
ఎల్‌నినోతో ఇబ్బంది పడుతున్న తెలుగు స్టేట్స్ వైపు తుఫాను దూసుకువస్తోంది. -అయితే సాధారణ తుఫాన్ కాదు తీవ్ర తుఫాను అని.. అంతా అలర్ట్‌గా ఉండాలని హెచ్చరికలు జారీచేసింది. బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం వాయుగుండంగా బలపడింది. తూర్పు మధ్య ఆగ్నేయ బంగాళాఖాతంలో కేంద్రీకృతమైన ఈ వాయుగుండం, తీవ్ర తుపానుగా మారి ఏపీలోని 12 జిల్లాలపై ప్రభావం చూపనుందని భారత వాతావరణ శాఖ హెచ్చరించింది. తుపానుగా మారిన తర్వాత 140 కిలోమీటర్ల వేగంతో గాలులు వీయడంతో పాటు భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని పేర్కొంది. గడిచిన 6 గంటల్లో గంటకు 5 కిమీ వేగంతో కదులుతుంది. ఇది ప్రస్తుతానికి విశాఖపట్నంకు 880 కి. మీ., కాకినాడకు 980 కి. మీ., మచిలీపట్నంకు 1080 కి. మీ., బాపట్లకు 1150 కి. మీ. దూరంలో కేంద్రీకృతమై ఉంది. తర్వాత పశ్చిమ వాయవ్య దిశగా కదులుతూ మరింత బలపడి తీవ్ర వాయుగుండంగా మారనుంది.
సోమవారం ఉదయానికి తూర్పు, పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో తుపానుగా బలపడనుంది. మంగళవారం ఉదయానికి పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో తీవ్ర తుపానుగా బలపడే అవకాశం కనిపిస్తోంది. తర్వాత పశ్చిమ, వాయవ్య దిశగా కదులుతూ అతి తీవ్ర తుపానుగా మారొచ్చని వాతావరణ శాఖ అంచనా వేస్తోంది. తీవ్ర తుఫానుగా మారితే అర్నాబ్ తుఫానుగా నామకరణం చేయనున్నారు. బుధవారం ఉదయం ఆంధ్రప్రదేశ్ తీర సమీపానికి చేరుకొని బాపట్ల-విశాఖ మధ్య తీరం దాటే అవకాశం కనిపిస్తోంది. ఆ సమయంలో పెనుగాలులు వీచే అవకాశం ఉంది.
తుపాను ప్రభావంతో ఈ నెల 27, 28 తేదీల్లో విశాఖ, అల్లూరి సీతారామరాజు, అనకాపల్లి, కాకినాడ, తూర్పుగోదావరి, డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ కోనసీమ, పశ్చిమగోదావరి, ఏలూరు, బాపట్ల, గుంటూరు, ఎన్టీఆర్, కృష్ణా జిల్లాల్లో, పార్వతీపురం మన్యం, విజయనగరం, శ్రీకాకుళం జిల్లాలో అతి భారీ వర్షాలు, పల్నాడు, ప్రకాశం, శ్రీపొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాల్లో భారీ వర్షాలు కురవనున్నాయి. ఈ నెల 29 నాటికి తుపాను తీవ్రత కాస్త తగ్గనుంది. ఆ రోజు ఏలూరు, పశ్చిమగోదావరి, అల్లూరి సీతారామరాజు, విశాఖ, అనకాపల్లి, విజయనగరం, శ్రీకాకుళం జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది.
తుఫాన్ ముప్పుపై అప్రమత్తంగా ఉండాలని అధికారులకు స్పష్టం చేశారు ముఖ్యమంత్రి చంద్రబాబు. ప్రజలకు ముందస్తు హెచ్చరికలు జారీ చేయాలని, మత్స్యకారులు వేటకు వెళ్లకుండా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. లోతట్టు కాలనీల ప్రజలను అప్రమత్తం చేయడంతో పాటు..టోల్‌ఫ్రీ నంబర్లు అందుబాటులో ఉంచాలన్నారు ముఖ్యమంత్రి.. మత్స్యకారులు వేటకు వెళ్లిన వారు తీర ప్రాంతాలకు చేరుకునేలా అలర్ట్ జారీ చేయాలని.. సముద్రంలోకి వెళ్లొద్దని వాతావరణ శాఖ అధికారులు సూచనలు జారీ చేశారు.
ఈ నెల 28, 29, 30 తేదీల్లో తెలంగాణకు వర్ష సూచన చేసింది వాతావరణశాఖ. పలు జిల్లాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయని చెప్పింది. ములుగు, భద్రాద్రి, ఖమ్మం, మహబూబాబాద్, వరంగల్, మంచిర్యాల,పెద్దపల్లి, భూపాలపల్లి జిల్లాలకు వర్షసూచన చేసింది. బంగాళాఖాతంలో తుఫాన్ దృష్ట్యా అధికారుల అలర్ట్ అయ్యారు.