Andhra Pradesh: స్థలాన్ని అద్దెకివ్వడమే ఆమె చేసిన పాపం.. ఆశ్రయమిస్తే ఆయువు తీశాడు..!

| Edited By: Balaraju Goud

Sep 29, 2024 | 1:50 PM

స్థలాన్ని అద్దెకివ్వడమే ఆమె చేసిన పాపమైంది... చివరకు ప్రాణాలు తీసేందుకు దారి తీసింది... ఒంటరిగా ఉంటున్న ఓ వృద్దురాలు తనకు సహాయంగా ఉంటాడని నమ్మి ఓ యువకుడికి తన ఖాళీ స్థలాన్ని అద్దెకిస్తే తన నగలపై కన్నేసిన ఆ కిరాతకుడు విషమిచ్చి చంపేశాడు.

Andhra Pradesh: స్థలాన్ని అద్దెకివ్వడమే ఆమె చేసిన పాపం.. ఆశ్రయమిస్తే ఆయువు తీశాడు..!
Chirala Murder Case
Follow us on

స్థలాన్ని అద్దెకివ్వడమే ఆమె చేసిన పాపమైంది… చివరకు ప్రాణాలు తీసేందుకు దారి తీసింది… ఒంటరిగా ఉంటున్న ఓ వృద్దురాలు తనకు సహాయంగా ఉంటాడని నమ్మి ఓ యువకుడికి తన ఖాళీ స్థలాన్ని అద్దెకిస్తే తన నగలపై కన్నేసిన ఆ కిరాతకుడు విషమిచ్చి చంపేశాడు. అనంతరం శవాన్ని మాయం చేసేందుకు దూరంగా తీసుకెళ్ళి తగులబెట్టాడు. ఆ తరువాత ఏమీ ఎరగనట్టు బామ్మ కనిపించడం లేదంటూ ఆమె బంధువులతో కలిసి పోలీసు స్టేషన్‌లో ఫిర్యాదు చేశాడు. తనకు కొండంత అండగా ఉన్న తల్లిలాంటి బామ్మ కనిపించడం లేదంటూ మొసలి కన్నీరు కార్చాడు. అతని ప్రవర్తనపై అనుమానంతో పోలీసులు తమదైన స్టైల్లో విచారించడంతో అసలు దారుణం వెలుగు చూసింది.

బాపట్ల జిల్లా చీరాల పట్టణంలోని ఉజిలి పేటకు చెందిన చెందిన వృద్ధురాలు విజయలక్ష్మి(79) మిస్సింగ్ కేసు విషాదంగా ముగిసింది. వృద్ధురాలు విజయలక్ష్మి(79) ని సినీ పక్కీలో హత్య చేసి, ఆపై సుదూర ప్రాంతంలో ఆమె మృతదేహాన్ని దహనం చేసినట్లు పోలీసుల విచారణ వెల్లడైంది. తొలుత ఈ కేసుకు సంబంధించి విజయలక్ష్మి కనిపించడం లేదంటూ ఆమె బంధువులు చీరాల ఒన్‌టౌన్‌ ఫీఎస్‌లో ఫిర్యాదు చేయడంతో పోలీసులు రంగంలోకి దిగి విచారణ ప్రారంభించారు.

విజయలక్ష్మి కుమారుడు, కుమార్తె ఇతర ప్రాంతాల్లో సాఫ్ట్‌వేర్‌ ఇంజనీర్లుగా పనిచేస్తుండటంతో ఉజిలిపేటలో ఆమె ఒంటరిగా ఉంటోంది. 79 ఏళ్ళ విజయలక్ష్మికి అదే ప్రాంతంలో కొంత ఖాళీ స్థలం ఉంది. ఈ స్థలానికి పాపరాజుతోటకు చెందిన పాశం కుమార్‌ తేజకు అద్దెకు ఇచ్చింది. ఆ స్థలంలో ఓ మార్బుల్ షాప్ పెట్టుకుని నడుపుతున్న పాశం కుమార్ తేజ ఇటీవల కాలంలో అప్పుల్లో కూరుకుపోయాడు. తనకు స్థలం అద్దెకిచ్చిన విజయలక్ష్మి దగ్గర నగలు ఉన్నాయని గ్రహించి వాటిని కాజేసేందుకు పక్కా ప్లాన్‌ వేశాడు. అందుకు తన దగ్గర గుమాస్తాగా పనిచేస్తున్న యార్లగడ్డ రాము సహాయం తీసుకున్నాడు.

స్థలం విషయం మాట్లాడేందుకు సెప్టెంబర్ 15వ తేదీన విజయలక్ష్మిని తన షాపు దగ్గరకు రప్పించాడు పాశం కుమార్‌తేజ. ముందుగానే వేసుకున్న పధకం ప్రకారం సైనేడ్‌ కలిపిన కూల్‌డ్రింక్‌ను విజయలక్ష్మికి ఇచ్చాడు. విషం కలిసిన కూల్‌డ్రింక్‌ తాగిన విజయలక్ష్మి అక్కడికక్కడే చనిపోవడంతో ఆమె మృతదేహాన్ని ఓ అద్దె కారులో దొనకొండ దగ్గరకు తీసుకెళ్ళాడు. గంగదేవిపల్లి సమీపంలో ఆమె మృతదేహాన్ని పెట్రోల్‌ పోసి నిప్పంటించి కాల్చేశాడు. ఆ తరువాత ఏమీ ఎరగనట్టు పాశం కుమార్‌ తేజ చీరాలకు తిరిగి వచ్చాడు. ఈ క్రమంలో సెల్‌ఫోన్‌ ట్రాకింగ్‌ ద్వారా పోలీసులకు తనపై అనుమానం రాకుండా ఈ మొత్తం దారుణం జరిగుతున్నంత సేపు తన సెల్‌ఫోన్‌ను షాపులోనే ఉంచేశాడు. దొనకొండకు వెళుతున్నా సెల్‌ఫోన్‌ లేకుండానే వెళ్ళాడు. దీంతో పోలీసులకు తనపై అనుమానం రాదనే భావించాడు.

ఆ తరువాత నాలుగు రోజుల తరువాత విజయలక్ష్మికి ఆమె కుమారుడు ఫోన్‌ చేస్తున్నా స్పందన లేకపోవడంతో ఆనుమానంతో ఆమె కొడుకు వెంకటరమణ చీరాల వచ్చాడు. తన తల్లి కనిపించడం లేదంటూ చీరాల ఒన్‌టౌన్‌ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. తనకు కూడా విజయలక్ష్మి కనిపించలేదంటూ పాశం కుమార్‌తేజ పోలీసుల విచారణలో తెలిపాడు. అయితే సిసి కెమెరా పుటేజ్‌లో పాశం కుమార్‌తేజ, అతని గుమాస్తా రాములు కలిసి ఓ కారులో విజయలక్ష్మిని తీసుకెళుతున్నట్టు చీరాల ఒన్‌టౌన్‌ సిఐ శ్రీనివాసరావు గుర్తించారు. దీంతో పాశం కుమార్‌తేజను పోలీసులు అదుపులోకి తీసుకుని తమదైన స్టైల్లో విచారించడంతో చేసిన దారుణాన్ని పోలీసులకు తెలిపాడు నిందితుడు పాశం కుమార్‌తేజ. దీంతో పాశం కుమార్‌తేజను, అతనికి సహకరించిన రామును పోలీసులు అరెస్ట్‌ చేసి జైలుకు పంపించారు.

మరిన్ని క్రైమ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..