ఆంధ్ర ఒడిస్సా సరిహద్దులోని సీలేరు జెన్కో ఉద్యోగులు పరుగులు పెట్టారు.. విషయం ఆ నోట ఈ నోట పాకింది.. అందరూ గుండెలు పట్టుకున్నారు.. వారిలో కొంతమంది ధైర్యం ప్రదర్శించారు.. అలాగే వదిలేస్తే అది జనాల పైకి వచ్చే అవకాశం ఉంది.. దీంతో అత్యంత చాకచక్యంగా వ్యవహరించారు.. తాళ్ల సాయంతో నెమ్మదిగా నోటికి కళ్లెం వేసి.. రిజర్వాయర్ లోకి విజయవంతంగా పంపేశారు.. దీంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు.. అల్లూరి జిల్లా సీలేరు డొంకరాయి మెయిన్ డ్యాం వద్ద మొసలి కలకలం రేపింది..
సిలేరు రిజర్వాయర్ నుండి డ్యాం గట్టు పై కి వచ్చిన మొసలి అటు ఇటు తిరుగుతూ హల్చల్ చేసింది. మొసలిని చూసి జెన్ కో ఉద్యోగుల ఆందోళనకు గురయ్యారు. ఎలాగైనా దాన్ని మళ్లీ నీటిలోకి పంపకపోతే జనాలపై పడే అవకాశం ఉందని భావించారు. మొసలి హడావిడి చూసి ఎవరు ముందుకు రాలేదు. దీంతో ధైర్యం చేసిన ఏపీ జెన్కో హోంగార్డులు రామన్న దొర, రమేష్, రాంబాబు, జనకో ఫోర్ మెన్ రమణలు ముందుకు వచ్చారు.
ఆ తర్వాత మొసలిని కట్టడి చేసేందుకు రెండు గంటల శ్రమించారు. తాళ్ళను దూరం నుంచి నోటికి కళ్లెం వేసే ప్రయత్నం చేశారు. సక్సెస్ ఫుల్ గా తాడును నోటికి కళ్లెం వేసి.. ఆ మొసలిని తిరిగి రిజర్వాయర్ లోకి పంపారు జెన్ కో ఉద్యోగులు. దీంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. సీలేరు నదిలో మొసళ్లు తిరుగుతున్నాయని గత కొంతకాలంగా జాలర్లు అంటూనే ఉన్నారు. ఈ క్రమంలో మొసలి కనిపించడంతో సీలేరు నదిలో చేపల వేటకు వెళ్లే మత్స్యకారులను అధికారులు అప్రమత్తం చేశారు.
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..