వికీలీక్స్ పేరిట పలు దేశాధినేతల గుండెల్లో రైళ్లు పరిగెత్తించిన ఆ సంస్థ కోఫౌండర్ జూలియన్ అసాంజే ఎట్టకేలకు అరెస్ట్ అయ్యారు. వివిధ దేశాల మధ్య జరిగిన కీలక ఒప్పందాలు, దేశ రహస్యాలను అసాంజే తన సంస్థ ద్వారా బట్టబయలు చేశారు. దాంతో ఆయా దేశాలు ఆయనపై గుర్రుగా ఉన్నాయి.
ఇదిలా ఉంటే కొన్నాళ్ల కిందట అసాంజేపై లైంగిక వేధింపుల ఆరోపణలు రావడంతో ఆయనను అరెస్ట్ చేసేందుకు స్వీడన్ పోలీసులు తీవ్రంగా యత్నించారు. ఆ కేసుకు భయపడిన అసాంజే ఏడేళ్లుగా లండన్లోని ఈక్వెడార్ దౌత్యకార్యాలయంలో ఆశ్రయం పొందుతున్నాడు. కానీ అక్కడ అసాంజే శరణార్ధిలా కాకుండా ఇష్టం వచ్చిన రీతిలో వ్యవహరిస్తుండటంతో ఈక్వెడార్ అధికారులు అతడికి ఇచ్చిన ఆశ్రయాన్ని ఉపసంహరించుకున్నారు. దాంతో బ్రిటన్ పోలీసులు ఈక్వెడార్ దౌత్య కార్యాలయంలోకి ప్రవేశించి అసాంజేను అదుపులోకి తీసుకున్నారు. యూకేలో అతడిపై న్యాయవిచారణ జరుగుతుందని బ్రిటన్ వర్గాలు తెలిపాయి.