
ఆంధ్రప్రదేశ్‌లో పెట్టుబడుల వరద పారించే లక్ష్యంతో రాష్ట్ర ప్రభుత్వం అడుగులు వేస్తోంది. ఇందులో భాగంగానే స్విట్జర్లాండ్‌తో ఆర్థిక, పారిశ్రామిక సంబంధాలను మరింత బలోపేతం చేసే దిశగా పరిశ్రమలు, వాణిజ్య శాఖా మంత్రి టి.జి. భరత్ న్యూఢిల్లీలో కీలక చర్చలు జరిపారు. స్విస్ కాన్ఫెడరేషన్ స్టేట్ సెక్రటరీ ఫర్ ఎకనామిక్ అఫైర్స్ హెలెనా బుడ్లిగర్ ఆర్టియడాతో మంత్రి భరత్ ద్వైపాక్షిక సమావేశం నిర్వహించారు. స్విస్ రాయబార కార్యాలయం ఆధ్వర్యంలో జరిగిన ఏపీ-స్విట్జర్లాండ్ బిజినెస్ ఫోరమ్‌లో స్విస్ ప్రభుత్వ ఉన్నతాధికారులు, పారిశ్రామిక దిగ్గజాలు పాల్గొనగా.. మంత్రి వారికి ఏపీలో ఉన్న పెట్టుబడి అవకాశాలను వివరించారు. స్విస్ పారిశ్రామిక నైపుణ్యాలు, ఏపీ వృద్ధి లక్ష్యాలకు సరిగ్గా సరిపోతాయని మంత్రి వెల్లడించారు. అడ్వాన్స్‌డ్ మ్యానుఫ్యాక్చరింగ్, ప్రెసిషన్ ఇంజనీరింగ్, ఫార్మా, బయోటెక్, మెడ్‌టెక్, క్లీన్ ఎనర్జీ, మొబిలిటీ, లాజిస్టిక్స్ రంగాలలో పెట్టుబడులకు రాష్ట్రం స్వర్గధామమని చెప్పారు. రాష్ట్రంలో వేగం, స్థిరత్వం, సేవాభావం విధానంతో పాటు, ఏపీఈడీబీ ద్వారా పారిశ్రామికవేత్తలకు సింగిల్ డెస్క్ విధానంలో పూర్తి సహకారం అందిస్తున్నామని స్పష్టం చేశారు.
భారత్-ఇఎఫ్‌టీఏ వాణిజ్య ఒప్పందం ద్వారా రానున్న 15 ఏళ్లలో 100 బిలియన్ డాలర్ల పెట్టుబడులు, 1 మిలియన్ ఉద్యోగాల లక్ష్య సాధనలో ఏపీ కీలక పాత్ర పోషిస్తుందని మంత్రి ధీమా వ్యక్తం చేశారు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు జూరిచ్, దావోస్ పర్యటనల స్ఫూర్తితో ఈ బంధం మరింత బలపడిందని గుర్తుచేశారు.
నవంబర్ 12-13 తేదీలలో విశాఖపట్నంలో జరగనున్న ప్రఖ్యాత సీఐఐ భాగస్వామ్య సదస్సు కు తరలిరావాల్సిందిగా స్విస్ పారిశ్రామిక వర్గాలను మంత్రి సాదరంగా ఆహ్వానించారు. పెట్టుబడిదారుల ఆసక్తిని క్షేత్రస్థాయి ప్రాజెక్టులుగా మార్చడమే లక్ష్యంగా ప్రభుత్వం దూసుకెళ్తోందని ఈ సందర్భంగా ఆయన ఉద్ఘాటించారు.