్ స్టేషన్ పోలీసులు ఈ విషయంపై కేసు నమోదు చేశారు. సైబర్ క్రైమ్ టీమ్ ఈ కేసు దర్యాప్తు చేపట్టింది. వాట్సాప్ మెసేజ్‌ల ను, ఫోన్ నంబర్లను ట్రాక్ చేస్తూ కేసు దర్యాప్తు చేస్తున్నారు. ఈ కేసు దర్యాప్తులో నాగరాజు గతం వెలుగులోకి వచ్చింది, ఇది మరింత సంచలనంగా మారింది.

2014 నుంచి 2016 వరకు శ్రీకాకుళం తరఫున రంజీ మ్యాచ్‌లు ఆడిన బుడుమూరు నాగరాజు, ఆ తర్వాత క్రికెట్ కెరీర్ ముగిసిన తర్వాత మోసాలకు పాల్పడడం ప్రారంభించాడు. గతంలో, మాజీ సీఎం జగన్ మోహన్ రెడ్డి, తెలంగాణ మంత్రి కేటీఆర్ పేర్లు చెప్పి పలు కార్పొరేట్ కంపెనీలను మోసం చేశాడు. కార్పొరేట్ సంస్థలపై ఫోన్లు చేసి ప్రముఖుల పేర్లతో డబ్బులు వసూలు చేయడానికి అతని మీద ముంబై, హైదరాబాద్ పోలీస్ స్టేషన్లలో కేసులు నమోదయ్యాయి.

గంజాయి కేసులో పట్టుబడిన నాగరాజు

2023 జులైలో శ్రీకాకుళం జిల్లాలో గంజాయి సరఫరా చేస్తూ పట్టుబడిన నాగరాజుపై కేసు నమోదైంది. అప్పటి నుంచి అతని నేర ప్రవర్తన గురించి పోలీసులు తీవ్రంగా పరిగణిస్తున్నారు. బుడుమూరు నాగరాజు వాట్సాప్ డీ పీ గా ప్రముఖుల ఫోటోలను ఉపయోగించి వాట్సాప్ మేసేజ్ లు పంపడం, ఫోన్లు చేయడం వంటి మార్గాలతో అమాయకులను మోసం చేస్తున్నాడు. సాంకేతికతను ఉపయోగించి అతడు మోసాలకు కొత్త పంథాలు అన్వేషిస్తున్నాడు. ఈ కేసుల గురించి స్పందించిన పోలీసు అధికారులు, “ప్రతీ అధికారిక సందేశం నిజమా? కాదా? అని ప్రజలు ముందుగా నిర్ధారించుకోవాలి. ముఖ్యంగా డబ్బుల విషయంలో అప్రమత్తంగా ఉండాలి” అని సూచించారు.

మరిన్ని క్రైమ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..