
బాపట్ల జిల్లా పర్చూరు మండలం గార్నెపూడి గ్రామంలో ఓ మొసలి కలకలం సృష్టించింది. శుక్రవారం మద్యాహ్నం చెరువు గట్టుమీద నడుస్తున్న కొందరు గ్రామస్థులకు మొసలి చెరువులో సంచరిస్తూ కనబడింది. మొసలిని చూసిన గ్రామస్థులు ఒక్కసారిగా కేకలు వేయడంతో గ్రామస్థులు అందరూ చెరువు దగ్గరకు చేరుకున్నారు. కొద్దిసేపు అనంతరం మొసలి నీళ్ళలోకి వెళ్ళిపోయింది. గార్నెపూడి గ్రామంలోని చెరువులో మొసలి ఉందన్న సమాచారం అందుకున్న గర్నెపూడి వీఆర్వో అనూష చెరువు దగ్గరకు చేరుకుని పరిశీలించారు. ఐదు ఎకరాల విస్తీర్ణంలో ఉన్న మంచినీటి చెరువులో మొసలి గురించి ఉన్నతాధికారులకు సమాచారం అందించారు.
పర్చూరు తహశీల్దార్ బ్రహ్మయ్య, ఎస్సై అంకమ్మరావు హుటాహుటిన గర్నెపూడి చేరుకొని పరిస్థితిని సమీక్షించారు. ఈ విషయాన్ని అటవీ అధికారులకు తెలియజేశారు. సుమారు నాలుగు అడుగుల పొడవు ఉన్న మొసలి చెరువులో కనబడటంతో గ్రామస్థులు ఆందోళన చెందుతున్నారు. గ్రామస్థులు ఎవరూ చెరువు వద్దకు వెళ్ళకుండ గ్రామంలో దండోరా వేయించారు.
Crocodile Spotted In Garnipudi Village Pond
పశువులు, గొర్రెల కాపరులు జాగ్రత్తగా ఉండాలని అధికారులు సూచించారు. చెరువు వద్దకు ఎవరూ వెళ్లకుండ పోలీసులు జాగ్రత్తలు తీసుకుంటున్నారు. ఇటీవల మురసు తుఫాన్ తో భారీ వర్షాలు కురిశాయి.. ఈ సందర్భంగా వచ్చిన వరదలకు మొసలి కొట్టుకొని వచ్చి ఉంటుందని భావిస్తున్నారు . వరద నీటితో నిండిన చెరువుల వద్ద ప్రజలు అప్రమత్తంగా ఉండాలని తహశీల్దార్ కోరారు.
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..