Vidadala Rajini: గ్రాండ్ పార్టీ ఇచ్చిన విడదల రజనీ.. మహిళా మంత్రి విందుకు అనుకోని అతిథి!

|

Apr 28, 2022 | 8:00 PM

ఆ మహిళా మంత్రి... పదవి దక్కిందన్న ఆనందంలో పెద్ద పార్టీ ఇచ్చారనుకోండి. ఆ మాజీ మంత్రి ధర్మపత్నిని ఏల ఆహ్వానించవలె?.. ఆ మహిళా అమాత్యురాలు ఆహ్వానించెను పో... అయితే, ఈ మాజీ అమాత్యుడి అర్ధాంగి ఏల పోవలె? రాజకీయమా? రణతంత్రమా?

Vidadala Rajini: గ్రాండ్ పార్టీ ఇచ్చిన విడదల రజనీ.. మహిళా మంత్రి విందుకు అనుకోని అతిథి!
Vidadala Rajini Prathipati Venkayamma
Follow us on

Vidadala Rajini: ఆ మహిళా మంత్రి.. పదవి దక్కిందన్న ఆనందంలో పెద్ద పార్టీ ఇచ్చారనుకోండి. ఆ మాజీ మంత్రి ధర్మపత్నిని ఏల ఆహ్వానించవలె?.. ఆ మహిళా అమాత్యురాలు ఆహ్వానించెను పో… అయితే, ఈ మాజీ అమాత్యుడి అర్ధాంగి ఏల పోవలె? రాజకీయమా? రణతంత్రమా? ఇప్పుడు ఏపీ పొలిటికల్‌ సర్కిల్‌లో ఇలాంటి చర్చే జరుగుతోంది. ఇంతకీ ఆ పార్టీ ఇచ్చిన మంత్రెవరు? ఆ అనుకోని అతిథి ఎవరు? రాజకీయాల్లోకి వచ్చి తక్కువ రోజులే అయినా… తెలుగురాష్ట్రాల్లో విడదల రజినీ చాలానే పేమస్సయారు. మొన్నటి వరకూ ఆమె గుంటూరు జిల్లా చిలకలూరిపేట ఎమ్మెల్యే. మరిప్పుడు… ఏపీ ఆరోగ్యశాఖామంత్రి. ఆ సంతోషాన్ని షేర్‌ చేసుకునేందుకే… ఇటీవల ఒక గ్రాండ్‌ పార్టీ ఇచ్చారంట విడదల రజినీ. అది కూడా అందరికీ కాదు… మహిళలకు మాత్రమే. అందులోనూ సెలెక్టెడ్‌ వీఐపీలకు మాత్రమే ఆహ్వానం అందిందట.

పదవి వచ్చిన ఆనందంలో తోటి మహిళలకు ఓ మహిళా మంత్రి పార్టీ ఇవ్వడంలో వింతేముంది.. విశేషమేముంది అనుకుంటే పొరబడినట్టే. ఎందుకంటే, అక్కడ కనిపించిన ఓ అనుకోని అతిథి.. రాజకీయంగా అందర్నీ ఆశ్చర్యపరిచిందనే చెప్పాలి. ఆ అతిథి ఎవరంటే… మంత్రి రజినీ గురువు, మాజీ మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు సతీమణి వెంకాయమ్మ కావడమే పెద్ద విశేషం. ఇప్పుడిదే పొలిటికల్‌గా హాట్‌ టాపిక్‌ అయ్యింది. తన భర్త ప్రత్తిపాటి పుల్లారావును ఓడించిన రజిని పార్టీకి.. వెంకాయమ్మ రావడం ఆశ్చర్యం కాకపోతే మరేమిటి? అందుకే ఇప్పుడంతా ఈ పార్టీ గురించే చర్చించుకుంటున్నారు. అసలు వెంకాయమ్మను పిలవాలనే ఆలోచన మంత్రి విడదల రజినీకి ఎందుకొచ్చిందనేదే? ఇప్పుడు మెయిన్‌ డిస్కషన్ పాయింట్.

నిజానికి, విడదల రజినీ రాజకీయ అరంగేట్రం… టీడీపీ నుంచే జరిగింది. రజినీ మామ విడుదల లక్ష్మీనారాయణ అప్పట్లో చిలకలూరిపేట మార్కెట్ యార్డ్ ఛైర్మన్ గా పనిచేశారు. నాడు మంత్రిగా ఉన్న ప్రత్తిపాటి పుల్లారావుకు రైట్ హ్యాండ్‌గానూ ఉండేవారు. ఆ సమయంలోనే లక్ష్మీనారాయణ కొడుకు కుమారస్వామితో రజినీ వివాహమైంది. అప్పట్లో, మహానాడు వేదికపై చంద్రబాబును ఆకాశానికెత్తుతూ రజినీ చేసిన ప్రసంగం… బాగా హైలెట్టయ్యింది. టీడీపీ పెద్దల దృష్టిలోనూ పడ్డారు. కానీ, అనూహ్యంగా విడదల కుటుంబం వైసీపీలో చేరడం, చిలకలూరిపేట ఎమ్మెల్యే టిక్కెట్‌ రజినీకి దక్కడం.. చకచకా జరిగిపోయాయి.

అప్పటివరకూ మంత్రిగా పని చేసిన ప్రత్తిపాటిని ఓడించిన రజినీ… ఇప్పుడు ఏకంగా మినిస్టరయ్యారు. పార్టీమారి తనను ఓడించిన విడుదల రజినీపై ప్రత్తిపాటి కుటుంబానికి పీకల్లోతు కోపం ఉంది. వచ్చే ఎన్నికల్లోనూ రజినీపైనే పోటీకి సిద్ధమవుతున్నారు పుల్లారావు. మరి, ఇలాంటి సమయంలో… మంత్రి రజినీ ఇచ్చిన పార్టీకి పుల్లారావు భార్య ఎందుకు వెళ్లారనేదే ఆసక్తి రేపుతోంది. పొలిటికల్ గురువైన పుల్లారావు కుటుంబాన్ని గౌరవించడానికే రజినీ.. వెంకాయమ్మను ఆహ్వానించారా? లేక నీ భర్తమీదే గెలిచి మంత్రినయ్యానని గొప్పలు చెప్పడానికి… పార్టీకి పిలిచారా? అనే గుసగుసలు వినిపిస్తున్నాయి.

Read Also…. Pilot vs Patnam: పైలట్‌ వర్సెస్‌ పట్నం.. తెలంగాణ పాలిటిక్స్‌లో హాట్‌టాపిక్‌గా మారిన తాండూరు తన్నులాట!