
తిరుమల కొండపై పాముల సంచారం కలవరపెడుతోంది. తిరుమలలో తరచూ భక్తుల కంటపడుతున్న పాములు బుసలు కొడుతుండటంతో భక్తులు బెంబేలెత్తిపోతున్నారు. నిత్యం టీటీడీ సిబ్బందికి లేదా భక్తులకు పాములు కనిపిస్తూనే ఉన్నాయి. విష సర్పాలు అలజడి చేస్తున్న పరిస్థితి ఆందోళన కలిగిస్తుండగా.. నవరాత్రి బ్రహ్మోత్సవాల్లో ఒకవైపు మలయప్ప స్వామి శేష వాహనంపై ఊరేగిస్తూ భక్తులకు దర్శనమిస్తుంటే మరోవైపు పాములు భక్తులు కంటపడుతుండటం ఆందోళన కలిగిస్తోంది. తాజాగా.. 9 అడుగుల జర్రిపోతూ వకుళ మాత గెస్ట్ హౌస్ వద్ద స్థానికుల కంటబడింది. పాము సంచారంతో వకుళ మాత గెస్ట్ హౌస్ సిబ్బంది అప్రమత్తమయింది. 9 అడుగుల జర్రిపోతును గుర్తించి టిటిడి సిబ్బందికి సమాచారం ఇచ్చారు..
ఈ మేరకు టీటీడీ ఫారెస్ట్ విభాగంలో పాములు పట్టే కాంట్రాక్టు ఉద్యోగి భాస్కర్ నాయుడుకు సమాచారం ఇచ్చారు. అక్కడికి చేరుకున్న భాస్కర్ నాయుడు 9 అడుగుల జర్రిపోతును పట్టుకునే ప్రయత్నం చేశారు. చాకచక్యంగా సేఫ్గా జెర్రిపోతును చేతితో పట్టుకుని బ్యాగ్ లో బంధించారు. అనంతరం భాస్కర్ నాయుడు పామును శేషాచలం అటవీ ప్రాంతంలో వదిలి పెట్టారు. దీంతో భక్తులు, టిటిడి సిబ్బంది ఊపిరి పీల్చుకున్నారు.
అయితే.. శేషాచలం అటవీ ప్రాంతం నుంచి బయటకు వస్తున్న పాముల సంఖ్య ఈ మధ్యకాలం లో ఎక్కువైందని.. ఏక్కడైనా కనిపిస్తే వెంటనే సమచారం అందించాలని భాస్కర్ నాయుడు సూచించారు.
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..