ఇటీవల సూపర్ హిట్ కొట్టిన బేబీ చిత్రంలో సన్నివేశాలను ఏమాత్రం తీసిపోకుండా కాపీ కొట్టి నిజ జీవితంలో కూడా ఓ బేబీ అవతారం ఎత్తింది ఓ యువతి. ఒకరికి తెలియకుండా మరొకరితో మాట్లాడుతూ ఇద్దరితో ప్రేమాయణం నడిపింది. విషయం తెలిసిన మొదటి ప్రియుడు.. యువతిని నిలదీయడంతో తప్పును కప్పి పుచ్చుకునేందుకు కొత్త నాటకం మొదలుపెట్టింది. తాను ప్రేమించడం లేదని, అతడే వేధిస్తున్నాడని చెప్పి, రెండో ప్రియుడితో కలసి మొదటి ప్రియుడిపై దాడికి కుట్ర చేసింది. ఈ దారుణ ఘటన కర్నూలు జిల్లాలో చోటు చేసుకుంది.
కర్నూలు జిల్లా గోనెగండ్ల మండలం గాజులదిన్నె దగ్గర ఉన్న LLC కాలువ పక్కన అరవింద్ అనే యువకుడిపై జరిగిన దాడిలో పోలీస్ విచారణలో ఊహించని నిజాలు బయటకు వచ్చాయి. ఎమ్మిగనూరు పట్టణానికి చెందిన అరవింద్ ప్రస్తుతం డిగ్రీ చదువుతున్నాడు. తాను ఇంటర్ చదివే కళాశాలలో తన క్లాస్ మెంట్ అయినా ప్రియాంక అనే అమ్మాయితో ప్రేమలో పడ్డాడు. ఇద్దరు కొన్ని రోజులు ప్రేమాయణం సాగడంతో ఇంట్లో పెద్దలకు తెలియడంతో ఇద్దరిని మందలించారు. అప్పటి నుండి ఇద్దరు దూరంగా ఉన్నారు.
ఇంటర్ చదువు పూర్తి అయినా ప్రియాంక ఎమ్మిగనూరు పట్టణానికి సమీపంలో ఉన్న ఓ ప్రవేట్ ఇంజనీరింగ్ కళాశాలలో చేరింది. ప్రస్తుతం ఇంజనీరింగ్ రెండవ రెండవ సంవత్సరం చదువుతూ, తన క్లాస్ మెంట్ అయిన భారత్ అనే యువకుడితో మరోసారి ప్రేమాయణం కొనసాగించింది యువతి. ఇంతలో ప్రియాంకకు ఒకరోజు మొదటి ప్రియుడు అరవింద్ కనిపించడంతో అతనితో మరోసారి యవ్వారం మొదలుపెట్టింది.
ఇటు మొదటి ప్రియుడుతో కూడా ప్రేమాయణం కొనసాగించింది. ఇలా ఒకరికి తెలియకుండా ఒకరితో ప్రేమాయణం కొనసాగిస్తుండగా, అనుమానం వచ్చిన రెండో ప్రియుడు ప్రియాంకను నిలదీయడంతో తాను చేసిన తప్పును కప్పిపుచ్చుకునేందుకు, మొదటి ప్రియుడు అరవింద్ తనను వేధిస్తున్నాడని, రెండవ ప్రియుడు భరత్ దగ్గర నమ్మించింది. విషయం తెలుసుకున్న భరత్ ఆగ్రహంతో అరవింద్ కావాలా నేను కావాలా తేల్చుకొని చెప్పడంతో, నాకు నువ్వే కావాలి అరవింద్ వద్దు, అరవింద్ వేధింపుల నుండి నన్ను కాపాడని ప్రియాంక చెప్పింది.
ఈక్రమంలో రెండో ప్రియుడు భారత్ తో కలసి మొదటి ప్రియుడు అరవింద్‌పై దాడికి కుట్ర పన్నారు. రెండు రోజులు ముందుగానే గాజులదిన్నె ప్రాజెక్టు వద్దకు ప్రియాంక వచ్చి రెక్కీ నిర్వహించుకుని వెళ్లింది. మంగళవారం అరవింద్‌ను గాజులదిన్నె ప్రాజెక్టు వద్దకు తీసుకెళ్లింది. ఇదే విషయాన్ని పోన్‌లో మెసేజ్ ద్వారా ఎప్పటికప్పుడు రెండవ ప్రియుడు భారత్‌కు ప్రియాంక సమాచారం ఇచ్చింది. అతడు తన స్నేహితులు కుమార స్వామి, ప్రశాంత్ కుమార్, రామాంజనేయులుతో కలిసి వేటకొడవళ్లతో అక్కడికి చేరుకుని అరవింద్‌పై దాడి చేశారు. ఈ ఘటన తర్వాత యువతి అక్కడి నుంచి పారిపోయింది. అరవింద్ కేకలు వేయడంతో చుట్టుపక్కల రైతులు కాపాడి పోలీసులకు సమాచారం ఇచ్చారు. కాగా విచారణలో యువతిదే పక్కా ప్లాన్ అని తెలిసి పోలీసులు అవాక్కయ్యారు. నిందితులను పట్టుకుని రిమాండ్‌కు తరలిస్తున్నట్టు సీఐ గంగాధర్ తెలిపారు.
మరిన్ని క్రైమ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..