
Puri Tragedy: చిత్తూరు జిల్లా గంగవరంలో విషాదం చోటు చేసుకుంది. పూరి జగన్నాథుడి దర్శనానికి వెళ్లిన దంపతులు మృత్యువాత పడటంతో ఆ గ్రామం శోక సంద్రంలో మునిగిపోయింది. నదిలో కొట్టుకుపోతున్న మనవరాలిని కాపాడబోయి.. అవ్వ తాత మృతి చెందడంతో జీర్ణించుకోలేకపోయింది. వివరాల్లోకి వెళితే.. గంగవరం మండలం మేలుమాయి క్రాస్ వద్ద శ్రీనివాసులు శెట్టి దేవి దంపతులు రైస్ మిల్ నిర్వహిస్తున్నారు. శ్రీనివాసులు శెట్టి దేవి దంపతులకు ఇద్దరు కొడుకులు, కూతురు ఉన్నారు. ఇద్దరూ బెంగళూరులో సాఫ్ట్‌వేర్ ఉద్యోగులుగా పనిచేస్తూ అక్కడే ఉంటున్నారు.
పిల్లలతో కలిసి పూరి జగన్నాథుడి దర్శనం చేసుకోవాలని భావించిన శ్రీనివాసులు శెట్టి దేవి దంపతులు.. నవంబర్ 10న బెంగళూరుకు వెళ్లారు. అక్కడి నుంచి కుటుంబ సభ్యులతో కలిసి ఫ్లైట్‌లో భువనేశ్వర్ చేరుకున్నారు. పూరి జగన్నాథుడి దర్శనానికి బయలుదేరిన శ్రీనివాసులు శెట్టి కుటుంబం.. బైతరణీ నదిలో నదీ స్నానం కోసం వెళ్లారు. నదీలో నీటి ప్రవాహ ఉధృతి కొనసాగుతుండగా అక్కడే ఆడుకుంటున్న ఆరేళ్ల మనవరాలు యశస్వి ప్రమాదానికి గురైంది. కళ్ళముందే నీటి ప్రవాహంలో కొట్టుకుపోతున్న మనవరాలిని కాపాడే ప్రయత్నంలో శ్రీనివాసులు శెట్టి, దేవి దంపతులు నదిలోకి దిగారు. కొట్టుకుపోతున్నమనవరాలిని కాపాడే ప్రయత్నం చేసిన అవ్వ తాత.. ఎట్టకేలకు ఆరేళ్ల మనవరాలిని నది ఒడ్డుకు విసిరేశారు. అయితే ఆ నది నీటి ఉధృతికి వారు నిలబడలేకపోయారు. ఎదురొడ్డి ఒడ్డు కు చేరుకోలేక పోయారు.
నదిలో నీటి ప్రవాహానికి శ్రీనివాసులు శెట్టి దేవీ దంపతులు కొట్టుకుపోయారు. కొడుకులు, కోడళ్ళు కూతుళ్లు చూస్తుండగానే గల్లంతైపోయారు. కనుచూపు మేరలో కనిపించకపోవడంతో పోలీసులను ఆశ్రయించారు. అయినా, ప్రయోజనం లేకపోయింది. రంగంలోకి దిగిన రెస్క్యూ టీం దాదాపు మూడు గంటల పాటు గాలించి నదిలో నుంచి ఆ దంపతుల మృతదేహాలను బయటికి తీశారు. పూరి జగన్నాథుని దర్శనానికి వెళ్లి ప్రాణాలు పోగొట్టుకున్న శ్రీనివాసులు శెట్టి దేవి దంపతుల డెడ్ బాడీలను స్వగ్రామానికి చేరుకోవడంతో స్థానికులు, కుటుంబ సభ్యులు, బంధువుల ఆర్తనాదాలు మిన్నంటాయి. గ్రామానికి చేరుకున్న మృతదేహాలకు స్థానిక ఎమ్మెల్యే అమర్నాథ్ రెడ్డి తో పాటు పలువురు నివాళులు అర్పించగా బంధువులు అంత్యక్రియలను పూర్తి చేశారు.