గర్భాశయం లేకుండా పుట్టింది.. అక్క కానుకతో తల్లి కాబోతోంది!

తల్లి కావడం ప్రతి మహిళ జీవితంలో మరువలేని తీపి జ్ఞాపకం. అరుదైన వ్యాధి కారణంగా గర్భాశయాన్ని కోల్పోయినా బ్రిటన్‌కు చెందిన 36 ఏళ్ల లారెన్ ఫౌలర్ నిరాశపడలేదు. అక్క ఇచ్చిన అపురూప కానుకతో గర్భం దాల్చింది. పిల్లల్ని కనాలన్న తన కలను నెరవేర్చుకుంది.

గర్భాశయం లేకుండా పుట్టింది.. అక్క కానుకతో తల్లి కాబోతోంది!
Woman Without Womb Pregnant After Sister Donates Uterus

Updated on: Aug 19, 2026 | 8:08 PM

యుక్తవయస్సులోకి వచ్చాక లారెన్‌కు ఒక షాకింగ్ విషయం తెలిసింది. ఆమె ‘మేయర్-రోకిటాన్స్కీ-కుస్టర్-హౌజర్ సిండ్రోమ్’ అనే అరుదైన జన్యుపరమైన సమస్యతో జన్మించింది. ఈ వ్యాధి ఉన్న మహిళల్లో గర్భాశయం సరిగ్గా పెరగదు లేదా అసలు అభివృద్ధి చెందదు. అండాశయాలు ఆరోగ్యంగా ఉన్నప్పటికీ, సహజ పద్ధతిలో గర్భం దాల్చడం సాధ్యపడదు . తాను ఎప్పటికీ సొంత బిడ్డకు జన్మనివ్వలేనని లారెన్ కుంగిపోయింది. అయితే ఆమె ఆశలను నిలబెట్టడానికి ఆమె అక్క ముందుకు వచ్చింది! ఇప్పటికే ముగ్గురు పిల్లలకు తల్లయిన 40 ఏళ్ల అక్క కెల్లీ తన గర్భాశయాన్ని దానం చేసింది.

అక్క అపురూపమైన కానుక!

 

లారెన్ బాధను చూడలేని ఆమె అక్క, తన గర్భాశయాన్ని చెల్లికి దానం చేయడానికి సిద్ధపడింది. డాక్టర్ల బృందం దాదాపు 9 గంటల పాటు కష్టపడి ఎంతో  సం క్లిష్టమైన గర్భాశయ మార్పిడి ఆపరేషన్‌ ను విజయవంతంగా పూర్తి చేసారు. అక్క యుటెరస్‌ను లారెన్ శరీరంలోకి విజయవంతంగా అమర్చారు. అనంతరం ఇన్ విట్రో ఫెర్టిలైజేషన్ పద్ధతి ద్వారా పిండాన్ని ప్రవేశపెట్టారు. ఆ ప్రక్రియ కూడా సక్సెస్‌ కావడంతో లారెన్‌ పట్టరాని ఆనందంతో వేడుక చేసుకుంది. ప్రస్తుతం 26 వారాల గర్భంతో తల్లి, బిడ్డ ఇద్దరూ క్షేమంగా ఉన్నట్లు వైద్యులు తెలిపారు. గర్భాశయ లోపాలతో బాధపడుతున్న ఎందరో మహిళలకు గర్భాశయ ట్రాన్స్‌ప్లాంటేషన్  ఒక గొప్ప వరమని వైద్యులు తెలిపారు.

వైద్య చరిత్రలోనే జరిగిన ఈ అద్భుతంపై లారెన్ ఫౌలర్‌ ఇంటర్వ్యూ ఇచ్చింది. అత్యంత  సంక్లిష్టమైన సర్జరీకి తను మానసికంగా, శారీరకంగా ప్రిపేర్ అయ్యానంది. సర్జరీ ఎంతో కాంప్లికేటడ్ అంటూ తనను పదే పదే హెచ్చరించారనీ రికవరీ ఓ పెద్ద సవాలుగా ఉంటుందని అందరూ చెప్పారని తెలిపింది. వారు చెప్పినట్లుగానే రికవరీ తనకు పెద్ద పరీక్ష పెట్టిందనీ తనలో ఎనర్జీని లాగేస్తూ, ప్రతి రోజూ ఆత్మవిశ్వాసాన్ని ధైర్యాన్ని వెతుక్కునేలా చేసిందనీ అంది. ప్రతీ చిన్న ముందడుగు పడుతుండటంతో  గత 20 ఏళ్లుగా మాతృత్వం కోసం ఎదురుచూస్తున్న తను ఆ పోరాటాన్ని మధ్యలో వదిలేందుకు ఇష్టపడలేదనీ చెప్పుకొచ్చింది. అక్టోబరు నెలలో సిజేరియన్ ద్వారా ప్రసవం చేయాలని వైద్యులు ప్లాన్‌ చేస్తున్నారు.

ప్రస్తుతం లారెన్ ఫౌలర్ 26 వారాల గర్భవతిగా ఉన్నట్లు పీపుల్‌ మేగజైన్‌ ప్రచురించింది. తన భాగస్వామి డేవిడ్‌తో కలిసి తొలి సంతానం కోసం ఆమె ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తోంది. గర్భాశయం లేని మహిళ గర్భాశయ మార్పిడి ద్వారా గర్భం దాల్చి తల్లి కాబోతుండటం వైద్య చరిత్రలోనే అత్యంత అరుదైన ఘటనగా నిలిచింది. అక్క ప్రేమ, ఆధునిక వైద్యశాస్త్రం కలబోసి ఒక కొత్త జీవితానికి ఊపిరి పోశాయని నెటిజన్లు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.

Loading...
Unable to load recommendations.
Follow Us