బల్లి పడిన నీరు తాగిన 12 మంది కార్మికులు.. కాసేపటికే వింత ప్రవర్తన.. హాస్పిటల్‌కు తీసుకెళ్లగా

అదో ఐరన్ ఓర్ ఫ్యాక్టరీ.. దానిలో ఉన్న తాగునీటి ట్యాంక్‌ను నుంచే అక్కడ పనిచేసే కార్మికులంతా రోజూ నీరు తాగేవారు. అయితే ఆ ట్యాంక్‌లో ఓ బల్లి పడి చనిపోయిన విషయం వారికి తెలియదు. ఎప్పటిలాగే శుక్రవారం కూడా ఆ వాటర్ ట్యాంక్‌లోనే నీటిని తాగారు కార్మికులు.. కొద్దిసేపటికే సీన్ మారిపోయింది. ఒక్కొక్కరికి వాంతులు.. తలనొప్పి, అస్వస్థత. ఏం జరుగుతుందో తెలియక ఆందోళన. చివరకు 12 మంది కార్మికులు ఆస్పత్రి బెడ్‌పై చేరాల్సి వచ్చింది. వీరిలో ప్రస్తుతం ఇద్దరి పరిస్థితి విషమంగా ఉంది.

బల్లి పడిన నీరు తాగిన 12 మంది కార్మికులు.. కాసేపటికే వింత ప్రవర్తన.. హాస్పిటల్‌కు తీసుకెళ్లగా
Lizard In Drinking Water Tank

Edited By:

Updated on: Oct 03, 2026 | 4:39 PM

బల్లి పడిన నీరు తాగి 12 మంది కార్మికులు అస్వస్థతకు గురైన ఘటన ఏపీ ,తెలంగాణ సరిహద్దులోని భద్రాద్రి ఐరన్ ఓర్ ఫ్యాక్టరీలో వెలుగు చూసింది. వివారల్లోకి వెళ్తే.. ఫ్యాక్టరీలో కార్మికుల తాగునీటి అవసరాల కోసం ఏర్పాటు చేసిన ట్యాంక్‌లో ఓ బల్లి పడి మృతి చెందింది. ఈ విషయాన్ని ఎవరూ గమనించకపోవడంతో, రోజులాగే కార్మికులు ఆ ట్యాంక్ నీటినే తాగారు. ఆ నీరు తాగిన కొద్దిసేపటికే కార్మికుల్లో ఒకరి తర్వాత ఒకరికి వాంతులు, తలనొప్పి వంటి లక్షణాలు మొదలయ్యాయి. పరిస్థితి విషమించడంతో కొందరు కార్మికులు ఫ్యాక్టరీలోనే కుప్పకూలారు. దీంతో వెంటనే అప్రమత్తమైన ఇతర సిబ్బంది బాధితులను జగ్గయ్యపేట ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు.

ఆస్పత్రిలో 12 మంది.. 24 గంటల అబ్జర్వేషన్

ప్రస్తుతం జగ్గయ్యపేట ప్రభుత్వ ఆస్పత్రిలో మొత్తం 12 మంది కార్మికులు చికిత్స పొందుతున్నారు. బాధితుల్లో బీహార్‌కు చెందిన కార్మికులు కూడా ఉన్నారు. వీరిలో ఇద్దరి ఆరోగ్య పరిస్థితి తీవ్రంగా ఉండటంతో వైద్యులు వారికి ప్రత్యేక వైద్య బృందంతో చికిత్స అందిస్తున్నారు. ముందుజాగ్రత్త చర్యగా మొత్తం 12 మంది కార్మికులను 24 గంటల పాటు వైద్యుల పర్యవేక్షణలో ఉంచారు. వైద్యులు వారి ఆరోగ్య పరిస్థితిని నిరంతరం గమనిస్తూ అవసరమైన వైద్య సహాయం అందిస్తున్నారు.

ట్యాంక్ నిర్వహణపై అనుమానాలు.. నిర్ధారణ కావాల్సిందే!

కార్మికులు అస్వస్థతకు గురికావడానికి ట్యాంక్‌లో బల్లి పడటమే కారణమా లేక మరేవైనా ఇతర కారణాలు ఉన్నాయా అన్నది నిర్ధారణ కావాల్సి ఉంది. నీటి నమూనాలను పరీక్షించిన తర్వాతే అసలు విషయాలు వెలుగులోకి వచ్చే అవకాశం ఉంది. మరోవైపు ఈ ఘటనతో ఫ్యాక్టరీలోని తాగునీటి ట్యాంక్ నిర్వహణ తీరుపై తీవ్ర చర్చ మొదలైంది. ట్యాంక్‌కు సరైన మూత ఉందా లేదా, బల్లి లోపలికి ఎలా పడింది, ట్యాంక్‌ను చివరిసారిగా ఎప్పుడు శుభ్రం చేశారు, నీటి నాణ్యతను క్రమం తప్పకుండా పరీక్షిస్తున్నారా లేదా అన్న ప్రశ్నలు తలెత్తుతున్నాయి. 24 గంటల వైద్య పరిశీలన, నమూనాల వైద్య పరీక్షల అనంతరం కార్మికుల అస్వస్థతకు గల ఖచ్చితమైన కారణం తేలనుంది.

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Loading...
Unable to load recommendations.
Follow Us