
కార్తీక మాసం సందర్భంగా గోదావరిలో పుణ్యస్నానాలు ఆచరించేందుకు వెళ్తున్న భక్తులు అప్రమత్తంగా ఉండాలి. పోలవరం ప్రాజెక్టు పరిసరాల్లో భారీ మొసలి సంచారం కలకలం రేపుతోంది. ప్రాజెక్టు దిగువ కాఫర్ డ్యామ్ సమీపంలోని రహదారిపై ఓ భారీ మొసలి తచ్చాడుతూ వెళ్తున్న దృశ్యాలు స్థానికులను, కార్మికులను భయాందోళనకు గురిచేశాయి.
నిర్మాణ పనుల కోసం రాకపోకలు సాగిస్తున్న లారీ డ్రైవర్లు వాహనాల హెడ్లైట్ల వెలుతురులో రోడ్డు దాటుతున్న మొసలిని గుర్తించారు. వెంటనే తమ సెల్ఫోన్లలో ఆ దృశ్యాలను చిత్రీకరించి సోషల్ మీడియాలో పోస్టు చేశారు. దీంతో మొసలికి సంబంధించిన వీడియోలు, ఫొటోలు నెట్టింట వైరల్గా మారాయి. దిగువ కాఫర్ డ్యామ్ ప్రాంతంలో గోదావరి సహజ ప్రవాహం కొనసాగుతుండటంతో నిత్యం పెద్ద సంఖ్యలో ప్రజలు రాకపోకలు సాగిస్తుంటారు. పరీవాహక గ్రామాల ప్రజలు మంచినీటి అవసరాల కోసం ఈ ప్రాంతానికి వస్తుంటారు. ప్రస్తుతం కార్తీక మాసం కావడంతో గోదావరిలో పుణ్యస్నానాలు ఆచరించేందుకు భక్తులు పెద్ద సంఖ్యలో తరలివస్తున్నారు. ముఖ్యంగా అయ్యప్ప, శివ, వేంకటేశ్వర స్వామి మాలధారణ చేసిన దీక్షాపరులు తెల్లవారుజాము నుంచే నదీ తీరానికి చేరుకుంటున్నారు. ఇలాంటి రద్దీ ప్రాంతానికి సమీపంలోనే మొసలి కనిపించడంతో ఎప్పుడు ఏ ప్రమాదం జరుగుతుందోనని స్థానికులు ఆందోళన చెందుతున్నారు.
ఈ ఘటనపై అటవీ క్షేత్రాధికారి (ఎఫ్ఆర్ఓ) ఎస్కే వలీ స్పందించారు. పోలవరం ముంపు గ్రామాల తరలింపు పూర్తయిన తర్వాత పాపికొండల అటవీ ప్రాంతంలో జనసంచారం తగ్గిందని, దీంతో గోదావరిలో మొసళ్ల సంఖ్య బాగా పెరిగిందని తెలిపారు. సాధారణంగా నదిలో లోతైన ప్రాంతాలు, రాళ్లు, దట్టమైన అటవీ ప్రాంతాలను మొసళ్లు తమ ఆవాసాలుగా చేసుకుంటాయని వివరించారు. ఇటీవల వచ్చిన వరదల ఉద్ధృతికి ఈ మొసలి దిగువ ప్రాంతానికి కొట్టుకొచ్చి ఉండవచ్చని ఆయన అభిప్రాయపడ్డారు. తిరిగి ఎగువన ఉన్న తన ఆవాసానికి చేరుకునే క్రమంలోనే కాఫర్ డ్యామ్ రహదారిపైకి వచ్చి ఉండవచ్చని అంచనా వేశారు.
మొసలి సంచారం నేపథ్యంలో కార్తీక స్నానాలకు వెళ్లే భక్తులు, మత్స్యకారులు, నదీతీర గ్రామాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అటవీ శాఖ అధికారులు సూచించారు. ముఖ్యంగా లోతైన ప్రాంతాల్లోకి వెళ్లకూడదని, నదిలో స్నానాలు చేసేటప్పుడు తగిన జాగ్రత్తలు పాటించాలని హెచ్చరించారు. మొసలి సంచారాన్ని దృష్టిలో ఉంచుకుని గోదావరి తీర ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఉంది.