
ప్రభుత్వాలు ఎంత అవగాహన కల్పిస్తున్నా.. సైబర్ నేరగాళ్ల వలలో పడుతున్న బాధితుల సంఖ్య తగ్గడం లేదు. పోలీసులమని ఫోన్ చేసి బెదిరించడం.. కేసులు, అరెస్టుల పేరుతో భయపెట్టడం.. చివరకు బ్యాంకు ఖాతాలు ఖాళీ చేయడం.. ఇదే వారి మోసాల స్టైల్! తాజాగా తాడేపల్లిలో ఇలాంటి ఘటనే వెలుగులోకి వచ్చింది. ఏకంగా ఓ వృద్ధ దంపతులను డిజిటల్ అరెస్ట్ పేరుతో బెదిరించి.. వారి నుంచి రూ.2 కోట్లకు పైగా కాజేశారు.
తాడేపల్లి మండలం కుంచనపల్లిలోని ఓ అపార్ట్మెంట్లో బాలకృష్ణ, ఆయన భార్య నళినీదేవి నివసిస్తున్నారు. వీరిద్దరి పేర్లపై మ్యూచువల్ ఫండ్స్‌లో దాదాపు రూ.2 కోట్లకు పైగా పెట్టుబడులు ఉన్నాయి. గత నెల 20న బాలకృష్ణకు ఓ ఫోన్ కాల్ వచ్చింది. బెంగళూరులోని ఇందిరానగర్ పోలీస్ స్టేషన్ నుంచి ఎస్సై సందీప్ రావు మాట్లాడుతున్నానంటూ ఓ వ్యక్తి పరిచయం చేసుకున్నాడు. మీ భార్య నళినీదేవి అమ్మాయిలకు సంబంధించిన అసభ్యకర ఫొటోలు తీసి ఇతరులకు పంపుతున్నారని ఆరోపించాడు. ఈ వ్యవహారంలో ఇప్పటికే 17 కేసులు నమోదయ్యాయని చెప్పి దంపతులను భయపెట్టాడు. విచారణ కోసం వెంటనే బెంగళూరుకు రావాలని ఆదేశించాడు.
వయసు పైబడటంతో బెంగళూరుకు రాలేమని దంపతులు చెప్పగా.. మరో అధికారితో మాట్లాడాలంటూ ఫోన్‌ను సీఐ రాహుల్ చౌదరికి కలిపాడు. విచారణకు హాజరుకావాల్సిందేనని అతడు ఒత్తిడి చేశాడు. అంతేకాదు.. బాధితుల నుంచి రూ.3 కోట్లు వసూలు చేసిన బ్యాంకు ఖాతాల్లో నళినీదేవి పేరు కూడా ఉందని ఆరోపించాడు. తమకు ఆ వ్యవహారంతో ఎలాంటి సంబంధం లేదని దంపతులు చెప్పినా నిందితులు వినిపించుకోలేదు. సుప్రీంకోర్టు నుంచి అరెస్ట్ వారెంట్ తీసుకున్నామని, కేసును సీబీఐకి అప్పగిస్తామని బెదిరించారు. వాట్సాప్‌లో వారెంట్, సమన్లు పంపించామని నమ్మించారు.
ఆ తర్వాత అసలు ప్లాన్ అమలు చేశారు. మ్యూచువల్ ఫండ్ ఖాతాలను పరిశీలించాలంటూ వాటిని క్లోజ్ చేసి, అందులోని డబ్బును తాము చెప్పిన బ్యాంకు ఖాతాకు పంపించాలని ఆదేశించారు. విచారణ పూర్తయిన తర్వాత మొత్తం డబ్బును తిరిగి జమ చేస్తామని నమ్మబలికారు. దీంతో భయపడిపోయిన దంపతులు గత నెల 31న తమ మ్యూచువల్ ఫండ్ పెట్టుబడులను వెనక్కి తీసుకుని.. విజయవాడ గాంధీనగర్‌లోని యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ద్వారా సైబర్ నేరగాళ్లు సూచించిన ఖాతాకు నగదు బదిలీ చేశారు. ఇలా రూ.2 కోట్లకు పైగా వారి చేతుల్లో పెట్టారు.
కొన్ని రోజులైనా డబ్బులు తిరిగి రాకపోవడంతో దంపతులకు అనుమానం వచ్చింది. తాము మోసపోయామని గుర్తించి తాడేపల్లి పోలీసులను ఆశ్రయించారు. బాధితుల ఫిర్యాదుతో కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. గుర్తుంచుకోండి.. ఫోన్ లేదా వీడియో కాల్లో ఎవరైనా పోలీసులమని చెప్పి అరెస్ట్ చేస్తామని బెదిరించినా నమ్మకండి. ‘డిజిటల్ అరెస్ట్’ అనేది చట్టంలో లేదు. భయపడి డబ్బులు బదిలీ చేయకండి. వెంటనే కుటుంబ సభ్యులకు చెప్పి, 1930 సైబర్ క్రైమ్ హెల్ప్‌లైన్‌కు ఫిర్యాదు చేయండి.