Jethwani Case: సినీ నటి జెత్వానీ కేసులో ముగ్గురు ఐపీఎస్‌ల చుట్టూ బిగుస్తున్న ఉచ్చు! కీలక ఆధారాలు లభ్యం

|

Sep 17, 2024 | 8:11 AM

ముంబయికి చెందిన సినీనటి కాదంబరీ జెత్వానీపై అక్రమ కేసు వ్యవహరంలో సీనియర్‌ ఐపీఎస్‌ అధికారులు పీఎస్‌ఆర్‌ ఆంజనేయులు, విజయవాడ మాజీ సీపీ కాంతిరాణా తాతా, ఐపీఎస్‌ అధికారి విశాల్‌ గున్నీల చుట్టూ ఉచ్చు బిగుస్తుంది. ఈ కేసులో వీరిని నిందితులుగా చేర్చే అవకాశమున్నట్లు సమాచారం. దీనిపై పోలీసు ఉన్నతాధికారులు న్యాయనిపుణులను సంప్రదిస్తున్నారు. న్యాయసలహాలు..

Jethwani Case: సినీ నటి జెత్వానీ కేసులో ముగ్గురు ఐపీఎస్‌ల చుట్టూ బిగుస్తున్న ఉచ్చు! కీలక ఆధారాలు లభ్యం
Kadambari Jethwani Harassing Case
Follow us on

అమరావతి, సెప్టెంబర్‌ 17: ముంబయికి చెందిన సినీనటి కాదంబరీ జెత్వానీపై అక్రమ కేసు వ్యవహరంలో సీనియర్‌ ఐపీఎస్‌ అధికారులు పీఎస్‌ఆర్‌ ఆంజనేయులు, విజయవాడ మాజీ సీపీ కాంతిరాణా తాతా, ఐపీఎస్‌ అధికారి విశాల్‌ గున్నీల చుట్టూ ఉచ్చు బిగుస్తుంది. ఈ కేసులో వీరిని నిందితులుగా చేర్చే అవకాశమున్నట్లు సమాచారం. దీనిపై పోలీసు ఉన్నతాధికారులు న్యాయనిపుణులను సంప్రదిస్తున్నారు. న్యాయసలహాలు అందిన తర్వాత ఒకట్రెండు రోజుల్లో నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది.

ఈ కేసులో కుక్కల విద్యాసాగర్‌తో పాటు ఐపీఎస్‌ అధికారులు పీఎస్‌ఆర్‌ ఆంజనేయులు, కాంతిరాణా, విశాల్‌ గున్నీలు చట్టవిరుద్ధంగా వ్యవహరించి ఫోర్జరీ పత్రాల ఆధారంగా తనపై అక్రమ కేసు పెట్టి, అరెస్టు చేశారని సెప్టెంబర్‌13న జెత్వానీ ఇబ్రహీంపట్నం పీఎస్‌లో ఫిర్యాదు చేశారు. చంపేస్తామని బెదిరించడంతోపాటు ఇంటి తాళాలు పగలకొట్టి అక్రమంగా చొరబాటు, ఫోర్జరీ, తప్పుడు పత్రాల సృష్టి తదితర సెక్షన్ల కింద పోలీసులు నమోదు చేశారు. ఎఫ్‌ఐఆర్‌లో విద్యాసాగర్‌ను (ఏ1) నిందితుడిగా చేర్చారు. మిగతా వారిని అదర్స్‌ గా పేర్కొన్నారు. అయితే వారి పేర్లు ప్రస్తావించలేదు. ఇప్పటివరకూ జరిపిన దర్యాప్తులో ముగ్గురు ఐపీఎస్‌లు నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరించినట్లు తేలింది. మరోవైపు జెత్వానీ ఫిర్యాదుతో ముగ్గురు ఐపీఎస్‌ల ప్రమేయాన్ని నిర్ధారించే ఆధారాలు లభించాయి. దీంతో వీరిని కూడా నిందితులుగా చేర్చే అవకాశం ఉంది. ఇప్పటికే ఈ ముగ్గురినీ ప్రభుత్వం సస్పెండ్‌ చేసింది. త్వరలోనే వారిపై ఆర్టికల్‌ ఆఫ్‌ ఛార్జెస్‌ను నమోదు చేయసి, అనంతరం విచారణ ప్రారంభిస్తారు. ఏ1గా ఉన్న విద్యాసాగర్‌ కోసం పోలీసులు గాలిస్తున్నారు. అతన్ని అరెస్టు చేసి విచారించిన తర్వాత దీనివెనకున్న అసలు నేరస్తుల చిట్టా బయటపడుతుందని పోలీసులు భావిస్తున్నారు.

మరోవైపు ఈ కేసుకు సంబంధించి డీజీపీ విశాల్‌ గున్నీ ప్రభుత్వానికి నివేదిక ఇచ్చారు. ఇందులో పలు కీలక విషయాలు వెల్లడించినట్లు సమాచారం. సినీనటి కాదంబరీ జెత్వానీని అరెస్టు చేయడానికి ఫిబ్రవరి 2న ఉదయం 7.30కు టాస్క్‌ఫోర్స్‌ ఏడీసీపీ రమణమూర్తి, సీఐ శ్రీధర్, ఎస్సై షరీఫ్‌ విజయవాడ నుంచి ముంబయికి విమానంలో బయల్దేరారు. గున్నీ హైదరాబాద్‌లో వారితో కలిసి, అందరూ ఒకే విమానంలో ప్రయాణించి ముంబయికి చేరుకున్నారు. అదేరోజు ఉదయం 11.30కు కుక్కల విద్యాసాగర్‌ మరో విమానంలో హైదరాబాద్‌ నుంచి ముంబయికి పయనమయ్యారు. వీరంతా అదే రోజు సాయంత్రం ముంబయిలో ఓ చోట కలుసుకొని వ్యూహరచన చేసుకున్నారు. విద్యాసాగర్‌ ద్వారా జెత్వానీ కదలికలు తెలుసుకున్నారు. ఆమె కారులో ప్రయాణిస్తుండగా మార్గమధ్యలో అదుపులోకి తీసుకుని అరెస్టు చేశారు. ముందస్తు ప్లాన్‌ ప్రకారంగానే ఇదంతా జరిగిందని తాజాగా డీజీపీ విశాల్‌ గున్నీ ప్రభుత్వానికి సమర్పించిన నివేదికలో పేర్కొన్నట్లు తెలిసింది.

ఇవి కూడా చదవండి

మరిన్ని ఆంధ్రప్రదేశ్‌ వార్తల కోసం క్లిక్‌ చేయండి.