
కన్నవారినే కాదనుకుని వృద్ధాశ్రమాలకు పరిమితం చేస్తున్న నేటి సమాజంలో.. ఓ మూగజీవంపై ఆ కుటుంబం చూపించిన ప్రేమ అందరి హృదయాలను కదిలిస్తోంది. పెంపుడు కుక్కను కేవలం కాపలా కోసమే కాకుండా ఇంట్లో సొంత బిడ్డలా, కుటుంబ సభ్యుడిలా చూసుకున్న ఆ కుటుంబం.. అది చనిపోతే తట్టుకోలేకపోయింది. తమ తాతయ్య సమాధి పక్కనే హిందూ సాంప్రదాయ పద్ధతిలో అంత్యక్రియలు నిర్వహించడమే కాకుండా ఏకంగా రూ.2 లక్షలు వెచ్చించి శాశ్వత సమాధి నిర్మించి తమ అపురూపమైన అనుబంధాన్ని చాటుకుంది.
బాపట్ల జిల్లా యద్దనపూడి గ్రామానికి చెందిన బండ్ల సతీష్ కుటుంబం పదేళ్ల క్రితం రోట్వీలర్ జాతికి చెందిన ఓ కుక్కపిల్లను ఎంతో ముచ్చటపడి తెచ్చుకున్నారు. దానికి ముద్దుగా హెక్టార్ అని పేరు పెట్టుకున్నారు. అది కేవలం పెంపుడు జంతువులా మాత్రమే కాకుండా కొద్ది కాలంలోనే కుటుంబంలో ఒకరిగా కలిసిపోయింది. సతీష్ కుటుంబ సభ్యులంతా హెక్టార్‌తో విడదీయలేని ఆత్మీయ అనుబంధాన్ని పెంచుకున్నారు. విశ్వాసానికి మారుపేరైన హెక్టార్ వారి ఇంటికి కంటికి రెప్పలా ఉంటూ అందరి ప్రేమాభిమానాలను చూరగొన్నాడు.
కొంతకాలం క్రితం హెక్టార్ తీవ్ర అనారోగ్యానికి గురయ్యాడు. పరీక్షించిన వెటర్నరీ వైద్యులు హెక్టార్‌కు క్యాన్సర్ సోకినట్లు నిర్ధారించారు. వ్యాధి తీవ్రత దృష్ట్యా బతికే అవకాశాలు చాలా తక్కువని వైద్యులు తేల్చిచెప్పారు. అయినప్పటికీ హెక్టార్‌పై ఉన్న అంతులేని ప్రేమతో ఆ కుటుంబం ధైర్యం వీడలేదు. వ్యాధి నయం కావాలంటూ ఎన్నో యానిమల్ హాస్పిటల్స్ చుట్టూ తిప్పుతూ ఎంత ఖర్చయినా వెనుకాడకుండా మందులు వాడించారు. అయితే చికిత్స పొందుతూ హెక్టార్ తుదిశ్వాస విడిచాడు. పదేళ్ల పాటు తమతో కలిసి నడిచిన మూగజీవి మరణంతో ఆ ఇంట తీవ్ర విషాదం అలుముకుంది.
కుటుంబంలో ఒకరు చనిపోతే ఎలాంటి సంప్రదాయాలు పాటిస్తారో, హెక్టార్‌కు కూడా అలాగే అంతిమ వీడ్కోలు పలకాలని సతీష్ కుటుంబం నిర్ణయించుకుంది. తమ వ్యవసాయ పొలంలో ఉన్న తాతయ్య బండ్ల హనుమయ్య సమాధి పక్కనే హెక్టార్‌ను ఖననం చేశారు. హిందూ సాంప్రదాయ పద్ధతి ప్రకారం శాస్త్రోక్తంగా అంత్యక్రియలు నిర్వహించారు. అంతటితో ఆగకుండా హెక్టార్ జ్ఞాపకాలు శాశ్వతంగా నిలిచిపోయేలా దాదాపు రూ.2 లక్షలు వెచ్చించి ప్రత్యేక సమాధిని నిర్మించారు. ఆ సమాధిపై హెక్టార్ పోలికలతో ప్రత్యేకంగా తయారు చేయించిన కుక్క విగ్రహాన్ని ప్రతిష్టించారు. మానవతా విలువలు, ఆత్మీయతలు కనుమరుగైపోతున్న నేటి యాంత్రిక జీవనంలో.. ఒక మూగజీవి పట్ల సతీష్ కుటుంబ సభ్యులు చూపిన ఈ నిస్వార్థ ప్రేమ, అభిమానం స్థానికులతో పాటు ప్రతి ఒక్కరినీ ఆలోచింపజేస్తోంది.