పదో తరగతి బాలిక కడుపులో 750 గ్రాముల వెంట్రుకలు..! ఎలా వచ్చాయంటే..

అనంతపురం సర్వజనాసుపత్రి వైద్యులు అరుదైన శస్త్రచికిత్సను విజయవంతంగా నిర్వహించారు. రాయదుర్గానికి చెందిన 15 ఏళ్ల బాలిక కడుపులో పేరుకుపోయిన 750 గ్రాముల వెంట్రుకల ముద్దను తొలగించారు. చిన్నప్పటి నుంచి వెంట్రుకలు తినే అలవాటు ఉన్న బాలికకు 'రాంపుజెల్ సిండ్రోమ్' అనే అరుదైన సమస్య ఉన్నట్లు వైద్యులు గుర్తించారు. సుమారు 1.2 మీటర్ల పొడవున్న వెంట్రుకల ముద్దను శస్త్రచికిత్స ద్వారా తొలగించగా, ప్రస్తుతం బాలిక ఆరోగ్యం నిలకడగా ఉంది..

పదో తరగతి బాలిక కడుపులో 750 గ్రాముల వెంట్రుకలు..! ఎలా వచ్చాయంటే..
Anantapur Doctors Remove 750 Gram Hairball From 10th Class Student Stomach

Updated on: Nov 18, 2026 | 7:24 AM

అనంతపురం, నవంబర్ 18: ఆంధ్రప్రదేశ్‌లోని అనంతపురం సర్వజనాసుపత్రి వైద్యులు అరుదైన శస్త్రచికిత్సను విజయవంతంగా నిర్వహించారు. 15 ఏళ్ల బాలిక కడుపులో పేరుకుపోయిన ఏకంగా 750 గ్రాముల వెంట్రుకల ముద్దను ఆపరేషన్ చేసి తొలగించారు. గత కొంతకాలంగా తీవ్రమైన కడుపునొప్పి, వాంతులతో బాధపడుతున్న బాలికకు పరీక్షలు నిర్వహించగా ఈ విషయం బయటపడింది. ప్రస్తుతం విద్యార్థిని ఆరోగ్యం నిలకడగా ఉన్నట్లు వైద్యులు వెల్లడించారు. రాయదుర్గంలోని ఓ పాఠశాలలో పదో తరగతి చదువుతున్న 15 ఏళ్ల బాలిక తీవ్రమైన కడుపునొప్పి, వాంతులతో పాటు క్రమంగా బరువు తగ్గిపోతుండటంతో కుటుంబ సభ్యులు ఆమెను అనంతపురం సర్వజనాసుపత్రిలో చేర్పించారు. వైద్యులు వివిధ రకాల పరీక్షలు నిర్వహించగా ఆశ్చర్యకరమైన విషయం వెలుగులోకి వచ్చింది.

చిన్నప్పటి నుంచి బాలికకు వెంట్రుకలను తినే అలవాటు ఉన్నట్లు వైద్యులు గుర్తించారు. ఈ అలవాటు కారణంగా ఆమె కడుపులో పెద్ద మొత్తంలో వెంట్రుకలు పేరుకుపోయినట్లు నిర్ధారించారు. బాలికకు వెంట్రుకలను తినే అలవాటును వైద్య పరిభాషలో ‘ట్రైకోఫాజియా’ (Trichophagia) అంటారు. ఇలా తిన్న వెంట్రుకలు జీర్ణం కాకుండా కడుపులో పేరుకుపోయి పెద్ద ముద్దగా మారితే దానిని ‘ట్రైకోబెజార్’ (Trichobezoar) అంటారు. ఈ పరిస్థితి పేగుల వరకు విస్తరించినప్పుడు అరుదైన ‘రాంపుజెల్ సిండ్రోమ్’ (Rapunzel Syndrome)గా పిలుస్తారు. బాలికకు ఈ సమస్య ఉన్నట్లు వైద్యులు నిర్ధారించారు.

ఇవి కూడా చదవండి

సర్జరీ విభాగం హెచ్‌ఓడీ డాక్టర్ రామస్వామినాయక్ తెలిపిన వివరాల ప్రకారం.. వైద్యుల బృందం మంగళవారం బాలికకు ఎక్స్‌ప్లోరేటరీ లాపరోటమీ శస్త్రచికిత్స నిర్వహించింది. అనంతరం గ్యాస్ట్రోటమీ విధానం ద్వారా కడుపులో పేరుకుపోయిన వెంట్రుకల ముద్దను బయటకు తీశారు. ఈ వెంట్రుకల ముద్ద సుమారు 1.2 మీటర్ల పొడవు, 750 గ్రాముల బరువు ఉన్నట్లు వైద్యులు వెల్లడించారు. క్లిష్టమైన ఈ శస్త్రచికిత్సను విజయవంతంగా పూర్తి చేశారు. వైద్యుల సమయస్ఫూర్తి, సమన్వయంతో బాలికకు విజయవంతంగా శస్త్రచికిత్స జరిగింది. ప్రస్తుతం ఆమె ఆరోగ్యం నిలకడగా ఉందని ఆసుపత్రి వైద్యులు తెలిపారు. చిన్నప్పటి నుంచి వెంట్రుకలు తినే అలవాటు ఉన్నవారిలో ఇలాంటి సమస్యలు తలెత్తే అవకాశం ఉంటుంది. అందువల్ల పిల్లల్లో ఇటువంటి అలవాట్లను తల్లిదండ్రులు నిర్లక్ష్యం చేయకుండా వైద్యుల సలహా తీసుకోవడం అవసరం. ముఖ్యంగా కడుపునొప్పి, వాంతులు, ఆకలి తగ్గడం, బరువు తగ్గడం వంటి లక్షణాలు కనిపిస్తే వెంటనే వైద్యులను సంప్రదించాలి.

Loading...
Unable to load recommendations.
Follow Us