పోలవరం ప్రాజెక్ట్‌కు సంబంధించి సాంకేతిక సవాళ్లను పరిష్కరించేందుకు అంతర్జాతీయ నిపుణులను రంగంలోకి దిగుతోంది. ఇవాళ పోలవరం ప్రాజెక్టును విదేశీ నిపుణుల బృందం పరిశీలించనుంది. అమెరికా, కెనడాకు చెందిన నలుగురు నిపుణులు.. డ్యామ్ నిర్వహణ, భద్రత, సివిల్ ఇంజినీరింగ్, హైడ్రాలిక్ నిర్మాణాలు, కట్టడాలకు సంబంధించిన అంశాలను పరిశీలించి రిపోర్ట్ ఇస్తారు. వారం పాటు ఇక్కడే ఉండి ప్రాజెక్టు స్థితిగతులను అధ్యయనం చేస్తారు. అనంతరం పోలవరం ప్రాజెక్టు అథారిటీకి ఈ నిపుణులు బృందం నివేదిక ఇవ్వబోతుంది. ప్రాజెక్టు అధికారులతో కలసి ఎగువ కాఫర్ డ్యాం, రివర్ బెడ్‌లో జెట్ గ్రౌటింగ్, ఎగువ కాఫర్ డ్యాం సెక్షన్, డ్యాం నిర్మాణం ఫొటో ఎగ్జిబిషన్, ఐసీసీఎస్ ద్వారా నిర్ధారించిన కాఫర్ డ్యాం సామర్థ్యం, సీపేజీ విషయంలో 2023 సెప్టెంబరులో హెచ్‌పీటీ ప్రొఫెసర్ రాజు బృందం నివేదికలను పరిశీలిస్తారు. పోలవరం ప్రాజెక్టు పనుల పురోగతి విషయంలో ఇప్పుడు ఈ అంతర్జాతీయ నిపుణుల బృందం ఇచ్చే రిపోర్ట్ చాలా కీలకంగా మారింది.
ప్రస్తుతం పోలవరం నిర్మాణానికి సంబంధించి టెక్నికల్ ప్రాబ్లమ్స్ చాలానే ఉన్నాయి. ఇక అప్పర్ కాపర్ డ్యామ్‌లో సీపేజీ వస్తోంది. ఇది నిర్మాణ పనులకు అవాంతరంగా మారుతోంది. సీపేజీ వ్యవహారం పోలవరం భవితవ్యానికి సవాల్‌గా ఉండబోతోంది. మెయిన్ డ్యామ్‌లో భాగంగా నిర్మించిన డయాప్రమ్ వాల్ మూడేళ్ల క్రితం వచ్చిన భారీ వరదల్లో కొట్టుకుపోయింది. దీనికి మరమ్మత్తులు చేయాలా? మళ్లీ కొత్తగా నిర్మించాలా? అన్నది నిపుణులు తేల్చబోతున్నారు.
పోలవరం డ్యామ్ సైట్ ను పరిశీలించే అంతర్జాతీయ నిపుణుల్లో.. అమెరికా నుంచి జియాన్ ఫ్రాంకో డి సిక్కో, డేవిడ్ బి. పాల్ ఉండగా.. కెనడా నుంచి సీన్ హించ్‌బర్గర్, రిచర్డ్ డోన్నెల్లీ ఉన్నారు.
ఈ నలుగురూ సాగునీటి ప్రాజెక్టుల నిర్మాణానికి సంబంధించిన అంశాల్లో ఎక్స్‌పర్ట్స్. వీరంతా పోలవరం ప్రాజెక్ట్ చీఫ్ ఇంజినీర్‌తోను, ఇతర అధికారులతోనూ సమావేశం అవుతారు. అలాగే పోలవరం ప్రాజెక్ట్ అధారిటీ, సెంట్రల్ వాటర్ కమిషన్, జియోలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా, సెంట్రల్ సాయిల్ రీసెర్చ్ స్టేషన్‌తోపాటు మరికొన్ని కేంద్ర ప్రభుత్వ సంస్థల ఉన్నతాధికారులతోనూ చర్చిస్తారు. ఆ తర్వాత బాయర్, కెల్లర్ సంస్థల ప్రతినిధులు, మేఘా ఇంజినీరింగ్ టీమ్‌తోనూ మాట్లాడి గ్రౌండ్ రియాలిటీ తెలుసుకుంటారు.
ప్రాజెక్టు డిజైన్‌కి సంబంధించిన వివరాలు, ఇతర డాక్యుమెంట్లు అన్నీ ఈ ఎక్స్‌పర్ట్స్ టీమ్ పరిశీలిస్తుంది. జెట్ గ్రౌంటింగ్, సీపేజ్‌లపై రిపోర్ట్‌ను కూడా ప్రత్యేకంగా పరిశీలిస్తారు. అలాగే డయాఫ్రమ్ వాల్ లాంటివి నిర్మించిన చోట నీటి ఒత్తిడి లెక్కలకు సంబంధించిన ఫైజోమీటర్ రీడింగ్‌లు కూడా చెక్ చేస్తారు. 2022, 2023కి సంబంధించి అన్ని రిపోర్ట్స్ స్పష్టంగా చెక్ చేసుకున్నాక.. నిర్మాణం విషయంలో ఎలా ముందుకు వెళ్లాలనే దానిపై ఇంజినీర్లకు సూచనలు చేస్తారు.
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..